‘‘సాధారణ ప్రజలు ప్రతి రోజూ వినియోగించే ఆహార పదార్థాల వెనక దాగి ఉన్న ప్రమాదాలను వెలుగులోకి తీసుకురావడంతో పాటు ఈ అంశంపై సమాజంలో అవగాహన కల్పించే ప్రయత్నంగా ‘ది ఇండియా స్టోరీ’ సినిమాను తెరకెక్కించాం’’ అని పేర్కొన్నారు డీకే చేతన్. కాజల్ అగర్వాల్, శ్రేయాస్ తల్పాడే ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘ది ఇండియా స్టోరీ. డీకే చేతన్ దర్శకత్వంలో జీ స్టూడియోస్ సమర్పణలో ఎంఐజీ ప్రొడక్షన్ అండ్ స్టూడియోస్ సహకారంతో సాగర్ బి. షిండే నిర్మించడంతో పాటు ఈ సినిమాకు కథ, స్క్రీన్‌ప్లే అందించారు.
ఈ సినిమా జూలై 24న తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదల కానుంది. ముంబై హైకోర్టు నేపథ్యంలో సాగే కోర్టు రూమ్ డ్రామా ఇది. గురువారం ఈ సినిమా అధికారిక పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్‌లో కాజల్ చేతిలో ఉన్న ఫైల్‌పై క్యాన్సర్ ఫైల్స్ అని కనిపిస్తోంది. ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ న్యాయవాది పాత్రలో కనిపిస్తారు.
‘‘ఆహార కల్తీ కారణంగా కుటుంబ సభ్యులు, కావాల్సినవారిని కోల్పోయిన ప్రతి భారతీయుడి కథే ఈ సినిమా. మన సమాజంలో నిర్లక్ష్యానికి గురవుతున్న అత్యంత తీవ్రమైన సమస్యల్లో ఆహార కల్తీ ఒకటి. మనందరి రోజువారీ జీవితాలను ప్రభావితం చేసే అంశం ఇది. ఈ సినిమాలో ఉన్న బలమైన సందేశం ప్రతి ఒక్కరి కళ్లు తెరిపించేలా ఉంటుంది. ప్రతి రోజూ తాము తీసుకునే ఆహారం విషయంలో మరింత అవగాహనతో ఉండాలని ప్రేరేపిస్తుందని నమ్ముతున్నాను’’ అని పేర్కొన్నారు చేతన్ డీకే.


