తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి అధ్యక్షుడు సి. కల్యాణ్
లక్డీకాపూల్: చిన్న నిర్మాతల సమస్యలపై ప్రత్యేక కార్యాచరణ రూపొందించి, త్వరలో ప్రకటిస్తామని తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ (టీఎఫ్‌పీసీ) అధ్యక్షుడు సి. కల్యాణ్ వెల్లడించారు. చిన్న నిర్మాతలు తమ సినిమాలను విడుదల చేసేందుకు అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల్లో దాదాపు 95 శాతం మంది నిర్మాతలు మద్దతు ఇవ్వడం తమపై ఉన్న నమ్మకానికి నిదర్శనమన్నారు. నిర్మాతల సంక్షేమమే తమ లక్ష్యం అని, వారికి లోటు రాకుండా చూసుకుంటామని హామీ ఇచ్చారు.
నిర్మాతలందరూ ఒకే తాటిపై నడవాలని పిలుపునిచ్చారు. గత రెండున్నరేళ్లుగా అందరూ కలిసి ముందుకు రాలేకపోయారని, ఇకపై కలిసి పని చేయాలని సి. కల్యాణ్ అన్నారు. ఆదివారం జరిగిన తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి ఎన్నికలలో మొత్తం 1,168 ఓట్లకు గాను 643 మంది సభ్యులు ఓటు హక్కును వినియోగించుకున్నారు.
సి. కల్యాణ్ అధ్యక్షుడిగా, ఉపాధ్యక్షులుగా మోహన్ వడ్లపట్ల, కేఎల్ దామోదర్ ప్రసాద్, కోశాధికారిగా చదలవాడ శ్రీనివాసరావు, జాయింట్ సెక్రటరీలుగా అమ్మిరాజు కానుమిల్లి, టి. రామసత్యనారాయణ గెలుపొందారు. ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులుగా పద్మిని నాగులపల్లి, రవిశంకర్ యలమంచిలి, సునీల్ నారంగ్, మోహన్ గౌడ్, కృష్ణప్రసాద్ శివలెంక, డీవీవీ దానయ్య, వంశీ నందిపాటి, పల్లి కేశవరావు, డీఎస్ శ్రీనివాసరావు, శ్రీనివాసరావు వజ్జా, జె. పుల్లారావు, బాపిరాజు బల్లిపాడు, రామకృష్ణ గౌడ్, నయీమ్ అహ్మద్ ఎస్.కె., కె. నిరంజన్ రెడ్డి ఎన్నికయ్యారు.


