బాబంటే.. బాబే.. | Mahesh Babu Birthday Special Story | Sakshi
Sakshi News home page

బాబంటే.. బాబే..

Aug 8 2026 5:25 PM | Updated on Aug 9 2026 7:18 AM

Mahesh Babu Birthday Special Story

సినీ రంగంలో స్టార్‌లకు కొదవలేదు. కానీ వెండితెరపై విజయాలకే పరిమితం కాకుండా..నిజ జీవతంలోనూ వేలాది మంది జీవితాల్లో చిరునవ్వులు పూయించేవారు మాత్రం అరుదు. ఈ జాబితాల్లో ముందువరసలో ఉంటారు సూపర్‌స్టార్‌ మహేశ్‌ బాబు. కోట్లాది ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్న ఆయన.. నిజ జీవితంలో పసి హృదయాల రారాజుగా నిలిచారు. బాలనటుడిగా మొదలై.. భారతీయ సినీ పరిశ్రమలో అత్యంత ప్రభావశీల నటుడిగా ఎదిగారు. ఆయన ప్రస్థానం.. విజయాలు, వైఫల్యాలు, రికార్డులు, సేవా కార్యక్రమాలు, కుటుంబ విలువలు, క్రమశిక్షణాల సమ్మేళనం. ప్రతి పాత్రలో నటుడిగా ఎదుగుతూ.. ప్రతి సేవా కార్యక్రమంలో మనిషిగా ఉన్నతంగా నిలిచిన మహేశ్‌బాబు పుట్టినరోజు సందర్భంగా ఆయన జీవిత ప్రయాణంపై ప్రత్యేక కథనం.

తమిళనాడులో జననం..
సూపర్‌స్టార్‌ కృష్ణ తనయుడిగా ఆగస్టు 09,1975లో తమిళనాడులో జన్మించారు మహేశ్‌ బాబు. సినీ కుటుంబంలో పుట్టడంతో వెండి తెర కొత్త కాలేదు. చిన్నప్పటి నుంచి కెమెరాలు, షూటింగ్‌ల మధ్య పెరిగినా..తండ్రి పేరును ఆసరగా చేసుకోకుండా ప్రతిభే లక్ష్యంగా అడుగులు వేశారు. అదే ఆలోచన ఆయన్ని కోట్లాది అభిమానుల కథానాయకుడిని చేసింది.

నాలుగేళ్లలోపే గుర్తింపు..
చాలామంది హీరోలు యుక్త వయసులో అడుగుపెడితే.. ఈ రారాజు మాత్రం నాలుగేళ్లలోనే సినీ ప్రపంచంలోకి రంగ ప్రవేశం చేశారు. ‘నీడ’తో ప్రారంభమైన ఆయన ప్రయాణం వరుసగా పలు చిత్రాల వరకు కొనసాగింది. చిన్న వయసులోనే తన సహజమైన నటనతో దర్శకులను, ప్రేక్షకులను ఆకట్టుకుని భవిష్యత్తుకు బలమైన పునాది వేసుకున్నారు. బాలనటుడిగా మంచి గుర్తింపు వచ్చినప్పటికీ చదువుకు ఇబ్బందులు ఎదరవకూడదనే ఉద్దేశంతో కొన్నేళ్లు పూర్తిగా సినిమాలకు బ్రేక్‌ వేశారు మహేశ్‌. తమిళనాడులో విద్యాభ్యాసం పూర్తి చేసి మళ్లీ కమ్‌బ్యాక్‌ ఇచ్చారు.

రాజకుమారుడుతో హీరో.. ఒక్కడుతో స్టార్‌
1999లో వైజయంతీ పతాకంపై రాజకుమారుడు సినిమాతో హీరోగా ఆరగ్రేటం చేసి మంచి విజయాన్ని అందుకున్నాడు. హీరోగా సినీ ప్రపంచానికి పరిచయం చేసింది దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు కావడం విశేషం. తర్వాత వచ్చిన మురారి నటుడిగా గుర్తింపు తీసుకురాగా.. ఒక్కడుతో స్టార్‌ హీరోగా ఎదిగాడు. ఆ తర్వాత వచ్చిన పోకిరి, అతడు, దూకుడు, శ్రీమంతుడు, భరత్‌ అనే నేను,మహర్షి వంటి చిత్రాలు ఆయన స్థాయిని మరింత పెంచాయి.

నిజ జీవితంలో శ్రీమంతుడై..
శ్రీమంతుడు సినిమాతో గ్రామాన్ని దత్తత తీసుకునే సందేశాన్ని తెరపైకి తీసుకొచ్చిన ప్రిన్స్‌.. అదే ఆలోచనను నిజ జీవంతంలోనూ ఆచరించి శ్రీమంతుడిగా మారారు. గ్రామాల అభివృద్ధికి చేయూతనిస్తూ.. సమాజానికి సాయం చేయాలనే దృక్పథంతో ముందుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్‌లోని బుర్రిపాలెం, తెలంగాణలోని సిద్దాపురం గ్రామాలను దత్తత తీసుకుని వాటి అభివృద్ధికి నాంది పలికారు. దీంతో బాధ్యత గల పౌరుడిగానూ గుర్తింపు సంపాదించుకున్నారు.

హృదయాల రారాజుగా.. 
గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న పేద చిన్నారులకు మహేశ్‌ బాబు ఫౌండేషన్‌ అనే సేవా సంస్థని స్థాపించి ఉచితంగా గుండె ఆపరేషన్స్‌ చేయించాడు. ఇప్పటి వరకు 5000లకు పైగా శాస్త్రచికిత్సలు చేసి వారి పాలిట దేవుడిగా నిలిచాడు. అందుకే చిన్నారులతో మొదలు అభిమానుల సైతం ఆయన్ని పసి హృదయాల రారాజుగా పిలుచుకుంటారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement