
సెప్టెంబర్ నెల సినిమా లవర్స్‌కి సూపర్ అనే చెప్పాలి. ఎందుకంటే చాలా సినిమాలు విడుదలవుతున్నాయి. ప్రతి నెలా విడుదలవుతాయి కానీ పెద్ద సినిమాలు రెండో మూడో ఉంటాయి. అయితే సెప్టెంబర్‌లో విడుదలయ్యేవాటిలో పెద్ద సినిమాల సంఖ్య మెండుగానే ఉంది. ఆ సినిమాల గురించి తెలుసుకుందాం.
యాక్షన్ డ్రామా...
‘అరుంధతి, పంచాక్షరి, భాగమతి, నిశ్శబ్దం’ వంటి లేడీ ఓరియంటెడ్ చిత్రాల తర్వాత అనుష్క లీడ్ రోల్‌లో నటించిన తాజా చిత్రం ‘ఘాటీ’. ‘వేదం’ (2010) వంటి హిట్ మూవీ తర్వాత అనుష్క, డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి కాంబినేషన్‌లో రూపొందిన ద్వితీయ చిత్రమిది. విక్రమ్ ప్రభు, జగపతిబాబు, చైతన్యా రావు, రవీంద్రన్ విజయ్ ఇతర పాత్రలుపోషించారు. యూవీ క్రియేషన్స్ సమర్పణలో ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై రాజీవ్ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి నిర్మించారు.
పలుమార్లు విడుదల వాయిదా పడిన ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 5న తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్. ‘‘మోస్ట్ అవైటెడ్ యాక్షన్ డ్రామాగా రూపొందిన చిత్రం ‘ఘాటీ’. ఒక బలహీన మహిళ క్రిమినల్‌గా, ఆ తర్వాత లెజెండ్‌గా మారే పాత్రలో అనుష్క నటన అద్భుతంగా ఉంటుంది. అధిక బడ్జెట్‌తో, అత్యున్నత స్థాయి సాంకేతిక ప్రమాణాలతో భారీ స్థాయిలో మా సినిమా రూపొందింది. ఇటీవల విడుదలైన ట్రైలర్ మా మూవీపై అంచనాలు పెంచింది’’ అని చిత్రయూనిట్ తెలిపింది.
సూపర్ యోధ...
‘హనుమాన్’ (2024) చిత్రంతో పాన్ ఇండియా స్థాయిలో హిట్ అందుకున్న తేజ సజ్జా హీరోగా నటించిన తాజా చిత్రం ‘మిరాయ్’. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించారు. రితికా నాయక్ కథానాయికగా నటించిన ఈ సినిమాలో మంచు మనోజ్ విలన్ పాత్ర పోషించారు. జగపతిబాబు, శ్రియ శరణ్, జయరామ్ ఇతర పాత్రలుపోషిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై టీజీ విశ్వప్రసాద్, కృతీ ప్రసాద్ భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రం సెప్టెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా 2డీ, 3డీ ఫార్మాట్లలో 8 భాషల్లో విడుదల కానుంది.
ఆధ్యాత్మిక అంశాలతో ముడిపడిన ఫ్యాంటసీ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమాలో తేజ సూపర్ యోధగా కనిపించనున్నారు. ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైనపోస్టర్స్, వీడియో గ్లింప్స్‌కి అద్భుతమైన స్పందన వచ్చింది. గౌర హరి సంగీతం అందించిన ఈ సినిమా నుంచి ఇటీవల విడుదల చేసిన ‘వైబ్ ఉంది బేబీ..’ పాట ట్రెండింగ్‌గా మారింది. ‘హనుమాన్’ వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత తేజ సజ్జా నటించిన ‘మిరాయ్’ పై ఇటు ఇండస్ట్రీలో అటు ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. ఇక ఈ సినిమా హిందీ థియేట్రికల్ హక్కులను కరణ్ జోహార్ దక్కించుకున్నారు.
అందమైన ప్రేమకథ
ఓ వైపు హీరోయిన్‌గా బిజీ బిజీగా వరుస ప్రాజెక్టులతో దూసుకెళుతూనే మరోవైపు లేడీ ఓరియంటెడ్ సినిమాలకీ సై అంటున్నారు రష్మికా మందన్న. ఆమె ప్రధాన పాత్రలో రూపొందిన తాజా చిత్రం ‘ది గర్ల్ ఫ్రెండ్’. నటుడు, దర్శకుడు రాహుల్ రవీంద్రన్ తెరకెక్కించిన ఈ సినిమాలో దీక్షిత్ శెట్టి లీడ్ రోల్‌లో నటించారు. అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్స్‌పై ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి నిర్మించారు. ఈ సినిమా సెప్టెంబర్ 5న విడుదల కానుంది. ‘‘అందమైన ప్రేమకథగా ఈ చిత్రం రూపొందింది.
