
71వ జాతీయ అవార్డుల ప్రదానోత్సవం
‘‘కళలు, సినీ రంగాల్లో మహిళలు ప్రతిభ చాటుకుంటున్న ఉదాహరణలు చాలా ఉన్నాయి. ఈ తరుణంలో మహిళల ప్రతిభకు తగిన గుర్తింపు లభించాలి. జ్యూరీ, కేంద్ర, ప్రాంతీయ ΄్యానెల్‌లలో మహిళలకు తగిన ప్రాతినిధ్యం లభించాలి. విద్యాసంస్థల అవార్డుల ప్రదానోత్సవాల్లో ఎక్కువ సంఖ్యలో అమ్మాయిలు ఉండటం అనేది దేశ అభివృద్ధిని ప్రతిబింబిస్తుంది. ఇలాంటి ప్రయత్నం, కృషి సినిమా అవార్డుల్లోనూ ఉండాలి.
సినిమాల్లో మహిళలకు సమాన అవకాశాలు కల్పిస్తే అసాధారణ విజయాలు సాధిస్తారని నమ్ముతున్నాను’’ అని భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొ న్నారు. ప్రతిష్ఠాత్మక జాతీయ చలన చిత్ర అవార్డుల ప్రదానోత్సవం మంగళవారం ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో వైభవంగా జరిగింది. 71వ జాతీయ చలనచిత్ర పురస్కారాల విజేతలను కేంద్ర ప్రభుత్వం ఆగస్టు 1న ప్రకటించిన సంగతి తెలిసిందే.
2023 ఏడాదికిగాను ఎంపికైన ఉత్తమ చిత్రాలు, నటీనటులు, సాంకేతిక నిపుణులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పురస్కారాలతో పాటు ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ వేడుకలో ప్రముఖ మలయాళ నటుడు మోహన్ లాల్ ప్రతిష్ఠాత్మక దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్నారు. విజేతలకు పురస్కారాలు అందజేసిన అనంతరం ద్రౌపది ముర్ము మాట్లాడుతూ – ‘‘సినిమా కేవలం ఒక పరిశ్రమ మాత్రమే కాదు... దేశాన్ని, సమాజాన్ని మేల్కొల్పే శక్తిమంతమైన మాధ్యమం. పౌరులను ప్రభావితం చేసే సాధనం. ఒక సినిమాకు ప్రజాదరణ లభించడం మంచి విషయమే కావొచ్చు.
కానీ ప్రజా ప్రయోజనాలు, ముఖ్యంగా ఈ తరం యువతకు ప్రయోజనం చేకూర్చే విధంగా ఉండటం ఇంకా గొప్ప అంశం. ఈ రోజు అవార్డులు పొందిన చిత్రాల్లో తల్లులు తమ పిల్లలను తీర్చిదిద్దే కథలు, ధైర్యవంతమైన స్త్రీల కథలు, మంచి కుటుంబ కథలు, సామాజిక సంక్లిష్టతలను ఎదుర్కొంటూ పితృస్వామ్య విధానాలకు వ్యతిరేకంగా తమ గొంతును లేవనెత్తేటువంటి చిత్రాలు ఉండటం మంచి విషయం ‘గాంధీ తాత చెట్టు’ అనే తెలుగు సినిమాలో ఓ చిన్నారి ఒక చెట్టును సంరక్షించేందుకు సత్యాగ్రహ ఆందోళన చేస్తుంది.
ఇలాంటి కథలు బాలల్లో చైతన్యాన్ని, పర్యావరణం పట్ల సామాజిక స్పృహను కలిగిస్తాయి’’ అని చె ప్పారు. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుగ్రహీత మోహ న్లాల్‌ను ‘‘పరిపూర్ణ నటుడు’’ అని కూడా ద్రౌపది ముర్ము ప్రశంసించారు. ఈ వేడుకలో ఉత్తమ నటులుగా హీరో షారుక్ ఖాన్ (‘జవా న్’), విక్రాంత్ మస్సే (‘ట్వల్త్ ఫెయిల్’), నటిగా రాణీ ముఖర్జీ (‘మిసెస్ ఛటర్జీ వర్సెస్ నార్వే’), ఉత్తమ చిత్రదర్శకుడు విధు వినోద్ చోప్రా (‘ట్వల్త్ ఫెయిల్’) అవార్డులు అందుకున్నారు. తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి ఉత్తమ చిత్రం ‘భగవంత్ కేసరి’కిగానూ దర్శకుడు అనిల్ రావిపూడి, నిర్మాత సాహు గార పాటి అవార్డు స్వీకరించారు.
