కాజల్ అగర్వాల్, శ్రేయాస్ తల్పాడే నటించిన చిత్రం ‘ది ఇండియా స్టోరీ’. ‘స్లో పాయిజన్ ఇన్ ప్రోగ్రెస్...’ అన్నది ట్యాగ్‌లైన్. చేతన్ డీకే దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి సాగర్ బి. షిండే కథ అందించి, నిర్మించారు. ఈ సినిమా ఈ నెల 24న ప్రపంచవ్యాప్తంగా హిందీ, తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది. ఈ మూవీ నుంచి ఓ పోస్టర్‌ను శుక్రవారం విడుదల చేశారు.
ఈ సందర్భంగా చేతన్ డీకే మాట్లాడుతూ–‘‘విషపూరిత పురుగు మందుల వ్యవసాయం, దాని వల్ల ప్రజల ఆరోగ్యంపై పడుతున్న తీవ్ర ప్రభావం వంటి అంశాల ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘ది ఇండియా స్టోరీ’. మోసంతో నడిచే వ్యవస్థను ప్రశ్నిస్తే మొదట ఎదురయ్యేది భయం, ఆగ్రహమే. ‘ది ఇండియా స్టోరీ’లోని ప్రతి సన్నివేశం ఆ పోరాటాన్ని చూపించడంతో పాటు మనం తినేది, నమ్మేది గురించి ప్రేక్షకులు ఆలోచించేలా చేస్తుంది. సమాజానికి సంబంధించిన కీలక అంశాన్ని కోర్ట్ రూమ్ డ్రామా రూపంలో చూపిస్తున్నాం’’ అని పేర్కొన్నారు.


