తెలుగు సినిమాల్లో సహాయ నటుడు, హీరోగా గుర్తింపు తెచ్చుకున్న కృష్ణుడు.. 'బిగ్‌బాస్' హౌస్‌లో 13వ కంటెస్టెంట్‌గా అడుగుపెట్టేశాడు. ఇతడి అసలు పేరు అల్లూరి కృష్ణంరాజు. ఆంధ్రాలోని తూర్పుగోదావరి జిల్లా రాజోలు తాలూకాలోని చింతలపల్లి గ్రామంలో ఓ జమీందారీ కుటుంబంలో పుట్టాడు. ఈయన ముత్తాత అల్లూరి వరాహ వెంకట సూర్యనారాయణ రాజు చిన్నచింతనడ జమీందార్‌గా ఉండేవారు. 1970లో ఇందిరా గాంధీ ప్రవేశపెట్టిన ల్యాండ్ సీలింగ్ యాక్ట్ వల్ల వీరి ఫ్యామిలీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అత్యధికంగా సుమారు 4500 ఎకరాల భూమిని కోల్పోయింది!
వ్యక్తిగత విషయాలకొస్తే కృష్ణుడు.. బెంగళూరులో ఆటోమొబైల్ ఇంజనీరింగ్‌లో డిప్లొమా చేశాడు. కానీ సినిమాలపై పిచ్చితో హైదరాబాద్ వచ్చి ఫొటోగ్రఫీ స్టూడియో నడపుతూ, అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశాడు. హ్యాపీ డేస్, పోకిరి, షాక్, వాన, యువత, ఓయ్ తదితర సినిమాల్లో కామెడీ పాత్రలు చేసి చాలా గుర్తింపు తెచ్చుకున్నాడు. 2008లో వచ్చిన వినాయకుడు మూవీతో హీరోగానూ చేసి హిట్ అందుకున్నాడు. అనంతరం విలేజ్‌లో వినాయకుడు, స్నేహగీతం, పప్పు లాంటి చిత్రాల్లోనూ హీరోగా చేశాడు. ఆర్య 2, ఏ మాయ చేశావే, మిస్టర్ పెర్‌ఫెక్ట్, ఎటో వెళ్లిపోయింది మనసు, మనం, గోపాల గోపాల తదితర సినిమాల్లో సహాయ పాత్రలు చేశాడు.
కుర్ర వయసులో ఉన్నప్పుడు కృష్ణుడు మనందరిలానే ఉండేవాడు. కానీ ఓసారి కాలికి గాయం కావడంతో రెండేళ్ల పాటు మంచానికే పరిమితమైపోయాడు. దీంతో బరువు బాగా పెరిగిపోయాడు. కానీ అదే రూపం ఇతడికి నటుడిగా అవకాశాలు తీసుకొచ్చింది. గత కొన్నేళ్లుగా సినిమాల్లో పెద్దగా కనిపించని ఇతడు ఇప్పుడు బిగ్‌బాస్ షోలో అడుగుపెట్టాడు. మరి ఇందులో ఎన్ని వారాలు ఉంటాడో చూడాలి?


