
ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కలిసి నటించిన తొలి చిత్రం ‘వార్ 2’. భారీ అంచనాల మధ్య నిన్న (ఆగస్ట్ 14) విడుదలైన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన లభించింది. అభిమానుల అంచనాలను అందుకోవడంలో ఈ సినిమా విఫలం అయింది. అయినప్పటికీ తొలి రోజు మాత్రం భారీ కలెక్షన్స్‌నే రాబట్టింది.
(చదవండి: వార్ 2 మూవీ రివ్యూ)
మొదటి రోజు ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ. 52.50 కోట్ల నెట్ కలెక్షన్స్ వసూళ్లు అయ్యాయి. వాటిలో హిందీ నుంచి అత్యధికంగా రూ. 29 కోట్లు వసూళ్లు చేసింది. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం రూ. 23.25 కోట్లు రాబట్టింది. జూనియర్ ఎన్టీఆర్‌కు ఉన్న భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ కారణంగానే ఇక్కడ ఈ స్థాయిలో వసూళ్లను రాబట్టింది. ఇక తమిళనాడులో అయితే అతి తక్కువగా కేవలం రూ. 25 లక్షలు మాత్రమే వసూలు చేయడం గమనార్హం. సూపర్ స్టార్ రజనీకాంత్ కూలీ సినిమా ఎఫెక్ట్ కారణంగానే తమిళ్‌లో వార్ 2 కలెక్షన్స్ భారీగా తగ్గిపోయాయి. గ్రాస్ కలెక్షన్స్ పరంగా చూస్తే వార్ 2 మొత్తంగా రూ. 85-90 కోట్లు మాత్రమే వసూలు చేసింది.
(చదవండి: ‘కూలీ’ మూవీ రివ్యూ)
ఇక ఇదే రోజు విడుదలైన కూలీ చిత్రంతో పోలిస్తే..వార్ 2 కలెక్షన్సే తక్కువ. కూలీ చిత్రానికి కూడా తొలిరోజే మిశ్రమ స్పందన వచ్చినా.. అత్యధికంగా రూ. 65 కోట్ల నెట్ కలెక్షన్స్‌ని రాబట్టింది. రెండు చిత్రాలు కలిసి తొలి రోజు తొలి రోజు రూ. 117.50 కోట్లు వసూలు చేశాయి. అయితే ఈ చిత్రాలకు ఉన్న బజ్‌తో పోలిస్తే ఇది తక్కువ అనే చెప్పాలి. రెండు చిత్రాలు భారీ అంచనాలతో రిలీజ్ అయ్యాయి.
కానీ ఆ అంచనాలను అందుకోవడంలో రెండూ విఫలం అయ్యాయి అని సినిమా చూసిన ప్రేక్షకులు అంటున్నారు. ఇక వరుసగా మూడు రోజులు సెలవులు ఉండడం ఈ సినిమాకు కలిసొచ్చే అంశం. టాక్‌తో సంబంధం లేకుండా ఈ మూడు రోజులు భారీగానే వసూళ్లు వచ్చే అవకాశం ఉందని సినీ పండితులు చెబుతున్నారు. మరి వీకెండ్‌లో ఈ రెండు చిత్రాల్లో ఏది అత్యధికంగా వసూళ్లు సాధిస్తుందో చూడాలి.