‘యాక్టర్ కావాలని నేనెప్పుడూ అనుకోలేదు. అలా జరిగిపోయింది. సింగర్ కావాలనే ఇండస్ట్రీకి వచ్చాను. దాదాపు 40 సినిమాలకు మ్యూజిక్ డైరెక్టర్ గా వర్క్ చేశాను. వచ్చిన అవకాశాలు వదులుకోకుండా నటిస్తున్నాను. నటుడిగా పెద్ద ప్రతిభావంతుడిని అనుకోవడం లేదు. అయితే సిన్సియర్ గా నా పాత్రకు న్యాయం చేసేలా ప్రయత్నిస్తున్నాను’ అని అన్నారు ప్రముఖ సంగీత దర్శకుడు, నటుడు రఘు కుంచె. ఆయన ఆయన ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘దేవగుడి’. పుష్యమి ఫిలిం మేకర్స్ బ్యానర్ పై బెల్లం సుధారెడ్డి సమర్పణలో బెల్లం రామకృష్ణా రెడ్డి రచనా దర్శకత్వంలో స్వీయ నిర్మాతగా రూపొందిన ఈ చిత్రంలో శౌర్య, నరసింహ, అనుశ్రీ హీరో హీరోయిన్లుగా నటించారు. ఈ నెల 30న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ నేపథ్యంలో దర్శకుడు రామకృష్ణారెడ్డితో కలిసి రఘు కుంచె మీడియాతో ముచ్చటించారు.
నటుడు రఘుకుంచె మాట్లాడుతూ.. ఈ సినిమాలో నేను వీరారెడ్డి అనే పాత్రలో నటించాను. ఆ పాత్ర కోసం దర్శకుడు రామకృష్ణా రెడ్డి గారు ఎలా చెబితే అలా పర్ ఫార్మ్ చేశాను. రాయలసీమ యాసలో డైలాగ్స్ చెప్పాను. ఈ సినిమా షూటింగ్ అంతా రియల్ లొకేషన్స్ లో చేశాం. నేను జీపులో వెళ్తుంటే నా పక్కన ఓ ఇరవై సుమోలు, జీబ్స్ వస్తుంటాయి. అన్ని వాహనాలతో కాన్వాయ్ లా వెళ్లడం పర్సనల్ గా గర్వంగా అనిపించేది. యాక్షన్ సీక్వెన్సుల్లో మాత్రం కొన్ని బాంబ్ బ్లాస్ట్స్ ఉన్నాయి. అప్పుడు మాత్రం భయమేసేది. ఈ సినిమాలో నేను ఒక పాట కంపోజ్ చేసి పాడాను. మనోజ్ బాజ్ పాయ్ ఫ్యామిలీ మ్యాన్ లో చేసినట్లు అలాంటి క్యారెక్టర్స్ లో నటించాలని ఉంది. ప్రస్తుతం నాలుగైదు చిత్రాల్లో నటిస్తున్నా’ అన్నారు.
దర్శక నిర్మాత బెల్లం రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. ‘ఫ్యాక్షన్ నేపథ్యంలో ఇప్పటిదాకా మనకు చాలా సినిమాలు వచ్చాయి. 30 ఏళ్ల క్రితం ట్రెండ్ అది. అయితే మా మూవీలో ఫ్యాక్షన్ నేపథ్యం ఉన్నా, అది కొంత వరకే చూపించాం. మెయిన్ గా స్నేహం, ప్రేమ, ఫ్యామిలీ ఎమోషన్స్ మీద కథ ట్రావెల్ అవుతుంది. సినిమాకు సెన్సార్ నుంచి మంచి ఫీడ్ బ్యాక్ వచ్చింది. కాస్త వయలెన్స్, రొమాంటిక్ సాంగ్ ఉందని రెండు కట్స్ తో ఎ సర్టిఫికెట్ ఇచ్చారు. నేనే దర్శకుడిని, నిర్మాతను కావడం వల్ల అనుకున్న కథను అనుకున్నట్లు తెరకెక్కించగలిగాను. సినిమా చూడాలని అనుకునే ప్రేక్షకులను ఎంకరేజ్ చేసేందుకు టికెట్స్ కూడా ఇవ్వాలనుకుంటున్నాం. సినిమాకు వీళ్ల ద్వారా పాజిటివ్ టాక్ స్ప్రెడ్ అవుతుందని ఆశిస్తున్నాం’ అన్నారు.


