‘సిన్నర్స్’ ... ఈ హాలీవుడ్ మూవీ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. దానికి కారణం.. 98వ ఆస్కార్ అవార్డ్స్ నామినేషన్స్‌లో ఏకంగా 16 విభాగాల్లో ఈ సినిమా చోటు దక్కించుకోవడమే. గతంలో ‘ఆల్ అబౌట్ ఈవ్’ (1950), ‘టైటానిక్’ (1997), ‘లా లా ల్యాండ్’ (2016) చిత్రాలు సాధించిన 14 నామినేషన్ల రికార్డును ఈ మూవీ అధిగమించింది. హారర్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమాలో మైఖేల్ బి.జోర్డాన్ ప్రధాన పాత్ర పోషించారు. క్రీడ్ (2015), బ్లాక్ పాంథర్ (2018) లాంటి బ్లాక్ బస్టర్స్ అందించిన రేయాన్ కూగ్లర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ సినిమా 16 విభాగాల్లో నామినేట్ కావడానికి గల కారణం ఏంటి? అసలు ఈ సినిమా కథేంటి?
ఈ సినిమా కథంతా 1932 నేపథ్యంలో జరుగుతుంది. స్మోక్ మరియు స్టాక్..ఇద్దరు ట్విన్ బ్రదర్స్. మొదటి ప్రపంచ యుద్ధంలో పాల్గొన్న ఈ సోదరులు, చికాగోలో మాఫియా కోసం పనిచేసి డబ్బు సంపాదించి, తమ స్వస్థలమైన క్లార్క్‌స్‌డేల్‌కు తిరిగి వస్తారు. వీరిద్దరి దగ్గర భారీగా డబ్బు ఉన్నప్పటికీ బ్లాక్ కమ్యూనిటీ కావడంతో సరైన గౌరవం ఉండదు. దీంతో వీళ్లే సొంతంగా ఒక మ్యూజిక్ బార్‌ని ప్రారంభించాలనుకుంటారు. అందులో సామీ (మైల్స్ కాటన్)ని మ్యూజిక్ ప్లే చేయమని కోరతారు. అన్ని పనులు పూర్తయి.. బార్ ఓపెన్ అవుతుంది. నల్ల జాతీయులు తప్ప వేరే వాళ్లకు అందులో అనుమతి ఉండదు.
అదే సమయంలో ఓ ముగ్గురు వ్యక్తులు బార్‌లోకి రావడానికి అనుమతి అడుగుతారు. వాళ్లు తెల్ల జాతీయులు కావడంతో స్మోక్ వారిని లోపలికి రానివ్వడు. దీంతో వాళ్లు బార్ బయటే మ్యూజిక్ ప్లే చేస్తూ ఉంటారు. అసలు విషయం ఏంటంటే..ఈ ముగ్గురు కూడా వాంపైర్లు(మనుషుల రక్తం తాగి జీవించే అమరజీవులు.. జాంబీలు). ఈ విషయం బార్ లోపల ఉన్నవాళ్లకి తెలియదు. కాసేటి తర్వాత మేరీ అనే అమ్మాయిపై బార్ నుంచి బయటకు రాగా.. వాంపైర్లు దాడి చేసి ఆమె రక్తం తాగుతారు. దీంతో ఆమె కూడా వాంపైర్‌గా మారిపోతుంది. పరిమిషన్ తీసుకొని బార్‌లోకి వెళ్లి.. స్టాక్‌పై దాడి చేసి రక్తం తాగుతుంది. ఇది గమనించి స్మోక్..ఆమెని తుపాకితో కాల్చుతాడు. అయినా చనిపోకుండా.. బార్ నుంచి బయటకు వెళ్లిపోతుంది. అప్పుడు స్మోక్ భార్య వచ్చి.. వాళ్లు వాంపైర్లు అని చెబుతుంది. బార్ నుంచి బయటకు వెళ్లిన వాళ్లంతా వాంపైర్లుగా మారిపోతారు. వారి నుంచి స్టోక్ గ్యాంగ్ ఎలా తప్పించుకుందనేదే ఈ సినిమా మిగతా కథ(Sinners Movie Review).
