ప్రియదర్శి పులికొండ, నాగదుర్గ హీరో హీరోయిన్లుగా నటిస్తోన్న లేటేస్ట్ మూవీ 'ఇడుపు కాయితం'. టైటిల్‌తోనే తెలంగాణ సెంటిమెంట్ తీసుకొచ్చారు డైరెక్టర్ వంశీరెడ్డి దొండపాటి. ఈ చిత్రాన్ని తెలంగాణ గ్రామీణ నేపథ్యంలోనే తెరకెక్కిస్తున్నారు. ఇటీవలే ఈ మూవీ టైటిల్‌తోనే వివాదం మొదలైంది. అప్పట్లో తెగ ట్రోల్స్ వచ్చాయి. తాజాగా ఈ మూవీ నుంచి ఓ క్రేజీ సాంగ్ రిలీజ్ చేశారు. ఇది కాస్తా మరో వివాదానికి కారణమైంది. తెలంగాణ సంస్కృతిని వక్రీకరిస్తున్నారని కొందరు మండిపడుతున్నారు. ఇంతకీ ఆ సాంగ్ ఎందుకు వివాదానికి కారణమైందో తెలుసుకుందాం.
ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా మేకర్స్ గడప అంటూ సాగే సాంగ్ రిలీజ్ చేశారు. ఈ పాటలోని విజువల్స్ నెట్టింట హల్‌చల్ చేశాయి. ఆ సాంగ్‌లో పెళ్లి వేడుక జరుగుతుండగా అతిథులకు నేరుగా మద్యం సర్వ్ చేస్తున్నట్లు చూపించారు. అదే ఈ వివాదానికి దారితీసింది. కొన్ని సీన్లు తెలంగాణ వాళ్లకు అస్సలు నచ్చలేదు. మన సంప్రదాయ వివాహ వేడుకల్లో ఎక్కడా ఇలాంటి పద్ధతులు పాటించమని మండిపడుతున్నారు.
కేవలం సినిమా పేరిట ఇలాంటి సీన్లు పెట్టి తమ సంస్కృతిని తప్పుగా చూపిస్తున్నారంటూ కొందరు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి విజువల్స్ తమను తక్కువ చేసి చూపించేలా ఉన్నాయంటూ సోషల్ మీడియాలో ట్రోలింగ్ మొదలయ్యాయి. మొదట టైటిల్‌తో మొదలైన వివాదం.. మరోసారి సాంగ్ రూపంలో మేకర్స్‌కు ఇబ్బందులు తెచ్చిపెట్టింది. అయితే కథకు తగినట్లుగానే సీన్స్ పెట్టి ఉంటారని డైరెక్టర్‌ను మరికొందరు సపోర్ట్ చేస్తున్నారు. కేవలం ఒక చిన్న పాటను చూసి కథపై నెగిటివ్ ప్రచారం చేయడం కరెక్ట్ కాదని భావిస్తున్నారు. కాగా.. ఈ చిత్రాన్ని తబితా సుకుమార్ సమర్పణలో సుకుమార్ రైటింగ్స్, బన్నీ వాస్ వర్క్స్ పతాకాలపై సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా డిసెంబరు 11న థియేటర్లలో సందడి చేయనుంది.


