‘‘నాకు ఎలిజబెత్ లాంటి మంచి బహుమతి ఇచ్చినందుకు నీకు (గీతు మోహన్‌దాస్‌ని ఉద్దేశించి) ధన్యవాదాలు. ‘టాక్సిక్’లో ఎవరూ ఊహించని అంశాన్ని వెండితెరపై చూపించాలన్న నీ ఆలోచనకు ఆశ్చర్యపోయాను’’ అని హూమా ఖురేషి పేర్కొన్నారు. యశ్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘టాక్సిక్: ఎ ఫెయిరీటేల్ ఫర్ గ్రోన్ అప్స్’. గీతు మోహన్‌దాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ఎలిజబెత్‌పాత్రలో నటిస్తున్నారు హూమా ఖురేషి.
ఆమె ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా గీతు మోహన్‌దాస్ మాట్లాడుతూ – ‘‘ఎలిజబెత్‌పాత్రకు ఓ డిఫరెంట్ లుక్, బలమైన స్క్రీన్ ప్రెజెన్స్ ఉండాలి. అలాగే నటనా సామర్థ్యం కూడా మెండుగా ఉండాలి. హూమా ఖురేషి అయితే కరెక్ట్ అనిపించి, ఆమెను తీసుకున్నాం. హూమా ఓ టాలెంటెడ్ పవర్ హౌస్’’ అని పేర్కొన్నారు. యశ్, గీతు మోహన్ దాస్ కలిసి ఈ ‘టాక్సిక్’ కథ రాశారు. వెంకట్ కె. నారాయణ, యశ్ నిర్మిస్తున్న ఈ చిత్రం 2026 మార్చి 19న విడుదల కానుంది. కన్నడంతోపాటు ఈ సినిమాను తెలుగు, తమిళ, మలయాళ, హిందీ సహా మరికొన్ని భాషల్లో అనువదించి, రిలీజ్ చేయనున్నారు.


