ఆయన చిత్రాలే మాకు మంచి గుర్తింపు
తమిళసినిమా: ఇంతకుముందు విజయ్ కథానాయకుడిగా నటించిన మాస్టర్, లియో చిత్రాలే తమ సంస్థకు గుర్తింపు అని సెవెన్ స్క్రీన్ స్టూడియో అధినేత ఎస్ ఎస్.లలిత్‌కుమార్ అన్నారు. ఇంతకు ముందు పలు విజయవంతమైన చిత్రాలను నిర్మించిన ఈయన తాజాగా నిర్వహించిన చిత్రం సిరై. విక్రమ్‌ప్రభు కథానాయకుడిగా నటించిన ఈ చిత్రం ద్వారా మరో కథానాయకుడిగా నిర్మాత ఎస్ ఎస్.లలిత్‌కుమార్ వారసుడు అక్షయ్‌కుమార్ నటించారు. అనిష్మా నాయకిగా నటించిన ఈ చిత్రానికి ఠాణాక్కారన్ చిత్రం ఫేమ్ తమిళ్ కథను అందించారు. ఈచిత్రం ద్వారా దర్శకుడిగా వెట్రిమారన్ శిష్యుడు సురేష్ రాజకుమారి దర్శకుడిగా పరిచయమయ్యారు. జస్టిన్ ప్రభాకరన్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రం ఈనెల 25న తెరపైకి రానుంది. సోమవారం చైన్నెలోని ఓ నక్షత్ర హోటల్లో ప్రీ రిలీజ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. దర్శకుడు ఆర్కే.సెల్వమణి, పా.రంజిత్, టి.శివ, సురేష్‌కామాక్షి, ఎస్‌ఏ.చంద్రశేఖర్, తిరుప్పూర్ సుబ్రమణ్యం పాల్గొని యూనిట్ సభ్యులకు శుభాకాంక్షలు అందించారు. ఎస్‌ఎస్.లలిత్‌కుమార్ మాట్లాడుతూ ఈ కథలో తన కుమారుడిని నటింపజేయవచ్చా అని దర్శకుడిని అడిగానన్నారు. అందుకు ఆయన మీరే ఆలోచించండి అని చెప్పారన్నారు. తనకు వెట్రిమారన్ చిత్రాలంటే ఇష్టం అని ఇలాంటి కథా చిత్రంలోనే తన కుమారుడు నటించాలని భావించానన్నారు. సిరై చిత్రానికి తమిళ్ దర్శకత్వం వహించలేని పరిస్థితిలో వెట్రిమారన్ శిష్యుడు సురేష్ రాజకుమారిని దర్శకుడిగా ఎంపిక చేసినట్లు చెప్పారు. తమ సంస్థకు గుర్తింపు తెచ్చిపెట్టింది విజయ్ హీరోగా నిర్మించిన మాస్టర్, లియో చిత్రాలని, ఈ విషయాన్ని తాను ఎప్పటికీ మర్చిపోలేను అని అన్నారు.