మనసుని ఆకట్టుకునే అంశాలతో రాహుల్ రవీంద్రన్ అద్భుతంగా తెరకెక్కించారు. ఈ చిత్రంలో రష్మిక నటన సరికొత్తగా ఉంటుంది. యువతరంతో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించేలా మా మూవీ ఉంటుంది’’ అని చిత్రయూనిట్ తెలిపింది. ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌ను హీరో విజయ్ దేవరకొండ తన వాయిస్ ఓవర్‌తో రిలీజ్ చేయగా, అద్భుతమైన స్పందన వచ్చింది. అలాగే హేషమ్ అబ్దుల్ వాహబ్ సంగీతం అందించిన ఈ సినిమా నుంచి ఇటీవల విడుదలైన ‘నదివే...’ అంటూ సాగే తొలి పాట కూడా ఆకట్టుకుంది.
కిష్కిందపురిలో...
‘భైరవం’ సినిమాతో ఇటీవల ప్రేక్షకులను అలరించారు హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్. ఆయన నటించిన తాజా చిత్రం ‘కిష్కిందపురి’. ‘రాక్షసుడు’ (2019) వంటి హిట్ మూవీ తర్వాత సాయి శ్రీనివాస్, అనుపమా పరమేశ్వరన్ జోడీగా నటించిన ద్వితీయ చిత్రమిది. కౌశిక్ పెగల్లపాటి రచన, దర్శకత్వంలో అర్చన సమర్పణలో షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మించారు. ఈ సినిమాని సెప్టెంబర్ 12న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు మేకర్స్. ‘‘హారర్ మిస్టరీగా రూపొందిన చిత్రం ‘కిష్కిందపురి’.
సాయి శ్రీనివాస్ కెరీర్‌లో హైలీ యాంటిసిపేటెడ్ మూవీ ఇది. ఈ చిత్రం ప్రేక్షకులకు అద్భుతమైన హారర్, మిస్టరీ ఎక్స్‌పీరియన్స్‌ని అందిస్తుంది. కౌశిక్ పెగల్లపాటి గ్రిప్పింగ్ కథనం, చిన్మయ్ సలాస్కర్ కెమెరా వర్క్, సామ్ సీఎస్ సంగీతం ఆకట్టుకుంటాయి. సాహు గారపాటి గ్రాండ్‌గా నిర్మించిన ఈ చిత్రం చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు అందరికీ నచ్చుతుంది. ఇటీవల విడుదలైన ఫస్ట్ లుక్‌పోస్టర్‌కి మంచి స్పందన వచ్చింది’’ అని చిత్రబృందం తెలిపింది. ఈ చిత్రం నుంచి ‘ఉండి పోవే నాతోనే...’ అంటూ సాగే తొలి పాటని విడుదల చేయగా, అద్భుతమైన స్పందన వచ్చింది.
యాక్షన్ భద్రకాళి
సంగీత దర్శకుడు, నటుడు, నిర్మాత, దర్శకుడు... ఇలా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్నారు విజయ్ ఆంటోని. ఆయన నటించిన 25వ చిత్రం ‘భద్రకాళి’. అరుణ్ ప్రభు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో వాగై చంద్రశేఖర్, సునీల్ కృపలానీ, సెల్ మురుగన్, తృప్తి రవీంద్ర, మాస్టర్ కేశవ్ ఇతర పాత్రలుపోషించారు. మీరా విజయ్ ఆంటోని సమర్పణలో విజయ్ ఆంటోని ఫిల్మ్ కార్పొరేషన్‌పై విజయ్ ఆంటోని నిర్మించారు. ఈ సినిమాని తొలుత సెప్టెంబర్ 5న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
అయితే ఆ తేదీకి కాకుండా 19వ తేదీ రిలీజ్ చేయనున్నట్లు లేటెస్ట్‌గా అనౌన్స్ చేశారు. ఈ సినిమాని తెలుగులో ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ విడు దల చేస్తోంది. ఈ చిత్రంలో కిట్టు పాత్రలో విజయ్ ఆంటోని నటించారు. సుమారు 200 కోట్ల రూపాయల కుంభకోణం చుట్టూ ఈ కథ తిరుగుతుంది. గత చిత్రాల కంటే స్టైలిష్‌గా, యాక్షన్ హీరోగా కనిపించనున్నారు విజయ్.
వెండితెరపై తాండవం...
