నాని 'ప్యారడైజ్' సినిమా ఎట్టకేలకు థియేటర్లలోకి వచ్చేసింది. బుధవారం రాత్రి ప్రీమియర్లు పడ్డాయి. విడుదలకు ముందు విపరీతమైన హైప్ సొంతం చేసుకున్న ఈ మూవీ.. దాన్ని నిలబెట్టుకుందా? చూసిన ప్రేక్షకులు అసలేమంటున్నారు? సోషల్ మీడియాలో విపరీతమైన నెగిటివిటీకి కారణమేంటి? చూస్తున్నవన్నీ నిజమైనా అభిప్రాయాలేనా?
(ఇదీ చదవండి: ప్యారడైజ్ సినిమాలో కేసీఆర్, ఎన్టీఆర్)
ఏ సినిమాపై అయినా విపరీతమైన అంచనాలు ఉన్నప్పుడు దాన్ని అందుకోవడం కత్తి మీద సాము లాంటిది. ఎందుకంటే ఏ మాత్రం అటుఇటైనా అడ్డంగా బోల్తా కొట్టేయడం గ్యారంటీ. 'ప్యారడైజ్' విషయంలో ఇప్పుడు అదే జరిగిందని ఆడియెన్స్ అంటున్నారు. స్టోరీ పరంగా కొత్తగా ఏం లేనప్పటికీ టేకింగ్ పరంగా ఏమైనా మ్యాజిక్ జరుగుతుందేమోనని ఆశపడితే అలాంటిదేం లేదని కుండబద్దలు కొట్టేస్తున్నారు. ఫస్టాప్ పర్లేదనిపించినప్పటికీ సెకండాఫ్ మరీ దారుణంగా ఉందని అంటున్నారు.
మరికొందరు అయితే 'ప్యారడైజ్'.. బిర్యానీ కాదు కిచిడీ, పులిహోర అని ఘోరమైన విమర్శలు చేస్తున్నారు. వందలాది రూపాయల టికెట్ కొని ఎంతో ఆశతో థియేటర్‌కి వెళ్లి ఉసూరుమన్న చాలామంది సోషల్ మీడియా వేదికగా తన కోపాన్ని వెళ్లగక్కుతున్నారు.
(ఇదీ చదవండి: ప్యారడైజ్ సినిమా రివ్యూ)
నాని కష్టాన్ని మెచ్చుకుంటున్న ప్రేక్షకులు.. మోహన్ బాబు విలనిజం బాగుందని అంటున్నారు. కాయదు పాత్రని వ్యాంప్ తరహాలో డిజైన్ చేయడం కొందరికి తెగ నచ్చేయగా.. మరికొందరు 'పెద్ది'లో జాన్వీ పాత్రతో పోలుస్తున్నారు. ఇద్దరినీ అందాల ప్రదర్శన కోసమే తీసుకున్నారా? అని ప్రశ్నిస్తున్నారు. బాలీవుడ్ నుంచి తీసుకొచ్చి రాఘవ్ జుయల్‌తో చేయించిన విలనీ మరీ కామెడీగా ఉందని ఏకిపారేస్తున్నారు.
బిర్యానీ అనే పాత్రలో నటించిన సంపూర్ణేశ్ బాబు.. 'ప్యారడైజ్' కోసం రెండేళ్ల పాటు ఇదే లుక్ మెంటైన్ చేస్తే సరైన సీన్ గానీ సరైన ఎలివేషన్ గానీ పడలేదని అంటున్నారు. అనిరుధ్.. పాటల్లో తప్పితే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్‌తో మెప్పించలేకపోయాడని.. దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ఎందుకనో పూర్తిగా దృష్టి పెట్టి ఈ మూవీ తీయలేదా అని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. మరీ ముఖ్యంగా నాని.. మాస్ సినిమాలు తగ్గించి గతంలో చేసినట్లు ఫీల్ గుడ్ లేదా కామెడీ మూవీస్ చేయాలని సగటు సినీ ప్రేక్షకులు, అతడి అభిమానులు కోరుతున్నారు.
సోషల్ మీడియాలో 'ప్యారడైజ్' విషయంలో కనిపిస్తున్నదంతా చాలావరకు నిజమే అనిపిస్తుంది. ఎందుకంటే సినిమా చూసినవాళ్లలో పాజిటివ్స్ చెప్పినవాళ్లు ఒకరో ఇద్దరో ఉండగా.. మిగిలిన వాళ్లు నెగిటివ్ ఫీడ్ బ్యాక్ ఇస్తున్నారు. వీకెండ్ అయ్యేసరికి ఈ మూవీ అసలు ఫలితం ఏంటనేది ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది.
(ఇదీ చదవండి: సుకుమార్ శిష్యులిద్దరిదీ ఒకే కథ.. ప్చ్)