‘హనుమా న్’ మూవీకి బెస్ట్ యానిమేషన్ విజువల్ ఎఫెక్ట్స్ విభాగంలో దర్శకుడు ప్రశాంత్ వర్మ, నిర్మాత నిరంజ న్ రెడ్డి, ఇదే విభాగంలో వీఎఫ్‌ఎక్స్ సూపర్‌వైజర్ జెట్టీ వెంకట్‌కుమార్, ‘బేబీ’ సినిమాకిగాను స్క్రీన్‌ప్లే విభాగంలో సాయి రాజేశ్, ఇదే చిత్రానికి నేపథ్య గాయకుడుగా పీవీఎన్‌ఎస్ రోహిత్, ‘బలగం’కి పాట రచయితగా కాసర్ల శ్యామ్, ‘యానిమల్’ (హిందీ)కి నేపథ్య సంగీతానికి హర్షవర్ధ న్ రామేశ్వర్, ‘గాంధీ తాత చెట్టు’ సినిమాకి ఉత్తమ బాల నటిగా సుకృతి వేణి బండ్రెడ్డి అవార్డులు అందుకున్నారు.
సినిమా నా ఆత్మ హృదయ స్పందన
– నటుడు మోహన్‌లాల్
‘‘మలయాళ పరిశ్రమ నుంచి ప్రతిష్ఠాత్మక దాదా సాహెబ్ ఫాల్కే పురస్కారం పొందిన రెండో వ్యక్తిను నేను. అతి చిన్న వయసులో ఈ అవార్డు అందుకోవడం గౌరవంగా ఉంది. ఈ పురస్కారం మలయాళ పరిశ్రమ మొత్తానికి చెందుతుంది. మలయాళ సినీ పరిశ్రమ సృజనాత్మకత, స్థిరత్వం, సమష్టి కృషికి పత్రీకగా నేను ఈ అవార్డును భావిస్తున్నాను. ఈ అవార్డుని కలలో కూడా ఊహించలేదు. అందుకే ఏదో మ్యాజిక్ జరిగినట్లుగా ఉంది.
కేరళ ప్రేక్షకులకు ఈ అవార్డును అంకితం ఇస్తున్నాను. ఒక నటుడిగా ఈ అవార్డు నా అంకితభావాన్ని, నా నిబద్ధతను, సంకల్పాన్ని మరింత బలపరుస్తుంది. భారత ప్రభుత్వానికి నా కృతజ్ఞతలు. గౌరవనీయులు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముగారికి, భారత ప్రధాని నరేంద్ర మోదీగారికి, కేంద్ర సమాచార, ప్రసారశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌గార్లకు, జ్యూరీ సభ్యులకు ధన్యవాదాలు. సినిమా అనేది నా ఆత్మ హృదయ స్పందన... జై హింద్.
ప్రతి పాటనూ మరింత బాధ్యతగా రాస్తా
– రచయిత కాసర్ల శ్యామ్
‘‘ఇకపై ఏ పాట రాసినా నన్ను జాతీయ అవార్డుగ్రహీత స్థాయిలో చూస్తారు కాబట్టి మరింత బాధ్యతగా పాటలు రాయాల్సి ఉంటుంది. అవార్డు తెచ్చిన గౌరవాన్ని నిలుపుకుంటూ ప్రతి పాటనూ మరింత బాధ్యతగా రాస్తాను’’ అని కాసర్ల శ్యామ్ అన్నారు. ‘బలగం’లోని ‘ఊరు పల్లెటూరు...’ పాటకు జాతీయ అవార్డు అందుకున్న అనంతరం ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ– ‘‘రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా జాతీయ అవార్డు తీసుకోవడం ఓ మధురానుభూతి. ఇది నాకు, నా కుంటుంబానికే కాదు.. తెలుగు చిత్ర పరిశ్రమకు కూడా గర్వకారణం.
‘బలగం’ సినిమాలోని ప్రేక్షకుల హృదయాలను బాగా ప్రభావితం చేసిన ‘బలరామ నర్సయ్యో’ పాటకు అవార్డు వస్తుందని భావించాను. కానీ ‘ఊరు పల్లెటూరు..’కు రావడం కొంత ఆశ్చర్యానికి గురిచేసింది. మా నాన్న రంగస్థల, టీవీ నటుడు. సుమారు 25కు పైగా సినిమాల్లో పాత్రలు వేశారు. కానీ బలమైన పాత్రలు రాక నిరాశతో వెనక్కి వచ్చేశారు. ఆ ప్రభావం నాపైన పడింది. ‘లై’ సినిమాకు రాసిన ‘బొమ్మోలె ఉన్నదిరా ΄ోరీ’ పాట నా జీవితాన్ని మార్చేసింది. ఇప్పడు జాతీయ అవార్డు సాధించి మా నాన్న ఆశయాన్ని నెరవేర్చాననే సంతృప్తి కలిగింది’’ అని చె ప్పారు.
– సాక్షి, న్యూఢిల్లీ