
కోలీవుడ్ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. ప్రముఖ దర్శకుడు భారతీరాజా తనయుడు మనోజ్ గుండెపోటుతో ఈ రోజు సాయంత్రం మృతి చెందారు. అనారోగ్యంతో చెన్నైలోని ఓ ఆస్పత్రిలో చేరిన మనోజ్‌కు హఠాత్తుగా గుండెపోటు రావడంతో తుదిశ్వాస విడిచారు. ప్రస్తుతం ఆయన వయస్సు 48 ఏళ్లు కాగా.. ఇటీవలే ఆయనకు గుండెకు శస్త్రచికిత్స జరిగినట్లు తెలుస్తోంది.
కాగా.. మనోజ్ భారతిరాజా ప్రముఖ లెజెండరీ ఫిల్మ్ మేకర్ భారతిరాజా కుమారుడు. మనోజ్ తొలిసారిగా తాజ్ మహల్ (1999)మూవీలో నటించారు. ఆ తర్వాత అల్లి అర్జున (2002), కాదల్ పుక్కల్ (2001), అన్నక్కోడి, పల్లవన్, లాంటి తమిళ చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్నారు. గత రెండేళ్లుగా దర్శకత్వం వైపు అడుగులు వేశారు. తన తండ్రి నిర్మించిన 2023 తమిళ చిత్రం మార్గజి తింగల్‌తో దర్శకుడిగా పరిచయమయ్యారు.
మనోజ్ అరంగేట్రం చేయడానికి ముందు సినిమా పట్ల ఉన్న అభిరుచితో అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేశాడు. అంతకుముందు అతను సౌత్ ఫ్లోరిడా విశ్వవిద్యాలయంలో థియేటర్ ఆర్ట్స్ అభ్యసించారు. ఫైనల్ కట్ ఆఫ్ డైరెక్టర్ (2016) వంటి చిత్రానికి తన తండ్రికి అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశాడు. ఇక వ్యక్తిగత జీవితానికి వస్తే మనోజ్ తన స్నేహితురాలు, తమిళ నటి నందనను నవంబర్ 19న, 2006న వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు.