‘వారణాసి’ షూటింగ్ పనులు మళ్లీ ఉపందుకున్నాయి. మహేశ్‌బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘వారణాసి’. ప్రియాంకా చోప్రా పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్‌కు ఇటీవల చిన్న విరామం వచ్చింది. దీంతో కుటుంబంతో కలిసి విదేశాలకు విహార యాత్రకు వెళ్లారు మహేశ్‌బాబు. మరోవైపు తన గత చిత్రాలు (ఆర్‌ఆర్‌ఆర్, బాహుబలి, ఈగ, మర్యాద రామన్న) పారిస్‌లో ప్రదర్శితమైన నేపథ్యంలో అక్కడికి వెళ్లారు రాజమౌళి.
తాజాగా ఈ ఇద్దరూ హైదరాబాద్ చేరకున్నారని సమాచారం. దీంతో ‘వారణాసి’ షూటింగ్ మళ్లీ షురూ అయ్యిందని తెలిసింది. ఈ సినిమా కొత్త షెడ్యూల్ ఈ వారంలోనే ప్రారంభం కానుందట. ఈ షెడ్యూల్‌లో మొదట మహేశ్‌బాబు పాల్గొనరని, ఈ నెల 16 తర్వాత పాల్గొంటారని సమాచారం. ఈ షెడ్యూల్‌లో ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరించేందుకు సన్నాహాలు చేస్తున్నారట. ఈ షూట్‌లో దాదాపు 3 వేల మంది జూనియర్ ఆర్టిస్టులు పాల్గొంటారని భోగట్టా. కేఎల్ నారాయణ, ఎస్‌ఎస్ కార్తికేయ నిర్మిస్తున్న ఈ చిత్రం 2027 ఏప్రిల్ 7న రిలీజ్ కానుంది.