హీరో బాలకృష్ణ, డైరెక్టర్ బోయపాటి శ్రీనులది హిట్ కాంబినేషన్. వారి కలయికలో వచ్చిన ‘సింహా (2010), లెజెండ్ (2014), అఖండ’ (2021) సినిమాలు మంచి విజయం అందుకున్నాయి. హ్యాట్రిక్ హిట్స్ తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘అఖండ 2: తాండవం’. ‘అఖండ’ చిత్రానికి సీక్వెల్‌గా రూపొందుతోన్న ఈ మూవీలో సంయుక్తా మీనన్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఎం. తేజస్విని సమర్పణలో 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మిస్తున్నారు. ఈ సినిమాని సెప్టెంబర్ 25న విడుదల చేయనున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించిన సంగతి తెలిసిందే.
గ్యాంగ్‌స్టర్ పాత్రలో...
పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఓజీ’. ‘రన్ రాజా రన్, సాహో’ చిత్రాల ఫేమ్ సుజీత్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ప్రియాంకా మోహన్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఇమ్రాన్ హష్మీ, అర్జున్ దాస్, ప్రకాశ్‌రాజ్, శ్రియా రెడ్డి కీలక పాత్రలుపోషిస్తున్నారు. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 25న విడుదల కానుంది. ‘‘ఓజీ’ చిత్రంలో పవన్ కల్యాణ్ భీకరమైన గ్యాంగ్‌స్టర్ పాత్రలో కనిపించనున్నారు’’ అని చిత్రబృందం పేర్కొంది.
యాక్షన్ ఫ్యాక్డ్ థ్రిల్లర్
‘విరూపాక్ష’, ‘బ్రో’ వంటి హిట్ సినిమాల తర్వాత సాయిదుర్గా తేజ్ నటిస్తున్న తాజా చిత్రం ‘ఎస్‌వైజీ’ (సంబరాల యేటిగట్టు). ఈ సినిమా ద్వారా రోహిత్ కేపీ దర్శకునిగా పరిచయమవుతున్నారు. ఈ చిత్రంలో ఐశ్వర్యా లక్ష్మి కథానాయికగా నటిస్తున్నారు. ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్‌పై ‘హనుమాన్’ (2024) వంటి పాన్ ఇండియన్ ఫిల్మ్ నిర్మించిన కె. నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి ఈ సినిమా నిర్మిస్తున్నారు. ‘‘యాక్షన్ ఫ్యాక్డ్ థ్రిల్లర్‌గా రూపొందుతోన్న చిత్రం ‘ఎస్‌వైజీ’ (సంబరాల యేటిగట్టు). ఈ చిత్రంలో మునుపెన్నడూ చూడని పవర్‌ఫుల్ పాత్రలో కనిపించనున్నారు సాయిదుర్గా తేజ్. ఆయనపోరాట సన్నివేశాలు సరికొత్తగా ఉంటూ ఆడియన్స్‌ని మెస్మరైజ్ చేస్తాయి. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాని సెప్టెంబర్ 25న విడుదల చేయనున్నాం’’ అని చిత్రవర్గాలు పేర్కొన్నాయి.
నవ్వులే నవ్వులు
‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు’ మూవీ ఫేమ్ శివానీ నగరం, ‘90స్ ఎ మిడిల్ క్లాస్ బయోపిక్’ ఫేమ్ మౌళి తనుజ్ జంటగా నటించిన చిత్రం ‘లిటిల్ హార్ట్స్’. సాయి మార్తాండ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రాజీవ్ కనకాల, ఎస్‌ఎస్ కాంచీ, అనిత చౌదరి, సత్య కృష్ణన్ ఇతర పాత్రలుపోషించారు. ఈటీవీ విన్ ఒరిజినల్ ప్రోడక్షన్ బ్యానర్‌పై ఆదిత్య హాసన్ నిర్మించారు.
ఈ సినిమాని నిర్మాతలు బన్నీ వాసు, వంశీ నందిపాటి సెప్టెంబర్ 12న విడుదల చేస్తున్నారు. ‘‘పూర్తి స్థాయి వినోదాత్మకంగా రూపొందిన చిత్రం ‘లిటిల్ హార్ట్స్’. సినిమా చూస్తున్నంత సేపు థియేటర్లలో ప్రేక్షకులు కడుపుబ్బా నవ్వుకుంటారు. 2 గంటల పాటు మా చిత్రం ఆడియన్స్‌కి నవ్వులు పంచుతుంది’’ అని చిత్రబృందం పేర్కొంది. కాగా సింజిత్ యెర్రమల్లి సంగీతం అందించిన ఈ సినిమా నుంచి ‘రాజా గాడికి...’ అంటూ సాగే పాటని విడుదల చేయగా మంచి స్పందన వచ్చింది.
పైన పేర్కొన్న సినిమాలే కాదు.. మరికొన్ని చిత్రాలు కూడా సెప్టెంబరులో విడుదలకు ముస్తాబవుతున్నాయి. – డేరంగుల జగన్ మోహన్