కథే చిత్ర విజయానికి బలం
తమిళసినిమా: గ్లోబల్ పిక్చర్స్ పతాకంపై అళగరాజ్ జయబాలన్ నిర్మించిన చిత్రం పల్స్. నవీన్ గణేష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మాస్టర్ మహేంద్రన్ కథానాయకుడిగా నటించారు. కూల్ సురేష్, అర్చన, కేపీవై శరత్ ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రానికి అభిషేక్. ఏఆర్ సంగీతాన్ని అందించారు. నిర్మాణ కార్యక్రమాలను పూర్తిచేసుకుని ఈచిత్రం త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా చిత్ర టీజర్, ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని సోమవారం సాయంత్రం చైన్నెలోని భరణి స్టూడియోలో నిర్వహించారు. కార్యక్రమంలో సీనియర్ నటుడు, నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ సంఘం అధ్యక్షుడు కె.రాజన్ పాల్గొని చిత్ర ఆడియోను ఆవిష్కరించారు. నూతన దర్శకుడైన తనకు అవకాశం ఇవ్వడంతో పాటు కథపై నమ్మకంతో పూర్తి స్వేచ్ఛను కల్పించిన నిర్మాత అళగరాజ్ జయబాలన్ కు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నట్లు దర్శకుడు పేర్కొన్నారు. చిత్ర హీరో మాస్టర్ మహేంద్రన్ మాట్లాడుతూ దర్శకుడు నవీన్ గణేష్ తనకు చిరకాల మిత్రుడని చెప్పారు. ఆయన ఈ చిత్రం కథను చెప్పినపుడు నటుడిగా కాకుండా మిత్రుడిగా విన్నానని, ఆ తరువాత తనకే ఆసక్తి కలిగి ఈ చిత్రంలోకి వచ్చేలా చేసిందని అన్నారు. కె.రాజన్ మాట్లాడుతూ ఇప్పుడు స్టార్స్‌తో చిత్రాలు చేసే పరిస్థితి లేదన్నారు. కాగా కథను మాత్రమే నమ్మి పల్స్ చిత్రాన్ని నిర్మించిన నిర్మాత ధైర్యాన్ని మెచ్చుకోవాలి అన్నారు. చిత్ర విజయానికి కథా బలమే ముఖ్యం అన్నారు. ఆస్పత్రి నేపథ్యంలో సాగే ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించాలని ఆకాంక్షిస్తున్నట్లు పేర్కొన్నారు.


