
చిన్నప్పుడు పాతిక పైనే సినిమాలు చేశాడు చైల్డ్ ఆర్టిస్ట్ రవి రాథోడ్ (Ravi Rathod). అయితే అందరికీ విక్రమార్కుడు యాక్టర్‌గానే ఎక్కువ గుర్తుండిపోయాడు. ఇతడిని హీరో, కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్ చిన్న వయసులోనే దత్తత తీసుకుని మంచి స్కూల్‌లో చేర్పించాడు. కానీ చదువు అబ్బని రాథోడ్ సెలవులకు ఊరెళ్లి అక్కడే ఉండిపోయాడు. తిరిగి స్కూలుకు వెళ్లనేలేదు. తర్వాతి కాలంలో చిన్నాచితకా పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు.
తాగుడుకు బానిస
మద్యానికి బానిసై.. మందు లేకపోతే బతకలేను అన్నంత దుస్థితికి చేరుకున్నాడు. ఈ విషయాన్ని తనే స్వయంగా ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టాడు. పోనీ, చిన్నప్పుడు చదువు చెప్పించాలని తాపత్రయపడ్డ లారెన్స్‌ను మళ్లీ కలవలేకపోయావా? అంటే.. భయంగా ఉందని గుటకలు మింగాడు. స్కూలు నుంచి ఎందుకు పారిపోయావని తిడతాడేమో.. కొడతాడేమోనని వెనకడుగు వేసినట్లు తెలిపాడు. ఎలాగోలా ఈ విషయం లారెన్స్‌కు తెలిసింది. నిన్ను తిట్టను, కొట్టను.. ఒక్కసారి వచ్చి కలువురా అని ఎక్స్ (ట్విటర్)లో పోస్ట్ పెట్టాడు.
రూ.50 వేల ఆర్థిక సాయం
దీంతో ధైర్యం తెచ్చుకుని రవి రాథోడ్ ఎన్నో ఏండ్ల తర్వాత చెన్నైలో ఉన్న లారెన్స్ (Raghava Lawrence) ముందుకు వెళ్లాడు. అతడి పరిస్థితి చూసి చలించిపోయిన లారెన్స్ రూ.50 వేలు ఆర్థిక సాయం చేశాడు. లారెన్స్ ఇంకా ఏమన్నాడు? అనే విషయాలను తాజాగా ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నాడు రవి రాథోడ్. అతడు మాట్లాడుతూ.. ఆల్కహాల్ అడిక్షన్ తగ్గేందుకు నాకు అన్ని టెస్టులు చేయించారు. మెడిసిన్స్ ఇచ్చారు. అయితే మాస్టర్ ఫస్ట్ నన్ను చూడగానే ఓ మాటన్నారు.
ఆ డబ్బుతోనే ఫోన్ కొనుక్కున్నా
తాగేవాళ్లకు నేను సపోర్ట్ చేయను. ఏదో నువ్వు నాకు చిన్నప్పటి నుంచి తెలుసని సపోర్ట్ చేస్తున్నానంతే! అన్నారు. నన్ను చెన్నైలోనే ఉండమన్నారు. కానీ, నాతో పాటు ఫ్రెండ్స్ వచ్చారని హైదరాబాద్‌కు వచ్చేశాను. మాస్టర్ డబ్బు సాయం కూడా చేశారు. ఆ డబ్బుతోనే మొబైల్ ఫోన్ కొనుక్కున్నాను. చెన్నై నుంచి వచ్చాక నేను తాగుడు మానేశాను. మెడిసిన్ వాడినప్పుడు మందు తాగితే చనిపోయే ప్రమాదం ఉందని డాక్టర్ హెచ్చరించాడు. అందుకే దాని జోలికి వెళ్లడం లేదు.
జీవితంలో దాని జోలికి వెళ్లనని ఒట్టు
కాకపోతే నా కాలి నొప్పి ఇంకా సెట్టవలేదు. ఏదైనా సపోర్ట్ ఉంటే నడవగలుగుతున్నా అని చెప్పుకొచ్చాడు. రవి రాథోడ్ వెంట చెన్నై వెళ్లిన స్నేహితుడు మాట్లాడుతూ.. రాథోడ్‌కు టెస్టులు చేస్తే కిడ్నీలో రాళ్లున్నాయని చెప్పారు. దానివల్ల కాళ్లపై ఎఫెక్ట్ పడి సరిగా నడవలేకపోతున్నాడు. అయితే జీవితంలో మళ్లీ తాగనని లారెన్స్ అన్నకు మాటిచ్చాడు అని తెలిపాడు. మరి రాథోడ్.. ఆ మాటపై నిలబడి కొత్త జీవితం ప్రారంభిస్తాడేమో చూడాలి!
చదవండి: ఫ్రెండ్స్‌తో బండ్ల గణేశ్.. ఆయన పొద్దున్నే కదా చనిపోయారు, అంతలోనే..