రిద్దీ కుమార్, మాళవికా మోహనన్, ప్రభాస్, నిధీ అగర్వాల్, మారుతి, టీజీ విశ్వప్రసాద్, కృతీ ప్రసాద్
‘‘ది రాజా సాబ్’ సినిమాలో మా నానమ్మగా జరీనా వాహబ్‌గారు నటించారు. ఆమె డబ్బింగ్ చెబుతుంటే నా సీన్స్ మర్చిపోయి నానమ్మ సీన్స్ చూస్తుండిపోయా. ఈ సినిమాలో నాతోపాటు మా నానమ్మ కూడా ఒక హీరో. ఇది నానమ్మ–మనవడి కథ’’ అని ప్రభాస్ తెలిపారు. ఆయన హీరోగా రూ పొందిన చిత్రం ‘ది రాజా సాబ్’. మారుతి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నిధీ అగర్వాల్, మాళవికా మోహనన్, రిద్దీ కుమార్ హీరోయిన్లుగా నటించారు. టీజీ విశ్వప్రసాద్, కృతీ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం జనవరి 9న రిలీజ్ కానుంది.
శనివారం నిర్వహించిన ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ప్రభాస్ మాట్లాడుతూ– ‘‘నేను, మారుతి కలిసినప్పుడు అన్నీ యాక్షన్ సినిమాలు అయిపోతున్నాయి... ఫ్యాన్ ్సని ఎంటర్‌టైన్ చేయాలన్నాను. ఫైనల్‌గా ఈ హారర్ కామెడీ సెట్ అయింది. నేనైతే మారుతిగారి రైటింగ్‌కి ఫ్యాన్ అయిపోయాను. క్లైమాక్స్‌ని పెన్ తో రాశావా? గన్ తో రాశావా? నిజం చెప్పు డార్లింగ్ (మారుతి). కొత్తపాయింట్ ఇది. ఈ సినిమాకి విశ్వప్రసాద్‌గారు హీరో. మూడేళ్లపాటు ఈ మూవీ తీసినప్పుడు.. అనుకున్న బడ్జెట్‌కంటే ఎక్కువ అవుతున్నా మేమైనా భయపడ్డాం కానీ ఆయన భయపడలేదు.. ఏంటి సార్ మీ ధైర్యం (నవ్వుతూ).
ఈ మూవీ అనుకున్నప్పుడు తమన్ ఒక్కడే చేయగలడు... ఈ లెవల్ ఆర్‌ఆర్ చేయగలిగేవారు ఎవరున్నారు మనకి ఇండియాలో అనుకున్నాం. కెమెరామేన్ కార్తీక్‌గారు అద్భుతమైన వర్క్ చేశారు. రామ్–లక్ష్మణ్, సాల్మోన్ మాస్టర్స్ ఫైట్స్ ఇరగదీశారు. మనకి పదిహేనేళ్ల తర్వాత వినోదం అందిస్తున్నారు మారుతిగారు. మరి... చూసుకోండి. అందులోనూ సంక్రాంతికి వస్తున్నాం. సంక్రాంతి సినిమాలన్నీ బ్లాక్‌బస్టర్ అవ్వాలి... మా ‘ది రాజా సాబ్’ కూడా అయిపోతే ఇంకా హ్యాపీ. ఇక వెరీ ఇంపార్టెంట్. సీనియర్ సీనియరే (సంక్రాంతి పోటీలో ఉన్న సీనియర్స్).సీనియర్ దగ్గర నుంచి నేర్చుకున్నదే మేం... సీనియర్స్ తర్వాతే మేం’’ అని చెప్పారు.
డైరెక్టర్ మారుతి మాట్లాడుతూ– ‘‘రాజా సాబ్’ వెనక బలంగా నిలబడింది ఇద్దరు. ఒకరు ప్రభాస్‌గారు, మరొకరు విశ్వప్రసాద్‌గారు. ఈ సినిమా ఎవర్నీ నిరాశపరచదు. ‘బాహుబలి’ తర్వాత ప్రభాస్‌గారు ప్రపంచమంతా గుర్తింపు తెచ్చుకున్నారు. మేము సౌతాఫ్రికాలో చిన్న ఊరిలో షూటింగ్ చేస్తుంటే, అక్కడి వారికి కూడా ప్రభాస్‌గారు తెలియడం మమ్మల్ని సర్‌ప్రైజ్ చేసింది. రాజమౌళిగారు కష్టపడి చేసినపాన్ ఇండియా ప్రయత్నం మా అందరికీ ఉపయోగపడుతోంది’’ అని చెప్పారు. టీజీ విశ్వప్రసాద్ మాట్లాడుతూ– ‘‘మా పీపుల్ మీడియా ఫ్యాక్టరీలో బిగ్గెస్ట్ స్టార్‌తో చేసిన బిగ్గెస్ట్ ఫిల్మ్ ఇది. మూడేళ్లు కష్టపడి నిర్మించాం’’ అని పేర్కొన్నారు. క్రియేటివ్ ప్రోడ్యూసర్ ఎస్‌కేఎన్, నిర్మాత వై. రవిశంకర్, మైత్రీ డిస్ట్రిబ్యూటర్ శశిధర్, నార్త్ డిస్ట్రిబ్యూటర్ అనిల్ తడాని తదితరులుపాల్గొన్నారు.


