తమిళనాడులో రాజకీయం అంటే సినీ ప్రముఖులే గుర్తువస్తారు. ఎందుకంటే తమిళ హీరోలు ఇప్పటికే ప్రత్యేక సభలు ఏర్పాటు చేశారు. రాజకీయాల వైపు వస్తున్నట్లు హింట్ ఇచ్చారు. అయితే తాజాగా రజినీకాంత్ కుటుంబం గురించి ఓ వార్త తెరపైకి వచ్చింది. ఆయన భార్య లతా రజినీకాంత్‌కు రాజ్యసభ పదవి దక్కే అవకాశముందని ప్రచారం జోరుగా సాగుతోంది. ఇప్పటికే ఈ విషయంపై ఢిల్లీ పెద్దలు రజినీకాంత్, లతా రజనీకాంత్‌లతో చర్చలు జరిపినట్లు పలు కథనాలు వచ్చాయి. అయితే ఈ ప్రచారంపై ఇప్పటివరకు అధికారిక స్పష్టత లేదు. అసలు లతా రజినీకాంత్ పేరు ఎందుకు తెరపైకి వచ్చింది? ఇప్పుడు చూద్దాం..
రాజ్యాంగం ప్రకారం 12 మందిని
భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 80 ప్రకారం రాజ్యసభకు రాష్ట్రపతి 12 మంది సభ్యులను నామినేట్ చేయవచ్చు. సాహిత్యం, విజ్ఞానశాస్త్రం, కళలు, సామాజిక సేవ వంటి రంగాల్లో ప్రత్యేక పరిజ్ఞానం, అనుభవం ఉన్నవారిని ఈ కోటా కింద ఎంపిక చేస్తారు. సాధారణంగా కేంద్ర ప్రభుత్వం సిఫారసు చేసిన పేర్ల ఆధారంగా ఈ నియామకాలు జరుగుతాయి. గతంలో క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, సంగీత దర్శకుడు ఇళయరాజా, సినీ రచయిత విజయేంద్ర ప్రసాద్ వంటి ప్రముఖులు ఈ విధంగా రాజ్యసభకు వెళ్లారు. ఇప్పుడు అదే కోటాలో లతా రజినీకాంత్ పేరు పరిశీలనలో ఉందనే ప్రచారం సాగుతోంది.
లతా రజనీకాంత్ పేరుపై చర్చ
లతా రజినీకాంత్ కేవలం సూపర్‌స్టార్ భార్యగానే కాకుండా.. గాయని, విద్యారంగంతో అనుబంధం ఉన్న వ్యక్తిగా, సామాజిక కార్యక్రమాల్లో పాల్గొన్నవారిగా గుర్తింపు పొందారు. ఈ నేపథ్యంలో సామాజిక సేవా రంగంలో ఆమె చేసిన కృషిని పరిగణనలోకి తీసుకుని రాజ్యసభకు నామినేట్ చేసే అవకాశం ఉందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే ఆమె పేరును అధికారికంగా సిఫారసు చేశారా? లేదా? అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. రజినీకాంత్ గతంలో రాజకీయాల్లోకి వస్తానని, సొంత పార్టీ ఏర్పాటు చేస్తానని ప్రకటించారు. అయితే ఆ తర్వాత ఆరోగ్య పరిస్థితులు, ఇతర కారణాలను ప్రస్తావిస్తూ రాజకీయ ప్రవేశ ప్రయత్నాన్ని విరమించుకున్నారు.
(ఇదీ చదవండి: ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు కమిషనర్ సజ్జనార్ బిగ్ వార్నింగ్..)


