
టైటిల్ : వార్ 2
నటీనటులు: హృతిక్ రోషన్, ఎన్టీఆర్, అనిల్ కపూర్, కియారా అద్వానీ, అశుతోష్ రాణా తదితరులు
నిర్మాణ సంస్థ: యశ్‌రాజ్ ఫిల్మ్స్
నిర్మాత : ఆదిత్యా చోప్రా
దర్శకత్వం: అయాన్ ముఖర్జీ
సంగీతం: ప్రీతమ్(పాటలు), సంచిత్ బల్హారా, అంకిత్ బల్హారా(బ్యాక్‌గ్రౌండ్ స్కోర్)
సినిమాటోగ్రఫీ: బెంజమిన్ జాస్పర్
విడుదల తేది: ఆగస్ట్ 14, 2025
బాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ యశ్‌రాజ్ ఫిలింస్ నుంచి వచ్చిన తాజా స్పై యాక్షన్ ఫిలిం వార్ 2. జూనియర్ ఎన్టీఆర్ నటించిన తొలి బాలీవుడ్ చిత్రం కావడంతో టాలీవుడ్‌లో కూడా ఈ మూవీపై భారీ హైప్ క్రియేట్ అయింది. దానికి తోడు ఇటీవల విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలను మరింత పెంచేసింది. మరి ఆ అంచనాలను వార్ 2 అందుకుందా లేదా? రివ్యూలో చూద్దాం.
వార్ 2 కథేంటంటే..
కలి.. ఓ అజ్ఞాత శక్తి. ఎవరికి కనిపించడు కానీ, ప్రపంచ దేశాలను వణికిస్తాడు. ఈసారి అతని చూపు భారత్‌పై పడుతుంది. భారత్‌ని తన చెప్పు చేతల్లో పెట్టుకోవాలనుకుంటాడు. అందుకు ‘ రా’ మాజీ ఏజెంట్ కబీర్ (హృతిక్ రోషన్)ని పావుగా వాడతాడు. కలి టీమ్‌లో చేరాలంటే.. తన గాడ్ ఫాదర్ లాంటి వ్యక్తి, కల్నల్ సునీల్ లూథ్రా(అశుతోష్ రాణా)ని చంపాలని కబీర్‌కు టాస్క్ ఇస్తాడు. సునీల్ లూథ్రాని కబీర్ చంపేస్తాడు. దీతో ‘రా’ కబీర్‌ని వెంటాడుతుంది. అతడిని పట్టుకోవడానికి ‘రా’ చీఫ్ (అనిల్ కపూర్) ఓ స్పెషల్ టీమ్‌ని నియమిస్తాడు. కేంద్రమంత్రి విలాస్ రావు సారంగ్ సూచనతో స్పెషల్ టీమ్‌కి మేజర్ విక్రమ్ చలపతి(ఎన్టీఆర్)ని లీడర్‌గా నియమిస్తాడు. తన తండ్రి సునీల్ లూథ్రాని చంపిన కబీర్‌పై పగ పెంచుకున్న వింగ్ కమాండర్ కావ్య లూథ్రా (కియారా అద్వానీ) కూడా విక్రమ్ టీమ్‌లో చేరుతుంది. విక్రమ్ టీమ్ కబీర్‌ని పట్టుకుందా? లేదా? అసలు కబీర్ దేశద్రోహిగా ఎందుకు మారాడు? అతని లక్ష్యం ఏంటి? విక్రమ్‌కి, కబీర్‌కి మధ్య ఉన్న సంబంధం ఏంటి? అజ్ఞాతంలో ఉన్న కలి ఎవరు? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఎలా ఉందంటే..
స్పై యాక్షన్ థ్రిల్లర్ అనగానే కళ్లు చెదిరే యాక్షన్ విన్యాసాలు, ఊహించని ట్విస్టులు లాంటివి గుర్తుకొస్తాయి. ప్రేక్షకుడు కూడా వాటిని దృష్టిలో పెట్టుకొనే థియేటర్స్‌కి వస్తాడు. వార్ 2లో ఆ రెండూ ఉన్నాయి. కానీ ఇప్పటికే ఆ తరహా యాక్షన్ సీన్లు, ట్విస్టులు చూసి ఉండడంతో ఈ సినిమా చూస్తున్నంతసేపు ‘కొత్తగా ఏమీ లేదే’ అనిపిస్తుంది. కథ, కథనాలే పెద్దగా ఆసక్తి రేకెత్తించవు. దర్శకుడు ట్విస్టులు అనుకొని రాసుకున్న సీన్లు కూడా ఈజీగా ఊహించొచ్చు. విజువల్స్ పరంగానూ సినిమా ఆకట్టుకునేలా లేదు. ఒకటి రెండు యాక్షన్ సీన్లు మినహా మిగతావన్నీ రొటీన్‌గానే ఉంటాయి. ఎమోషనల్ సన్నివేశాలు మాత్రం కొంతమేర ఆకట్టుకుంటాయి.
