ప్రముఖ నటి, దర్శకురాలు రేణూ దేశాయ్- పవన్ కల్యాణ్‌ల తనయుడు అకీరా నందన్ సినిమాల్లోకి వస్తాడని ఎప్పటి నుంచో వార్తలు వినిపిస్తున్నాయి. అకీరా డెబ్యూ కోసం మెగా ఫ్యాన్స్ అంతా ఆశగా ఎదురు చూస్తున్నారు. అయితే అకీరా ఎంట్రీ ఎప్పుడనేది అటు పవన్ కానీ, ఇటు రేణూ దేశాయ్ కానీ కచ్చితంగా చెప్పడం లేదు.
కొంతమంది బడా దర్శక-నిర్మాతలు మాత్రం అకీరాతో సినిమా చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేత టీజీ విశ్వప్రసాద్ అయితే తనకు చాన్స్ ఇస్తే..అకీరాతో పాన్ వరల్ట్ సినిమా చేస్తానని చెబుతున్నాడు. అయితే అకీరా(Akira Nandan)కు మాత్రం మొదటి నుంచి నటన మీద కన్నా సంగీతం మీదనే మక్కువ ఎక్కువ. అసలు ఆయన హీరోగా ఎంట్రీ ఇస్తాడా? అనే అనుమానాలు కూడా లేకపోలేదు. ఇలాంటి నేపథ్యంలో అకీరా సినీ ఎంట్రీపై తల్లి రేణూ దేశాయ్(Renu Desai ) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అకీరా హీరో అవ్వాలని అందరికంటే ఎక్కువ తనే కోరుకుంటున్నానని చెప్పారు.
తాజాగా ఆమె ఓ యూట్యూబ్ చానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అకీరా సినీ ఎంట్రీ గురించి స్పందించారు. ‘అకీరా త్వరగా హీరో అవ్వాలని నేను కూడా కోరుకుంటున్నాను. అందరిలానే నేను కూడా హీరో ఎప్పుడు అవుతావని అకీరాను అడుగుతుంటాను. ప్రతి ఇంటర్వ్యూలోనూ నన్ను ఈ ప్రశ్న అడుగుతున్నారు. ఒకటే చెబుతున్నా.. నేను వాడి కన్న తల్లిని.. అకీరా హీరో అవ్వాలని మీ (ఫ్యాన్స్) కంటే ఎక్కువగా నేనే కోరుకుంటున్నాను. ప్రతిరోజు దేవుడికి కొబ్బరికాయ కూడా కొడుతున్నాను. అయితే హీరో అవ్వాలా వద్దా అనేది మాత్రం అకీరా ఇష్టం’ అని రేణూ దేశాయ్ చెప్పుకొచ్చింది.
ఇక హీరో అవ్వాలని అకీరాకు ఇష్టం ఉందా లేదా ? అని యాంకర్ అడగ్గా.. ‘ఈ టాపిక్ గురించే మాట్లాడొద్దు.. తర్వాత అకీరా నన్ను తిడతాడు. ‘మమ్మీ నా గురించి ఎందుకు మాట్లాడావ్ ’ అంటూ అలుగుతాడు’ అని నవ్వుతూ చెప్పారు. ఇక ఆమె కెరీర్ గురించి మాట్లాడుతూ.. మంచి పాత్రలు వస్తే కచ్చితంగా నటిగా కొనసాగుతానని చెప్పారు.


