ప్రముఖ సంగీత దర్శకుడు, సింగర్ రఘు దీక్షిత్ గురించి కొత్తగా పరిచయం అక్కర్లేదు. తెలుగులో సన్నాఫ్ సత్యమూర్తి, శ్రీమంతుడు, నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్, తొలిప్రేమ, కృష్ణార్జున యుద్ధం తదితర సినిమాల్లో పాటలు పాడాడు. గతేడాది అక్టోబరులో 50 ఏళ్ల వయసులో గాయని వరిజాశ్రీని పెళ్లి చేసుకున్నాడు. అయితే ఇతడికి భార్యతో 16 ఏళ్ల ఏజ్ గ్యాప్ ఉండటంపై ట్రోల్స్ వచ్చాయి. ఇప్పుడు వీటిపై రఘు స్పందించాడు. కొన్ని కామెంట్స్ ఎంతో బాధించాయని ఆవేదన వ్యక్తం చేశాడు.
(ఇదీ చదవండి: కొరియన్ అమ్మాయితో మహేశ్ బాబు మేనల్లుడి పెళ్లి)
'పబ్లిక్ లైఫ్‌లో ఉన్నప్పుడు మాకు సంబంధించి ప్రతి విషయంలోనూ అభిప్రాయాలు వస్తాయని ముందే తెలుసు. నిజం చెప్పాలంటే కొన్ని కామెంట్స్ చూసి చాలా బాధ అనిపించింది. అయితే సంతోషకరమైన జీవితానికి చిన్న రహస్యముంది. ఇంటర్నెట్‌లో వచ్చే ప్రతి కామెంట్ సీరియస్‌గా తీసుకోకూడదు. ఫ్యామిలీ, ఫ్రెండ్స్, నిజమైన ఫ్యాన్స్ ప్రేమాభిమానాలే నాకు ముఖ్యం'
'మేమిద్దరం చాలాకాలం నుంచి ఫ్రెండ్స్. ప్రేమ అనేది విచిత్రమైన అనుభూతి. అది ఎప్పుడు ఎలా వస్తుందో చెప్పలేం. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నప్పుడు అది సహజంగా జరిగిపోయింది. ప్రేమ, పరస్పర గౌరవం, నమ్మకంతో తీస్తున్న నిర్ణయాల ముందు బయటవాళ్లు చేసే ట్రోల్స్‌కి పెద్దగా విలువ ఉండదు. మా వైవాహిక జీవితం సంగీతానికి మాత్రమే పరిమితం కాదు. కలిసి నవ్వుకుంటాం. సంగీతం కంపోజ్ చేస్తాం. టూర్స్‌కి వెళ్తాం. ఇవే మా బంధాన్ని మరింత బలపరుస్తున్నాయి. ఆమె అద్భుతమైన సంగీత విద్వాంసురాలు మాత్రమే కాదు, గొప్ప వ్యక్తిత్వం కలిగిన మనిషి' అని రఘు దీక్షిత్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో విమర్శలకు కౌంటర్ ఇచ్చాడు.
(ఇదీ చదవండి: ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీపై క్లారిటీ)


