భక్తిభావంతో పాటూ సేవాభావం ఉండాలి
వేలూరు: దైవ శ్లోకాలు చెప్పే స్థలంలో మంచి శక్తి వస్తుందని శ్రీపురం బంగారుగుడి పీఠాధిపతి శక్తిఅమ్మ అన్నారు. ఆయన 50వ జన్మదినోత్సవం సందర్భంగా 10,008 నిరుపేద మహిళలకు చీరలు పంపిణీ, వివిధ సంక్షేమ పథకాల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈసందర్భంగా శక్తిఅమ్మ మాట్లాడుతూ మంత్రాలు చెప్పడానికి, సాధారణ మాటలు చెప్పడానికి అనేక తేడాలు ఉంటున్నాయన్నారు. ఒక సాధారణ మాట చెప్పే సమయంలో వాటిని ఒక శబ్ధం బయటకు వస్తుందని శ్లోకం చెప్పే సమయంలో అందులో నుంచి ఒక శక్తి వస్తుందన్నారు. ఈ శక్తి రావడం వల్ల మనకు మంచి ఆరోగ్యం, మనస్సు సంతోషం, మనశ్శాంతికి ఎటువంటి హానికరం కాకుండా దైవశక్తి మనల్ని కాపాడుతుందన్నారు. అదేవిధంగా చెడు శక్తుల నుంచి ఆ శక్తి మనల్ని కాపాడుతుందన్నారు. ప్రతిఒక్కరూ దైవభక్తితో పాటు ఇతరులకు సేవ చేయాలనే మనస్సుతో జీవిత ప్రయాణం చేయాలన్నారు. ప్రస్తుతం నారాయణి పీఠం బంగారుగుడిలో ఇంత మంది నిరుపేద మహిళలకు చీరలతో పాటు సంక్షేమ పథకాలు అందజేయడంలో ఎంతో సంతోషం ఉందన్నారు. కలవై సచ్చిదానం స్వామీజీ, బంగారుగుడి డైరెక్టర్ సురేష్‌బాబు, నారాయణి ఆస్పత్రి డైరెక్టర్ బాలాజి, బంగారుగుడి మేనేజర్ సంపత్, ట్రస్టీ సౌందర్‌రాజన్, విశాలకు చెందిన శక్తిఅమ్మ భక్తులు పాల్గొన్నారు.


