
‘ఓదెల రైల్వే స్టేషన్ లాక్ డౌన్ టైం లో చేసిన సినిమా. కరోనా కారణంగా షూటింగులన్నీ ఆగిపోయాయి. మళ్లీ ఎప్పుడు మొదలవుతాయో కూడా తెలియని సమయంలో సంపత్ నంది గారు అండ్ టీం ధైర్యంగా ముందుకు వచ్చి ఓదెల చేయడం జరిగింది. నిజానికి ఆ సమయంలో దీనికి సీక్వెల్ అవుతుందని నేను అనుకోలేదు. సినిమా చాలా మంచి విజయాన్ని అందుకుంది. మేము ఊహించిన దాని కంటే గొప్ప విజయం దక్కింది. సినిమా చూసిన ప్రేక్షకులంతా చాలా బావుందని మెచ్చుకున్నారు. అయితే అప్పుడు కూడా ఈ సినిమాకి సీక్వెల్ ఈ స్థాయిలో ఉంటుందని, ఇంత గ్రాండ్ స్కేల్లో సీక్వెల్ వస్తుందని నేను ఊహించలేదు’ అని హెబ్బా పటేల్(Hebah Patel) అన్నారు. తమన్నా ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘ఓదెల 2’. హెబ్బా పటేల్, వశిష్ట సింహా కీలక పాత్రలు పోషించారు. ఏప్రిల్ 17న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా హెబ్బా పటేల్ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..
⇢ ఓదెల 2 (Odela 2 Movie) సూపర్ నేచురల్ థ్రిల్లర్. ఓదెల కంటే ఓదెల2 చాలా పెద్ద సినిమా. చాలా అద్భుతమైనటువంటి ఎలిమెంట్స్ ఉంటాయి. ఆడియన్స్ కి గ్రేట్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది.
⇢ ఇందులో తమన్నా గారితో నాకు కాంబినేషన్ సీన్స్ ఉన్నాయి. తను నా సిస్టర్ క్యారెక్టర్ లో కనిపిస్తారు. అయితే సినిమాలో ఎక్కువ శాతం నేను జైల్ ఎపిసోడ్స్ లో కనిపిస్తాను. ఫస్ట్ పార్ట్ లో నా క్యారెక్టర్ ఎంత ఇంపాక్ట్ చూపించిందో ఈ సెకండ్ పార్ట్ లో కూడా అంత ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది.
⇢ తమన్నా గారు ప్రతి క్యారెక్టర్ ని చాలా సీరియస్ గా తీసుకుంటారు. ఒక క్యారెక్టర్ కోసం ఆమె ప్రిపేర్ అయ్యే విధానం నాకు చాలా నచ్చింది. ఓదెల2 కోసం చాలా అద్భుతంగా ప్రిపేర్ అయ్యారు. నిజానికి ఓదెల సినిమా చేస్తున్నప్పుడు నా క్యారెక్టర్ గురించి నేను ముందుగా ఏం ప్రిపేర్ కాలేదు. తమన్నా గారిలా హోంవర్క్ నేనెప్పుడూ చేయలేదు. ఫ్యూచర్లో అలాంటి హోంవర్క్ చేయాలని నేర్చుకున్నాను.
⇢ సంపత్ గారు విజనరీ ఫిలిం మేకర్. ఆయన ఫస్ట్ ఓదెల కథలో నా క్యారెక్టర్ చెప్పినప్పుడు నాకే షాకింగ్ అనిపించింది. అంత పర్ఫార్మెన్స్ బేస్డ్ క్యారెక్టర్ నేను చేయగలనా? అనిపించింది. అయితే సంపత్ గారు ప్రయత్నించమని చెప్పారు. ఆయన నాపై అలాంటి నమ్మకాన్ని ఉంచడం చాలా ఆనందంగా అనిపించింది. ఆయన నమ్మకం నాకు మరింత కాన్ఫిడెన్స్ ఇచ్చింది. సంపత్ గారు చాలా నైస్, కైండ్ పర్సన్. ఆయనతో వర్క్ చేయడం చాలా ఆనందాన్ని ఇచ్చింది.
⇢ కుమారి 21ఎఫ్ సినిమా నాకు ఒక ఫేమ్ తీసుకొచ్చింది. ఓదెల సినిమా యాక్టర్ గా నాకు ఒక క్రెడిబిలిటీ ఇచ్చింది. నేను అన్ని రకాల పాత్రలు చేయగలనని నమ్మకాన్ని కల్పించింది. ఒక నటిగా ఓదెల నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను.
⇢ అజినీస్ మ్యూజిక్ ఈ సినిమాకి బిగ్ ఎసెట్. ఆయన మ్యూజిక్ తో సినిమాని మరో లెవెల్ కి తీసుకెళ్లారు. బ్యాగ్రౌండ్ స్కోరు ఎక్స్ట్రార్డినరీగా ఉంటుంది. ఒక సూపర్ నేచురల్ థ్రిల్లర్ కి కావాల్సిన పర్ఫెక్ట్ మ్యూజిక్ ఇచ్చారు.
⇢ ఇండస్ట్రీకి వచ్చి పదేళ్లు పూర్తయింది. ఈ ప్రయాణం ఆనందంగానే ఉంది. అప్స్ అండ్ డౌన్స్ ఉన్నాయి. అయితే ఒక నటిగా నేను ఎప్పుడూ హ్యాపీగానే ఉంటాను. సక్సెస్ ఫెయిల్యూర్ ఏది ఫైనల్ కాదు. పనిచేసుకుంటూ వెళ్లడమే మన చేతిలో ఉంది. ఈ జర్నీలో చాలా విషయాలు నేర్చుకున్నాను. మరో 10 ఏళ్లు నటిగా ప్రయాణిస్తానని నమ్మకం ఉంది.
⇢ ఇప్పటివరకు చాలా జోనర్స్ సినిమాలు ట్రై చేశాను. ఒక ఫుల్ ఫుల్ ఫ్లెడ్జ్ కామెడీ ఎంటర్టైనర్ చేయాలనుంది. ప్రస్తుతం తెలుగులో ఓ రెండు సినిమాలు రిలీజ్ కు రెడీగా అవుతున్నాయి. ఒక కన్నడ సినిమా చేస్తున్నాను. నెక్స్ట్ మంత్ స్టార్ట్ కాబోతుంది.