
కన్నడ బిగ్‌బాస్ సీజన్– 12 (Kannada Bigg Boss 12) ఊపిరి పీల్చుకుంది. గురువారం నుంచి పునఃప్రారంభమైంది. బిడది వద్ద ఓ స్టూడియోలో నిర్వహిస్తున్న బిగ్‌బాస్‌కు కాలుష్య నియంత్రణ మండలితో సహా వివిధ శాఖల అనుమతులు లేవంటూ మంగళవారం నాడు జిల్లా కలెక్టరు, ఇతర అధికారులు ఆగమేఘాలపై షోను బంద్ చేసి హౌస్‌కు తాళం వేయడం తెలిసిందే. ఈ వ్యవహారం తీవ్ర దుమారం రేకెత్తించింది. డిప్యూటీ సీఎం డీకే శివకుమారే మూసివేయించారని కేంద్రమంత్రి హెచ్‌డీ కుమారస్వామి ఆరోపించారు. ఇది కక్ష సాధింపు చర్యగా అభిప్రాయపడ్డారు. అయితే చివరకు హౌస్ మళ్లీ తెరుచుకుంది. సర్కారు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో రిసార్టులో ఉంచిన పోటీదారులను గురువారం తెల్లవారుజామున బిగ్‌బాస్ స్టూడియోకు తరలించారు. హౌస్‌కు వెళ్లగానే కార్యక్రమం తిరిగి మొదలైంది.
డిప్యూటీ సీఎం చెప్పారు: కలెక్టరు
ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ సూచనల మేరకే బిగ్‌బాస్‌కు అనుమతించినట్లు జిల్లా కలెక్టర్ యశవంత్ గురకర్ తెలిపారు. జిల్లా కలెక్టర్, సబ్ కలెక్టర్ ఇద్దరు కలిసి మూతపడిన గేటును తెరిచారు. ఆ తరువాత పోటీదారులు లోపలకు వెళ్లారు. దీంతో శివకుమార్‌కు యాంకర్, హీరో కిచ్చా సుదీప్ ధన్యవాదాలు తెలిపారు.
బెస్కాం నోటీసులు
బిగ్‌బాస్ స్టూడియోలో అన్ని సమస్యలను 10 రోజుల్లోగా పరిష్కరించుకోవాలని, లేదంటే కరెంటు కట్ చేస్తామని బిడది బెస్కాం ఎఈఈ మోహిత నోటీసులిచ్చి వెళ్లారు. అనుమతులు లేనందువల్ల స్టూడియోకు ఎందుకు కరెంట్‌ను కట్ చేయాకూడదో చెప్పాలని నోటీసులో కోరారు. పర్యావరణ అనుమతులు లేవన్న కారణంతోనే.. బిగ్‌బాస్ ఇంటికి ఒకరోజు తాళం వేశారు. కాగా, బిగ్‌బాస్‌కు వ్యతిరేకంగా స్టూడియో ముందు కన్నడ సంఘాలు ధర్నా చేశాయి. ఇకపోతే కన్నడ బిగ్‌బాస్ 12వ సీజన్.. సెప్టెంబర్ 28న ప్రారంభమైంది.
చదవండి: సినిమాల విషయంలో చిన్న, పెద్ద అని తేడా చూడను: హీరోయిన్