
గత కొన్నిరోజుల నుంచి సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా 'కూలీ' హడావుడే. సూపర్‌స్టార్ రజినీకాంత్, డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ కాంబో కావడం.. తొలిసారి కింగ్ నాగార్జున విలన్‌గా చేయడం.. దానికి తోడు అనిరుధ్ పాటలు వైరల్ కావడం.. ఇలా ఎక్కడలేని హైప్ అంతా ఈ మూవీపై ఏర్పడింది. అలా భారీ అంచనాలు ఏర్పరుచుకున్న ఈ చిత్రం ఎట్టకేలకు ఇప్పుడు థియేటర్లలోకి వచ్చేసింది. మరి అభిమానులు ఆశపడ్డట్లు రజినీకాంత్ హిట్ కొట్టారా? ఇంతకీ 'కూలీ' ఎలా ఉంది? రివ్యూలో చూద్దాం.

కథేంటి?
వైజాగ్ పోర్ట్‌లో కింగ్‌పిన్ లాజిస్టిక్స్ పేరుతో సైమన్ (నాగార్జున) పెద్ద డాన్‌గా చెలామణీ అవుతుంటాడు. ఖరీదైన వాచీలు, ఎలక్ట్రానిక్స్ లాంటివి విదేశాలకు ఎగుమతి చేస్తుంటారు. అయితే ఎక్స్‌పోర్ట్స్ ముసుగులో చేయకూడని పనేదో చేస్తుంటారు. సైమన్ అండర్‌లో దయాల్ (సౌబిన్ షాహిర్) ఇదంతా చూసుకుంటూ ఉంటాడు. వీళ్ల దగ్గర పనిచేసే రాజశేఖర్ (సత్యరాజ్) ఓ రోజు చనిపోతాడు. ఇతడికి దేవా (రజినీకాంత్) అనే ఫ్రెండ్ ఉంటాడు. కొన్ని కారణాల వల్ల దేవా-రాజశేఖర్.. 30 ఏళ్ల పాటు దూరంగా ఉంటారు. తన ప్రాణ స్నేహితుడు ఇక లేడనే విషయం తెలుసుకుని దేవా.. వైజాగ్ వస్తాడు. తర్వాత ఏమైంది? సైమన్-దేవాకి కనెక్షన్ ఏంటి? ఇంతకీ కలీషా (ఉపేంద్ర), ప్రీతి(శ్రుతి హాసన్), దాహా(ఆమిర్ ఖాన్) ఎవరు? అనేది మిగతా స్టోరీ.

ఎలా ఉందంటే?
కూలీ ట్రైలర్ రిలీజ్ కాగానే.. చాలామంది చాలారకాలుగా అంచనా వేశారు. ఇదేదో ట్రైమ్ ట్రావెల్, సైన్స్ ఫిక్షన్ అని మాట్లాడుకున్నారు. అలానే లోకేశ్ సినిమాటిక్ యూనివర్స్‌కి కనెక్షన్ కచ్చితంగా ఉంటుంది అని అనుకున్నారు. కానీ ఇది ఫక్తు రివేంజ్ కమర్షియల్ డ్రామా. ఎల్‌సీయూతో ఎలాంటి లింక్ లేదు. సింపుల్‌గా ఒక్క ముక్కలో చెప్పాలంటే తన ఫ్రెండ్‌ని ఎవరో చంపేస్తారు. ఆ విషయం తెలుసుకున్న హీరో.. ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడు? ఇంతకీ చంపింది ఎవరు అనేదే స్టోరీ.
వైజాగ్ పోర్ట్ ఏరియా, అక్కడ సైమన్ స్మగ్లింగ్ సామ్రాజ్యం, దాన్ని చూసుకునే దయాల్.. ఇలా కాస్త ఇంట్రెస్టింగ్‌గానే సినిమా మొదలైంది. కట్ చేస్తే దేవాగా రజినీకాంత్ ఎంట్రీ. వెంటనే ఓ పాట. కాసేపటికే తన ఫ్రెండ్ రాజశేఖర్ చనిపోయాడనే వార్త.. ఇది తెలిసి అతడి ఇంటికి దేవా వెళ్లడం, అక్కడేమో రాజశేఖర్ కూతురు ప్రీతి.. కాసేపటికి సైమన్ ఎంట్రీ.. అలా ఒక్కో పాత్ర పరిచయం చేస్తూ వెళ్లారు. తన ఫ్రెండ్‌ని చంపింది ఎవరో తెలుసుకునే క్రమంలో హీరో.. విలన్ గ్యాంగ్‌లో చేరడం, తాను వెతుకుతున్న హంతకుడు ఎవరో తెలియడం లాంటి అంశాలతో తొలి భాగం ముగుస్తుంది. దేవా మ్యాన్షన్‌లోనే హీరో చేసే ఓ ఫైట్ తప్పితే ఫస్టాప్ అంతా డ్రామానే ఉంటుంది. సాధారణంగా ఏ సినిమా అయినా సరే ఇంటర్వెల్‌లో ఫైట్ లాంటిది ఎక్స్‌పెక్ట్ చేస్తాం. కానీ ఇందులో కాస్త డిఫరెంట్.
తొలి సగంలో ఎక్కువగా డ్రామానే ఉంది కదా కనీసం సెకండాఫ్‌లో అయినా యాక్షన్ ఉంటుందా అనుకుంటే అక్కడ కూడా అదే డ్రామాని నడిపించారు. సినిమాలో స్టార్స్ ఎక్కువమంది అయ్యేసరికి ప్రతి ఒక్కరికీ న్యాయం చేయాలనే ప్రయత్నంలో సినిమా మొత్తం కలగాపులగం అయిపోయింది. దయాల్ పాత్రలో ట్విస్టులు బాగున్నాయి. సైమన్ దగ్గర పనిచేస్తూ, అతడి కొడుకుని ప్రేమించే అమ్మాయి క్యారెక్టర్ ఒకటి ఉంటుంది. ఆ పాత్రలో ట్విస్టులు కూడా బాగున్నాయి. మూవీలో యాక్షన్ కంటే డ్రామా ఎక్కువైపోవడంతో చాలా సాగదీతగా అనిపిస్తుంది. క్లైమాక్స్‌లో దాహా అనే పాత్రలో ఆమిర్ ఖాన్ ఎంట్రీ పెద్దగా ఇంపాక్ట్ చూపించిందా అంటే లేదు.

