వేధింపులను భరించాల్సిన అవసరం లేదంటోంది కన్నడ హీరో దర్శన్ భార్య విజయలక్ష్మి. తనపై ఆన్‌లైన్ వేధింపులు తీవ్రతరం అవడంతో ఇటీవలే ఆమె పోలీసులను ఆశ్రయించింది. ఈ సందర్భంగా విజయలక్ష్మి మాట్లాడుతూ.. ఆన్‌లైన్‌లో ట్రోలింగ్స్ ఎదుర్కోవడం నాకు ఇదేం మొదటిసారి కాదు. నాలుగేళ్ల క్రితం నా ఫోటోలు మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో వదిలారు. దీనిపై నేను పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు చట్టపరమైన చర్యలు తీసుకున్నారు.
నాకే ఇలా జరుగుతుందంటే..
కానీ, ఈసారి వేధింపుల తీవ్రత మరింత పెరిగింది. కొందరు హద్దులు దాటుతూ ప్రవర్తిస్తున్నారు. ఇలాంటి హీనమైన చర్యలను ఏమాత్రం సహించకూడదు. నాకే ఇలా జరుగుతుంటే ఇక సాధారణ మహిళల పరిస్థితి ఏంటి? ఎంతోమంది అమ్మాయిలు ఆన్‌లైన్‌లో వేధింపులకు గురవుతున్నారు, అది తల్చుకుంటేనే నా హృదయం ముక్కలవుతోంది.
నిశ్శబ్ధాన్ని వీడండి
తప్పు చేసేవారు భయపడాలి, మనం కాదు! ఎవరికోసమో మీరు మారక్కర్లేదు. ట్రోలర్స్‌ను లెక్క చేయకండి. నిశ్శబ్ధంగా కుమిలిపోకండి, బయటకు రండి, మీపై జరుగుతున్న వేధింపులను నిలదీయండి. ధైర్యంగా ఫిర్యాదు చేయండి. అయితే మహిళా భద్రత విషయంలో సైబర్ న్యాయ వ్యవస్థ మరింత కఠినంగా, సమర్థవంతంగా ఉండాల్సిన అవసరం ఉంది అని విజయలక్ష్మి చెప్పుకొచ్చింది.
జైలు జీవితం
ఇకపోతే అభిమాని రేణుకాస్వామి హత్య కేసులో కన్నడ హీరో దర్శన్ జైలుపాలైన విషయం తెలిసిందే! ప్రియురాలు పవిత్రకు అసభ్య సందేశాలు, అశ్లీల ఫోటోలు పంపాడన్న కోపంతో దర్శన్ కొందరు మనుషులతో కలిసి రేణుకాస్వామిని చంపినట్లు ఆరోపణలున్నాయి. ఈ కేసులోనే దర్శన్ జైలు జీవితం గడుపుతున్నాడు.
చదవండి: సినిమా ఫ్లాప్.. నాకు బాగా కలిసొచ్చింది: బాలీవుడ్ నటి


