ప్రముఖ రచయిత అందెశ్రీ (Ande Sri) ఇక సెలవంటూ తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు. ఆదివారం రాత్రి తీవ్ర అస్వస్థతకు లోనైన ఆయన ఇంట్లోనే ఒక్కసారిగా కుప్పకూలారు. దీంతో ఆయన్ను వెంటనే గాంధీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం ఉదయం కన్నుమూశారు. అందెశ్రీ మరణంపై దర్శకనటుడు, పీపుల్స్ స్టార్ ఆర్. నారాయణమూర్తి (R Narayana Murthy) స్పందించారు.
తీరని లోటు
ప్రజాకవి అందెశ్రీ మరణం కేవలం తెలంగాణ సమాజానికే కాదు, యావత్ ప్రపంచ తెలుగు జాతికి తీరని లోటు అని విచారం వ్యక్తం చేశారు. ఇంకా మాట్లాడుతూ.. నా సినిమాలైన ఊరు మనదిరా, ఎర్ర సముద్రం, వేగు చుక్కలకు అమోఘమైన పాటలు ఇచ్చి చిత్ర విజయాలకు అందెశ్రీ ఎంతో దోహదం చేశారు. ఎర్ర సముద్రంలో మాయమైపోతున్నడమ్మ మనిషన్న వాడు అనే పాట తెలంగాణ పాఠ్య పుస్తకాలలో ముద్రించబడింది. అది ఆ పాట గొప్పతనం..
జన్మ ధన్యం
ఊరు మనదిరా మూవీలోని చూడా చక్కని తల్లి.. చుక్కల్లో జాబిల్లి అనే పాట తెలంగాణా ఉద్యమంలో కీలక పాత్ర వహించడమే కాదు నాటికి, నేటికి, ఏ నాటికైనా చిరస్థాయిగా నిలిచిపోతుంది. అలాగే కొమ్మ చెక్కితే బొమ్మరా.. కొలిచి మొక్కితే అమ్మరా అనే పాట కూడా అంతే బాగుంటుంది. అన్నింటినీ మించి జయ జయహే తెలంగాణ.. పాటతో ఆయన జన్మ ధన్యం చేసుకున్నారు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆ పాట గొప్పతనాన్ని గుర్తించి, గౌరవించి తెలంగాణ రాష్ట్ర గీతంగా ప్రకటించింది. ఇలాంటి గొప్ప పాటలు అందించిన ఆయన ఆత్మకు భగవంతుడు శాంతి చేకూర్చాలి అని ప్రార్థిస్తున్నాను అని నారాయణమూర్తి పేర్కొన్నారు.
చదవండి: ముక్కోటి గొంతుకల్ని ఏకం చేసిన అందెశ్రీ.. పాటతోనే ప్రాణం


