మలయాళ బ్యూటీ మాళవిక మోహనన్ 'ది రాజాసాబ్' సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇవ్వనుంది. చిరంజీవి సినిమాలోనూ యాక్ట్ చేస్తున్నట్లు రూమర్స్ రాగా.. అందులో ఏమాత్రం నిజం లేదని కొట్టిపారేసింది. అయితే 'పేట' సినిమా తర్వాత తనకు సైడ్ రోల్స్ మాత్రమే సెట్ అవుతాయని కొందరు అన్నారంటోంది.
అదేం అక్కర్లేదు
ఈ విషయం గురించి తాజాగా మాళవిక మోహనన్ మాట్లాడుతూ.. నటీనటులకు పర్ఫెక్ట్ లాంచ్ అవసరం అని నేను అనుకునేదాన్ని. ఉదాహరణకు దీపికా పదుకొణె ఓం శాంతి ఓంతో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. నేను కూడా అలాగే ఓ పెద్ద సినిమాతో గ్రాండ్‌గా ఎంట్రీ ఇవ్వాలనుకున్నాను. నేనే కాదు, చాలామంది యంగ్ యాక్టర్స్ ఇలాగే ఫీల్ అవుతారు.
ఏదైనా ప్రేక్షకుల చేతిలోనే..
కానీ పర్ఫెక్ట్ సినిమా అంటూ ఏదీ ఉండదని అర్థమైంది. స్టార్ హీరోల సినిమా అయినా, గొప్ప దర్శకుల మూవీ అయినా రిజల్ట్ ప్రేక్షకుల చేతిలో ఉంటుందని తెలుసుకున్నాను. ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోతే ఎవరైనా బోల్తా కొట్టక తప్పదని అర్థమైంది. బియాండ్ ద క్లౌడ్స్ మూవీ చూసి దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ నాకు రజనీకాంత్ పేట మూవీలో ఆఫర్ ఇచ్చాడు.
ఆ తర్వాత మొదలైంది
అది హీరోయిన్ అవకాశం కానప్పటికీ రజనీకాంత్‌తో నటించే అదృష్టాన్ని వదిలేసుకోవాలనుకోలేదు. కానీ ఆ సినిమా చేశాక నాకు అన్నీ అలాంటి రోల్సే రావడం మొదలైంది. ఇకమీదట సైడ్ రోల్స్ మాత్రమే వస్తాయని కొందరు నిర్మాతలు అన్నారు. యాక్టర్స్‌ను ఇంత త్వరగా జడ్జ్ చేస్తారని అప్పుడే అర్థమైంది. ఒక పెద్ద సినిమా ఆఫర్ వచ్చినప్పటికీ కథ నచ్చకపోవడంతో రిజెక్ట్ చేశాను.
ధైర్యంగా ముందుకు సాగాలి
అంటే నేను మంచి రోల్స్ మాత్రమే చేస్తానని చెప్పకనే చెప్పాను. ఇక్కడ జనాలు మన మైండ్‌లో ఏవేవో ఎక్కించడానికి ప్రయత్నిస్తారు. కానీ, మనం ఎంతో ధైర్యంగా ముందుకు వెళ్లాల్సి ఉంటుంది అని మాళవిక చెప్పుకొచ్చింది. 'మాస్టర్' సినిమాతో హీరోయిన్‌గా మాళవిక మళ్లీ ఫేమ్‌లోకి వచ్చింది. తంగలాన్, హృదయపూర్వం సినిమాల్లో యాక్ట్ చేసింది. ప్రస్తుతం ప్రభాస్ సరసన 'ది రాజాసాబ్'తో పాటు తమిళంలో కార్తీతో 'సర్దార్ 2' చేస్తోంది.


