
– పవన్ కల్యాణ్
‘‘ఓజీ’ సినిమా విజయం నా ఒక్కడిది కాదు.. ఇందుకు కారణమైన మా టీమ్‌కి ధన్యవాదాలు’’ అని పవన్ కల్యాణ్ చెప్పారు. ఆయన హీరోగా, ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా నటించిన చిత్రం ‘ఓజీ’. సుజీత్ దర్శకత్వంలో డీవీవీ దానయ్య నిర్మించిన ఈ సినిమా సెప్టెంబరు 25న రిలీజ్ అయ్యింది. హైదరాబాద్‌లో నిర్వహించిన ‘ఓజీ బ్లాక్‌బస్టర్ సెలబ్రేషన్స్’లో పవన్ కల్యాణ్ మాట్లాడుతూ–‘‘ఓ మూవీ ఫెయిల్యూర్‌కి నేనెప్పుడూ భయపడలేదు.
ఇటీవల విడుదలైన ‘హరి హర వీరమల్లు’ సినిమాకి కూడా. నేను చాలా సార్లు ఫెయిల్ అయింది టీమ్ వర్క్ లేకే తప్ప నా ఎఫర్ట్స్ ఎప్పుడూ తగ్గవు. నాకు అన్నం పెట్టిన తల్లి సినిమా. ఈ రోజు ఉప ముఖ్యమంత్రిగా నేనున్నానంటే అది సినిమా ఇచ్చిందే. ఓడిపోతే నిస్సహాయత ఎలా ఉంటుందో తెలుసు.. సినిమా అపజయమైతే ఆ నిస్సహాయత ఎలా ఉంటుందో తెలుసు.
సినిమా బాగున్నప్పుడు అందరూ ఉంటారు కానీ, బాగాలేనప్పుడు మన దగ్గర ఎవరు నిలబడతారో వాళ్లే మనవాళ్లు. నేనెప్పుడూ ఫెయిల్యూర్‌ని ఎదుగుదలకు ఒక మెట్టుగా చూస్తానే తప్ప అవరోధంగా చూడను. నేను సినిమా కంటే పెద్దది చేస్తున్నాను.. అదే రాజకీయం. చాలా కష్టమైన పని. సినిమాల్లో విలన్స్‌తో గొడవ పడటం ఈజీ. నిజ జీవితంలో అలా ఉండదు.. తల ఎగిరిపోవచ్చు కూడా.
అది నాకు ఎక్స్‌ట్రా రిస్క్. కానీ, దేశంపై నాకు పిచ్చి ప్రేమ ఉంది. అందరి హీరోల సినిమాలు చూస్తాను. ప్రతి హీరో కష్టాన్ని నేను అభినందిస్తాను. అందరి హీరోల అభిమానులను నేను కోరుకునేది ఒక్కటే. ఫ్యాన్ వాయిస్‌ని ఆపేయండి.. అలాంటి స్లోగన్స్‌తో దయచేసి సినిమాని చంపేయకండి. ఇప్పుడు ఓ సినిమా జీవితం అనేది కేవలం ఆరు రోజులు అయిపోయింది. నిర్మాతలు సినిమాలు చేసేందుకు ముందుకు రాకపోతే ఎంతోమంది ఉపాధి కోల్పోతారు’’ అన్నారు.