
బాలీవుడ్ నటి, ఎంపీ కంగనా రనౌత్‌కి ఫైర్ బ్రాండ్ అనే గుర్తింపు ఉంది. ఏ విషయాన్ని అయినా కుండ బద్దలు కొట్టినట్లు మాట్లాడుతుంది. తన వ్యక్తిగత విషయాలతో పాటు దేశంలో జరుగుతున్న పలు ఘటనలపై కూడా ఆమె స్పందిస్తుంటారు. వివాదస్పద వ్యాఖ్యలు చేయడం..ట్రోలింగ్‌ని ఎదుర్కొవడం ఆమెకు కొత్తేమి కాదు. అయితే ప్రతి ఇంటర్వ్యూలోనూ రాజకీయాలు, సినిమా అంశాలపై మాట్లాడే కంగనా..ఈ సారి మాత్రం తన ఫ్యామిలీ విషయాలను షేర్ చేసుకుంది.
తన సోదరుడు పుట్టిన 10 రోజులకే చనిపోయాడని ఎమోషనల్ అయింది. తాజాగా ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కంగనా మాట్లాడుతూ.. ‘నా కంటే ముందే మా అమ్మకి బాబు పుట్టి చనిపోయాడు. మా అన్నయ్య పుట్టిన 10 రోజులకే ఆస్పత్రిలో చనిపోయాడట. సరైన కారణం తెలియదు కానీ ‘బొడ్డు తాడు కొంచెం ఎక్కువగా కత్తిరించడం వల్లే చనిపోయాడు’ అని మా అమ్మ నమ్మింది. ఈ విషయంలో చాలా బాధపడింది.
ఇదంతా కళ్లారా చూసిన మా నాన్నమ్మ.. తర్వాత మా అమ్మని ఆస్పత్రికే పంపలేదు. అంతేకాదు ప్రసవానికి ఎవరూ ఆస్పత్రికి వెళ్లొద్దని కండీషన్ పెట్టింది. దీంతో మా అమ్మ ఇంట్లోనే ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చింది. మా అత్తమ్మ కూడా ఇంట్లోనే ఇద్దరు పిల్లలను కనింది. ఆస్పత్రికి వెళ్తే పిల్లలు చనిపోతారన్న మూఢనమ్మకంతో మా నాన్నమ్మ వాళ్లకు ఇంట్లోనే ప్రసవం అయ్యేలా ఏర్పాట్లు చేసింది’ అని కంగనా చెప్పుకొచ్చింది.
నాన్న తక్కువ చేసి మాట్లాడేవాడు
నాన్న ఎప్పుడూ తనను తక్కువ చేసి మాట్లాడేవాడని కంగనా గుర్తు చేసుకుంది. ‘బాగా చదువుకుంటేనే మనలాంటి మంచి ఫ్యామిలీ దొరుకుతుందని చెప్పువాడు. ఒకవేళ చదువుకోకపోతే..మంచి వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేయనని బెదిరించేవాడు. వాళ్లు చెప్పేది నా మంచి కోసమే అని తెలుసు. వాళ్లు కోరుకునే జీవితం బాగుంది. కానీ నాకు మాత్రం అలా జీవించాలని లేదు’ అని కంగనా చెప్పుకొచ్చింది.
హిమాచల్ ప్రదేశ్‌కి చెందిన రాజ్‌పుత్ కుటుంబంలో కంగనా జన్మించింది. ఆమె తల్లి ఆశా రనౌత్ టీజర్. తండ్రి అమర్‌దీప్ రనౌత్ వ్యాపారవేత్త. కంగనాకు అక్క, తమ్ముడు ఉన్నారు. 2024లో జరిగిన లోకసభ ఎన్నికల్లో మండి నియోజకవర్గం(హిమాచల్ ప్రదేశ్) నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు.