ఎన్నో కోట్లమంది అభిమానం సంపాదించుకున్న సూపర్ స్టార్ రజనీకాంత్, మెగాస్టార్ చిరంజీవి, అమితాబ్ బచ్చన్ లాంటి దిగ్గజాలకు నటనలో ఓనమాలు నేర్పించిన గురువు, డైరెక్టర్ కేఎస్ నారాయణస్వామి (92) మరణించారు. వయసు రీత్యా గత కొన్నాళ్ల నుంచి ఇబ్బంది పడుతున్న ఈయన సోమవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఈ సందర్భంగా రజనీకాంత్ స్వయంగా నారాయణస్వామి ఇంటికి వెళ్లి, ఆయన కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు. సంతాపం వ్యక్తం చేశారు.
ఈయన పేరు నారాయణ స్వామి అయినప్పటికీ ఇండస్ట్రీలో మాత్రం ఈయన కేఎస్ గోపాల్ అనే పేరుతో ఫేమస్. మద్రాస్ ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్, మద్రాస్ దూరదర్శన్ కేంద్రానికి డైరెక్టర్‌గానూ పనిచేశారు. రజనీకాంత్‌కి యాక్టింగ్ నేర్పడంతో పాటు దిగ్గజ దర్శకుడు బాలచందర్‌కి రజనీని పరిచయం చేసింది ఈయనే. అలా రజనీ-బాలచందర్ కాంబోలో 'అపూర్వ రాగంగళ్' సినిమా వచ్చింది. దీంతో రజనీ కెరీర్ మారిపోయింది. అలాంటి నారాయణస్వామి ఇప్పుడు చనిపోవడంతో ఆయన సేవలు స్మరించుకుంటూ పలువురు ప్రముఖులు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.


