ప్రయోగాత్మక చిత్రాలకు కేరాఫ్ అడ్రస్.. దర్శకుడు చేరన్ (Cheran). ఈయన దర్శకత్వం వహించిన ప్రతి చిత్రం ప్రజలకు ఏదో ఒక విషయాన్ని చెబుతుంది. అలా ఆయన దర్శకత్వం వహించిన ఆణిముత్యాల్లో ఆటోగ్రాఫ్ (Autograph Movie) అనే తమిళ చిత్రం ఒకటి. చేరన్ స్వీయ దర్శకత్వంలో నిర్మించి, కథానాయకుడిగా నటించిన ఈ చిత్రం విడుదలై 21 ఏళ్లు అయ్యింది. ఇప్పటికీ ఇందులోని పాటలు చాలాచోట్ల వినిపిస్తూనే ఉంటాయి.
ఆ పని చసుంటే ఎదిగేవాడ్ని..
అలాంటి చిత్రం మళ్లీ డిజిటల్ ఫార్మెట్‌లో కొత్త హంగులతో నవంబర్ 14న విడుదల కానుంది. గురువారం సాయంత్రం చైన్నెలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చేరన్‌తో పనిచేసిన నటీనటులు, సాంకేతిక వర్గం, ఇతర మిత్ర వర్గం పాల్గొని తమ అనుబంధాలను గుర్తు చేసుకున్నారు. దర్శకుడు అమీర్, ఆరి ముఖ్యఅతిథులుగా పాల్గొన్నారు. చేరన్ మాట్లాడుతూ.. తాను మంచి కమర్షియల్ చిత్రాలు చేసుంటే ఆర్థికంగా ఎదిగి ఉండేవాడినేమో.. కానీ, ఆ తరువాత కనిపించకుండా పోయేవాడినేమోనని అన్నారు.
15 నిమిషాలు కట్ చేశాం
ఈ ఆటోగ్రాఫ్ చిత్ర నిడివిని 15 నిమిషాలు తగ్గించినట్లు చెప్పారు. డాల్బీ అట్మాస్ వంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని చేర్చామని చెప్పారు. ఈ చిత్రాన్ని ఇప్పుడు విడుదల చేసి తాను సాధించేదేమీ లేదన్నారు. అయితే నేటి తరం ఎలా ఉందన్నది తెలుసు.. కాబట్టి ఇప్పుడు వారు ఈ చిత్రాన్ని చూస్తే వేరే ఆలోచన కలగవచ్చన్నారు. తాము విత్తనం మాత్రమే నాటగలమని, ఆటోగ్రాఫ్ చిత్రానికి ఆ అర్హత ఉందని భావించి మళ్లీ విడుదల చేస్తున్నట్లు చెప్పారు.