వాస్తవానికి ఈ సినిమా కథ కొత్తదేమి కాదు. తెలుగులో వచ్చిన జాంబీ రెడ్డి సినిమా తరహా కథే ఇది. హాలీవుడ్‌లో ఈ నేపథ్యంలో చాలా సినిమాలు వచ్చాయి. కానీ ‘సిన్నర్స్ ప్రత్యకత ఏంటంటే.. ఈ పీరియాడికల్ హారర్ చిత్రంలో ఆఫ్రికన్ అమెరికన్లు చరిత్రను (జిమ్ క్రో ఎరా, బ్లూస్ సంగీతం) మిళితం చేసి, ఇంట్రా-రేసియల్ కాన్‌ఫ్లిక్ట్‌లను అద్భుతంగా చూపించారు. బ్లూస్ సాంగ్స్, సౌండ్ డిజైన్ బాగుంటుంది. జాతి వివక్ష ఎలా ఉండేదో చెప్పడానికి ప్రత్యేకంగా సీన్లను రాసుకోకున్నా.. సినిమా చూస్తుంటే ఆ విషయం ఈజీగా తెలిసిపోతుంది. మ్యూజిక్ అందించమని సామిని అడిగేందుకు ట్విన్ బ్రదర్స్ రైల్వే స్టేషన్‌కి వెళ్తారు. అక్కడ బాత్రూంలపై తెల్లజాతీయులకు మాత్రమే అన్నట్లుగా రాసి ఉండడం.. బ్లాక్ కమ్యూనిటీ వాష్‌రూమ్‌ని సపరేట్‌గా పెట్టినట్లు చూపిస్తారు. ఇలాంటి చిన్న చిన్న సీన్లతోనే జాతి వివక్ష గురించి చర్చించారు. అయితే ఫస్టాఫ్‌లో కథనం నెమ్మదిగా సాగుతుంది. బార్ కోసం ట్విన్ బ్రదర్స్ చేసే ప్రయత్నాల చుట్టూనే ప్రథమార్థం సాగుతుంది. ఇక సెకండాఫ్‌లో అసలు కథ మొదలవుతుంది. వాంపైర్లు బార్‌లోకి రావడానికి ప్రయత్నించడం.. తప్పించుకునేందుకు స్మోక్ బృందం చేసే పోరాటం..అన్ని ఆసక్తికరంగా ఉంటాయి. చివరి 40 నిమిషాలు కథనం ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతుంది. (ఈ మూవీ జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. దీంతో పాటు అమెజాన్ ప్రైమ్ వీడియోలో రెంట్ పద్దతిలో అందుబాటులో ఉంది)
‘సిన్నర్స్’ మూవీ నామినేట్ అయిన 16 విభాగాలు ఇవే..
- బెస్ట్ పిక్చర్
- బెస్ట్ డైరెక్టర్ (రేయాన్ కూగ్లర్)
- బెస్ట్ యాక్టర్ (మైఖేల్ బి. జోర్డాన్)
- బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ (వున్మి మోసాకు)
- బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ (డెల్రాయ్ లిండో)
- బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్‌ప్లే
- బెస్ట్ సినిమాటోగ్రఫీ
- బెస్ట్ కాస్టింగ్ (కొత్త కేటగిరీ)
- బెస్ట్ ఒరిజినల్ స్కోర్
- బెస్ట్ సౌండ్
- బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్
- బెస్ట్ కాస్ట్యూమ్ డిజైన్
- బెస్ట్ మేకప్ అండ్ హెయిర్‌స్టైలింగ్
- బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్
- బెస్ట్ ఫిల్మ్ ఎడిటింగ్
- బెస్ట్ ఒరిజినల్ సాంగ్
98వ ఆస్కార్ అవార్డుల్లో ఈ చిత్రం ఎన్ని గెలుచుకుంటుందో చూడాలి. మార్చి 15న (భారతీయ కాలమానం ప్రకారం మార్చి 16) అవార్డుల ప్రదానోత్సవం అమెరికాలో జరుగుతుంది.


