
మక్కల్‌నీది మయ్యం నేత , సినీ నటుడు కమలహాసన్ ఈనెల 25వ తేదీన రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేస్తారని ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది. లోక్ సభ ఎన్నికల సమయంలో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు కమల్‌కు రాజ్యసభ అవకాశాన్ని డీఎంకే కల్పించిన విషయం తెలిసిందే. ఇటీవల ఆయన ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. ఈ పరిస్థితులలో పెద్దలసభలో కమల్ ప్రమాణ స్వీకారం తేదీ గురించి ఆ పార్టీ కార్యాలయంలో ప్రకటించడం గమనార్హం.
2018, ఫిబ్రవరి 21వ తేదీన కమల్ హాసన్ ఎన్‌ఎంఎం(Makkal Needhi Maiam) పార్టీని మధురైలో స్థాపించారు. అప్పటి నుంచి ఏ ఎన్నికల్లోనూ ఆ పార్టీ ప్రభావం చూపెట్టలేకపోయింది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఆయన పార్టీ పోటీ చేసినప్పటికీ. ఆశించిన ఫలితం సాధించలేకపోయింది. అయితే.. ఓటు షేర్ మాత్రం 3.72 శాతం దక్కించుకుంది. మరీ ముఖ్యంగా చెన్నై, కోయంబత్తూరు, మధురైలో భారీగా ఓట్లు పడ్డాయి. అయితే గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం ఆ పార్టీ అభ్యర్థులు డిపాజిట్లు కోల్పోయారు.
2021 అసెంబ్లీ ఎన్నికల్లోనూ పోటీ చేసినా.. ఒక్క సీటు గెలవలేకపోయింది. కోయంబత్తూరులో పోటీ చేసిన కమల్.. బీజేపీ అభ్యర్థి వనతిశ్రీనివాసన్ చేతిలో 1,728 ఓట్ల మెజారిటీలోఓటమి పాలయ్యారు. 2022 పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసినా.. 140 స్థానాలకు ఒక్కటి కూడా గెలవలేకపోయింది. 2024 లోక్‌సభ ఎన్నికల సమయంలో ఇండియా కూటమి(INDIA Alliance)కి కమల్ పార్టీ ఎంఎన్‌ఎం మద్దతు ప్రకటించి ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో డీఎంకే ఎంఎన్‌ఎం మధ్య ఓ ఒప్పందం కుదిరినట్లు తమిళ మీడియా వర్గాలు కథనాలు ఇచ్చాయి. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడమా? లేదంటే రాజ్యసభకు వెళ్లడమా? అనే ఛాయిస్ కమల్‌కు డీఎంకే ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఆయన రాజ్యసభకే మొగ్గు చూపినట్లు అప్పటి కథనాల సారాంశం.