ఎవరెలా చేశారు?
రజినీకాంత్ ఎప్పటిలానే తన స్వాగ్, స్టైల్‌తో ఆకట్టుకున్నారు. విలనిజం చేసిన నాగార్జున.. కాస్త కొత్తగా కనిపించారు. ఆయన పాత్ర డిజైన్ బాగానే ఉంది గానీ ఏదో అసంతృప్తిగా అనిపించింది. సత్యరాజ్, ఉపేంద్ర ఉన్నారంటే ఉన్నారు అంతే. పెద్దగా స్కోప్ దొరకలేదు. శ్రుతి హాసన్ కూడా ఇచ్చినంతవరకు న్యాయం చేసింది. దయాల్‌గా చేసిన మలయాళ నటుడు సౌబిన్ షాహిర్.. మెస్మరైజ్ చేశాడు. కల్యాణిగా చేసిన కన్నడ నటి రక్షిత రామ్ కూడా చిన్న రోల్ అయినా బాగుంది. ఆమిర్ ఖాన్ పాత్ర కూడా తేలిపోయింది.
సినిమాలో కథ పరంగా పెద్దగా మెరుపులు, హై మూమెంట్స్ లేనప్పటికీ టెక్నికల్‌గా స్ట్రాంగ్‌గా ఉంది. రిచ్ విజువల్స్, స్టార్ వాల్యూ ఉన్నంతలో కాస్త రిలీఫ్. అనిరుధ్ గురించి చెప్పుకోవాలి. చాలా సాధారణమైన సన్నివేశాల్ని కూడా తన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్‌తో ఎలివేట్ చేశాడు. కొన్నిచోట్ల బాగానే వర్కౌట్ అయ్యాయి. సినిమా అంతా చూసిన తర్వాత ఇది తీసింది లోకేశ్ కనగరాజేనా అనే సందేహం వస్తుంది. ఎందుకంటే ప్రేక్షకులు చాలానే ఎక్స్‌పెక్ట్ చేశారు. కానీ ఆ అంచనాల్ని అందుకోవడం ఆమాడ దూరంలో ఆగిపోయాడు. నిర్మాణ విలువలు టాప్ నాచ్ ఉన్నాయి కానీ కథలో బలం లేకపోతే ఏం లాభం. ఓవరాల్‌గా చెప్పుకుంటే సోషల్ మీడియాలో ఉన్న హైప్‌కి.. 'కూలీ' సినిమాలో స్టోరీకి ఏ మాత్రం సంబంధం లేదు.
- చందు డొంకాన