ఓ భారీ యాక్షన్ సీన్‌తో కథ ప్రారంభం అవుతుంది. కలి గ్యాంగ్.. హృతిక్‌కి ఒక టాస్క్ ఇవ్వడం.. అందులో భాగంగా కల్నల్ సునీల్ లూథ్రాని చంపేయడం.. అతన్ని పట్టుకునేందుకు ‘రా’ రంగంలోకి దిగడం అంతా రొటీన్‌గానే సాగుతుంది. ఇక మేజర్ విక్రమ్‌గా ఎన్టీఆర్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత కథనంపై ఆసక్తి పెరుగుతంది. భారీ ఎలివేషన్‌తో ఎన్టీఆర్ ఎంట్రీ ఉంటుంది. కబీర్‌ని పట్టుకునే క్రమంలో వచ్చే కార్ ఛేజింగ్ సీన్, మెట్రో ట్రైన్‌పై వచ్చే యాక్షన్ సీన్లు ఆకట్టుకుంటాయి.
ఇంటర్వెల్‌కు ముందు విమానంపై వచ్చే యాక్షన్ సీన్ సినిమాకే హైలెట్. స్పై యాక్షన్ సినిమాలను చూసిన వారికి ఇంటర్వెల్ ట్విస్ట్ ఈజీగా ఊహించొచ్చు. సెకండాఫ్ ప్రారంభంలో హృతిక్, ఎన్టీఆర్‌పై వచ్చే ఫ్లాష్‌బ్యాక్ స్టోరీ ఆకట్టుకుంటుంది. కావ్య లూథ్రాకి అసలు నిజం తెలిసిన తర్వాత కథనం పరుగులు పెడుతుంది. ఈ క్రమంలో వచ్చే ట్విస్టులు ఆకట్టుకుంటాయి. చివరిలో హృతిక్, ఎన్టీఆర్ మధ్య వచ్చే యాక్షన్ సీన్ అదిరిపోతుంది.
ఎవరెలా చేశారంటే..
ఎన్టీఆర్, హృతిక్ రోషన్..ఇద్దరూ గొప్ప నటులే. ఎలాంటి పాత్రల్లో అయినా ఒదిగిపోతారు. హృతిక్‌కు ఆల్రేడీ స్పై యాక్షన్ సినిమాలు చేసిన అనుభవం ఉంది కాబట్టి కబీర్ పాత్రలో అవలీలగా నటించాడు. యాక్షన్ సీన్లు అదరగొట్టేశాడు. ఎన్టీఆర్‌కి ఇది తొలి స్పై యాక్షన్ మూవీ. మేజర్ విక్రమ్‌గా అద్భుతంగా నటించాడు. యాక్షన్, డ్యాన్స్ విషయంలో హృతిక్‌తో పోటీ పడి యాక్ట్ చేశాడు. సినిమాలో ఎన్టీఆర్ పాత్రకే భారీ ఎలివేషన్, ట్విస్టులు ఉంటాయి. దాదాపు 80 శాతం కథ ఎన్టీఆర్, హృతిక్‌ల చుట్టే తిరుగుతుంది. ఇక కల్నల్ సునీల్ లూథ్రాగా అశుతోష్ రాణా తెరపై కనిపించేది కాసేపే అయినా.. తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. వింగ్ కమాండర్ కావ్య పాత్రకి కియరా అద్వానీ న్యాయం చేసింది. అయితే ఆమె పాత్రకి స్క్రీన్‌స్పేస్ చాలా తక్కువ అనే చెప్పాలి. హృతిక్‌తో వచ్చే యాక్షన్ సీన్‌లో కియారా అదరగొట్టేసింది. అనిల్ కపూర్‌తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు.
సాంకేతికంగా సినిమా పర్వాలేదు. ప్రీతమ్ పాటలు ఓకే. సంచిత్ బల్హారా, అంకిత్ బల్హారా నేపథ్య సంగీతం సినిమాకు అదనపు బలం. సినిమాటోగ్రఫీ బాగుంది. యాక్షన్ సన్నివేశాలు ఒకటి, రెండు బాగున్నాయి. ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి.
- అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్
