ప్రస్తుతం ఒక సినిమా తెరకెక్కించాలంటే వందల కోట్ల బడ్జెట్ అవసరమవుతోంది. చిన్న సినిమాలకు సైతం కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. అలాంటిది కేవలం రూ. 2 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఓ హిందీ చిత్రం.. బాక్సాఫీస్ వద్ద రూ. 400 కోట్లకు పైగా వసూళ్లు సాధించి ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపరిచింది. అదే ‘హనుమాన్ అంశ్’. భారీ హంగులు, స్టార్ హీరోలు లేకుండానే సంచలన విజయాన్ని అందుకున్న ఈ చిత్రం నేడు(అక్టోబర్ 9) తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంది? ఇంతటి విజయాన్ని అందుకునేలా ఇందులో ఏముంది? రివ్యూలో చూద్దాం.
కథేంటంటే..
భారతదేశానికి స్వాతంత్య్రం రాక ముందు జరిగిన కథ ఇది. చిన్న వయసులోనే తల్లిని కోల్పోయిన లక్ష్మీనారాయణ(శోభినవ్ సత్య) అనే బాలుడి జీవితంతో కథ ప్రారంభం అవుతుంది. చనిపోయిన తల్లి..దేవుడి దగ్గరకు వెళ్లిందని చెప్పడంతో.. ఆ బాలుడు మనసు భగవంతుడివైపు మళ్లుతుంది. క్రమంగా ఆంజనేయస్వామి భక్తుడిగా మారుతాడు. కుటుంబాన్ని, ఇంటిని వదిలేసి..రామ జపం చేస్తూ ఉత్తర భారతదేశం మొత్తం తిరుగుతుంటాడు. చివరికి అదే ఆధ్యాత్మిక ప్రయాణం అతడిని నీమ్ కరోలి బాబాగా మారే దిశగా తీసుకెళ్తుంది. నీమ్ కరోలి బాబా ఆధ్యాత్మిక ప్రయాణం ఎలా సాగింది? ఆయన సాగించిన ప్రయాణంలో ఎంతమంది జీవితాల్లో వెలుగులు నింపాడు? అనేదే ఈ సినిమా కథ.
ఎలా ఉందంటే..
విశాల్ చతుర్వేది రాసిన ఒక పుస్తకం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. అయితే టైటిల్ చూస్తే..ఇది పౌరాణిక కథ అనుకుంటారు. కానీ ఇది ఓ సాధారణ మనిషి తన జీవితంలో ఎదురైన బాధలు, మనసులో మెదిలిన ప్రశ్నలు అతడిని భక్తి మార్గం వైపు ఎలా నడిపించాయన్నదే ఈ చిత్రంలోని ప్రధానాంశం. భక్తి అంటే కేవలం పూజలు, ప్రార్థనలకే పరిమితమా? దేవుడిని ప్రేమించడం అంటే ఆరాధించడం మాత్రమేనా? లేక మన చుట్టూ ఉన్న మనుషులకు అండగా నిలబడి, వారికి సేవ చేయడంలోనూ దైవత్వాన్ని చూడాలా? అనే ప్రశ్నలను సినిమా తనదైన శైలిలో ఆవిష్కరిస్తుంది. అందుకే ఇది కేవలం ఆధ్యాత్మిక చిత్రంగా కాకుండా, మానవీయ విలువలను గుర్తుచేసే కథగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.
ఫస్టాఫ్ మొత్తం లక్ష్మీనారాయణ్ శర్మ ఆధ్యాత్మిక ప్రయాణం చుట్టూ సాగుతుంది. చిన్నప్పుడే తల్లిని కోల్పోవడం.. తండ్రి మరోకరి పెళ్లి చేసుకోవడంతో ఆ బాలుడి మనసు మారుతుంది. కన్నతల్లిని తిరిగి కలుసుకోవాలనే ఉద్దేశ్యంతో దేవుడి కోసం వెతకడం ప్రారంభిస్తుంది. ఈ క్రమంలో వచ్చే సన్నివేశాలు దైవభక్తి ఉన్నవారికి బాగా కనెక్ట్ అవుతాయి. వెనుకబడిన వర్గాల పిల్లలకు తన భోజనాన్ని పంచే సీన్ హృదయాలను హత్తుకుంటాయి. ఇలా ఫస్టాఫ్ మొత్తం దైవభావన కలిగించేలా సాగుతుంది. ఇక సెకండాఫ్‌లో ఎక్కువగా బాబా మహిమలనే చూపించారు.
రైలు నుంచి అతన్ని దింపేస్తే..రైలు ఆగిపోవడం.. జైలులో బందిస్తే..బయటకు రావడం.. రాళ్లను స్వీట్లుగా మార్చడం..ఇలాంటి కొన్ని వింతలు ఓ వర్గం ప్రేక్షకులను ఆకట్టుకుంటే..మరికొందరికి కాస్త అతిగా అనిపిస్తాయి. ఎమోషన్స్ కంటే ఎక్కువగా బాబా చూపిన మహిమల మీదనే ఎక్కువ దృష్టిపెట్టారు. నీమ్ కరోలీ బాబా గురించి నార్త్ వాళ్లకు బాగా తెలుసు కాబట్టి..వాళ్లు ఈ కథను ఓన్ చేసుకున్నారు. దక్షిణాది వారికి అంతగా పరిచయం లేదు..అందుకే ఈ కథతో పూర్తిగా కనెక్ట్ కాలేరు. అయితే దైవ భక్తి ఉన్నవారికి మాత్రం ఈ చిత్రం బాగా నచ్చుతుంది.
ఎవరెలా చేశారంటే..
ఈ చిత్రంలో నటించిన వారంతా కొత్తవాళ్లే. అందరూ బాగానే చేశారు. అయితే కథ మొత్తం నీమ్ కరోలీ బాబా పాత్ర చుట్టూనే తిరగడంతో ఆయన తప్ప మరోకరు గుర్తుకురారు. ఆ పాత్రలో శోభినవ్ సత్య జీవించేశాడు. తెరపై అచ్చం బాబాలాగే కనిపించాడు. డాక్టర్ రామ్ నందన్ పాత్రకి చందన్ కె ఆనంద్ న్యాయం చేశాడు. సాంకేతికంగా సినిమా బాగుంది. సాధు సుశీల్ తివారీ అందించిన సంగీతం సినిమాకు మరో ప్రధానబలం. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది.విశాల్ బావా సినిమాటోగ్రఫీ, శంఖ్ రాజ్యాధ్యక్ష ఎడిటింగ్ పర్వాలేదు. తెలుగు డబ్బింగ్ బాగా కుదిరింది. డైలాగ్స్ చాలా న్యాచురల్‌గా ఉన్నాయి. అయితే ఈ సినిమాకు బడ్జెట్ చాలా తక్కువ. సినిమా చూస్తే అది అర్థమైపోతుంది. విజువల్స్ అంత రిచ్‌గా ఉండవు.


