
'నాగిని' సీరియల్‌తో పాపులారిటీ సంపాదించుకుంది బుల్లితెర నటి మౌనీ రాయ్ (Mouni Roy). బుల్లితెర నుంచి వెండితెరకు వెళ్లాలన్న ఆశ 'హీరో హిట్లర్ ఇన్ లవ్' అనే పంజాబీ చిత్రంతో నెరవేరింది. 'గోల్డ్' అనే హిందీ మూవీతో బాలీవుడ్‌లో అడుగుపెట్టింది. తొలి చిత్రానికి బెస్ట్ డెబ్యూగా ఫిలింఫేర్ అవార్డు అందుకుంది. భారీ బడ్జెట్ మూవీ 'బ్రహ్మాస్త్ర: పార్ట్ 1'లోనూ భాగమైంది.
అంచనాలు తలకిందులు
ఈ చిత్రానికిగానూ ఉత్తమ సహాయనటిగా ఫిలింఫేర్, ఐఫా అవార్డులు గెలుచుకుంది. అయితే తాను ఊహించినంతగా భారీ సినిమాల అవకాశాలు మాత్రం రావడం లేదని బాధపడుతోంది. హాలీవుడ్ రిపోర్టర్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మౌనీరాయ్ మాట్లాడుతూ.. బ్రహ్మాస్త్ర మూవీ తర్వాత చాలా ఆఫర్లు వస్తాయనుకున్నాను. కానీ అది నిజమవలేదు. సినిమాకు ఎవర్ని సెలక్ట్ చేయాలన్నప్పుడు కనీసం నా పేరు కూడా ప్రస్తావించడం లేదనుకుంటా!
ఏదో ఒక ప్రాజెక్టుతో బిజీ
అందుకు గల కారణాలేంటో తెలియడం లేదు. అయితే కెరీర్ మాత్రం ఆగిపోలేదు. ఓటీటీ ప్రాజెక్టులతో పాటు రియాలిటీ షో జడ్జిగా వ్యవహరిస్తూ, స్పెషల్ సాంగ్స్ చేస్తూ ఇలా ఏదో ఒకరకంగా ఎప్పుడూ బిజీగా ఉంటున్నాను. అవకాశాలు సరైన సమయంలో వాటంతటవే వస్తాయని ఎదురుచూస్తున్నాను. దాని గురించి అంతగా బాధపడుతూ కూర్చోవట్లేదు.

నా జర్నీని తక్కువ చేయలేను
ఎందుకంటే నా కెరీర్ ఎక్కడో మొదలై.. ఇంతదూరం వచ్చాను. ఇప్పటివరకు ఎన్నో సాధించాను. ఈ విషయంలో సంతృప్తిగా ఉండాలే తప్ప చేసిన పనిని చులకన చేసి మాట్లాడలేను. అయినా సినిమా ఫైనలైజ్ అవ్వాలంటే ముందు ఎన్నో ఉంటాయి. స్క్రిప్ట్ కుదరాలి, నిర్మాణ సంస్థలు భాగమవ్వాలి, బడ్జెట్ లెక్కలేసుకోవాలి. ఇలా ఎన్నో ఉంటాయి. ఇవన్నీ ఓ కొలిక్కి వచ్చాకే నటీనటుల సెలక్షన్ ఉంటుంది.
విశ్వంభరతోనైనా దశ తిరిగేనా?
వాళ్లనుకునే పాత్రలో మనల్ని ఊహించుకోలేకపోతే కనీసం లుక్ టెస్ట్‌కు కూడా పిలవరు. కాబట్టి సినిమాలో భాగం అవడమనేది నటీనటుల చేతిలో ఉండదు అని చెప్పుకొచ్చింది. ఇకపోతే మౌనీరాయ్ టాలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వనుందంటూ ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే! విశ్వంభర మూవీలో ఈ నటి చిరంజీవితో స్టెప్పులేసిందట! ఈ స్పెషల్ సాంగ్ షూటింగ్ ఇటీవలే పూర్తయింది. విశ్వంభరతోనైనా మౌనీ దశ తిరుగుతుందేమో చూడాలి!
చదవండి: 49 ఏళ్ల వయసులో సత్తా చాటిన ప్రగతి.. జాతీయ స్థాయిలో గోల్డ్ మెడల్