కార్మిక సంఘాల రాస్తారోకో
వేలూరు: దేశవ్యాప్తంగా ఉన్న కార్మికుల చట్టాలను కాల రాస్తున్న కేంద్ర ప్రభుత్వాన్ని ఖండిస్తూ వేలూరులోని ప్రధాన పోస్టల్ కార్యాలయం ఎదుట వివిధ కార్మిక సంఘాలు సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. కార్మిక నాయకులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పెట్టుబడిదారులకు మద్దతుగా, కార్మికులకు వ్యతిరేకంగా చట్టాలను తీసుకు రావడం సరికాదన్నారు. విద్యుత్ శాఖలో కాంట్రాక్టు కార్మికులను పర్మనెంట్ చేయాలని, పారంపర్య కార్మికులకు రక్షణ కల్పించడంతో పాటూ ఇన్సురెన్స్ ప థకాన్ని వర్తింప జేయాలని, ఆటో, ట్యాక్సీ ఎఫ్‌సీ రుసుమును తగ్గించాలని, అంగన్‌వాడీ, ఆశ కార్మికులను పర్మనెంట్ చేసి నెలకు కనీస వేతనం రూ.26 వేలు వేతనం ఇవ్వాలని నినాదాలు చేశారు. అనంతరం కార్మికులు ఒక్కసారిగా రోడ్డుకు అడ్డంగా కూర్చొని రాస్తారోకో చేస్తూ నినాదాలు చేశారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకోవడంతో కార్మికులు, పోలీసుల మద్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో పోలీసులు కార్మికులను అరెస్ట్ చేసేందుకు యత్నించడంతో అనంతరం చర్చలు జరిపి రాస్తారోకోను విరమింప జేసి పంపించి వేశారు.
కార్మిక వ్యతిరేక చట్టాలను ఉపసంహరించుకోవాలి
– చైన్నెలో సీఐటీయూ నాయకుల నిరసన
కొరుక్కుపేట: కమ్యూనిస్ట్ పార్టీ ట్రేడ్ యూనియన్ సీఐటీయూ తమిళనాడు అంతటా నిరసన చేపట్టారు. కార్మిక వ్యతిరేక చట్టాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ ఈ నిరసన మంగళవారం చైన్నెలో జరిగింది. అన్నాసాలై పోస్టాఫీసు ముందు, సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సౌందరరాజన్ నిరసనకు నాయకత్వం వహించి కేంద్ర ప్రభుత్వాన్ని ఖండిస్తూ 200 మందికి పైగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో అన్నా సాలైలో కొంతసేపు ట్రాఫిక్ స్తంభించింది. రోడ్డుపై కూర్చుని నిరసన తెలుపుతున్న కార్మికులను పోలీసులు అరెస్టు చేశారు. అదేవిధంగా, గిండిలోని పోస్టాఫీసు ముందు సీఐటీయూ ప్రధాన కార్యదర్శి కన్నన్ నేతృత్వంలో నిరసన నిర్వహించారు. మహిళలతో సహా 500 మంది ఈ ధర్నాలో పాల్గొన్నారు. ఈ నిరసనతో ఆ ప్రాంతంలో ట్రాఫిక్‌కు కొంతసేపు అంతరాయం కలిగింది. ఆందోళన కారులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటనకు సంబంధించి 2 చోట్ల పోలీసులను మోహరించారు. వ్యాసార్పడి జిల్లా సెక్రటేరియట్ కుప్పుసామి నాయకత్వంలో సీఐటీయూ ట్రేడ్ యూనియన్ మింట్ బస్టాండ్ దగ్గర నిరసన వ్యక్తం చేయడంతో అకస్మాత్తుగా ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. నిరసనలో పాల్గొన్న 110 మంది ఆందోలనకారులను పోలీసులు అరెస్టు చేశారు. వారందరినీ తాండియార్‌పేటలోని ఓ ప్రైవేట్ వివాహ మండపానికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.


