
అగ్నిపరీక్షలో దుమ్ము లేపింది శ్రీజ దమ్ము (Srija Dammu). ఏ టాస్క్ ఇచ్చినా చకచకా ఆడేసేది. బ్రేకుల్లేని బైకులా మాట్లాడటం మొదలుపెడితే ఆపేదే కాదు. ఫుల్ ఎనర్జీతో తెలుగు బిగ్‌బాస్ తొమ్మిదో సీజన్ (Bigg Boss Telugu 9)లో అడుగుపెట్టింది. కానీ, ఇక్కడకు వచ్చాక సీన్ రివర్స్ అయింది. తనకు ఉన్న క్రేజ్, వచ్చిన పాజిటివిటీ అంతా కూడా నెగెటివ్‌గా మారింది.
గంజి తాగి స్కూలుకి..
ప్రతివిషయానికి నోరేసుకుని పడిపోవడంతో శ్రీజపై నెట్టింట ట్రోల్ జరిగింది. అయితే తనపై వ్యతిరేకత వస్తున్న విషయం గ్రహించి శ్రీజ తనను తాను మార్చుకునే ప్రయత్నం చేసింది. కాస్త సైలెంట్ అయిపోయింది. ఆటలో మాత్రం శివంగిలా ఆడుతోంది. తాజాగా శ్రీజ తండ్రి దమ్ము శ్రీనివాసరావు ఓ ఇంటర్వ్యూలో తన కుటుంబం గురించి అనేక విషయాలు పంచుకున్నారు. ఆయన మాట్లాడుతూ.. శ్రీజ చిన్నప్పుడు గంజి తాగి స్కూలుకు వెళ్లేది.
సన్మానించారు
తనకు ఒక్క మార్కు తక్కువ వేసినా ఊరుకునేది కాదు. ఏదైనా అనుకుంటే సాధించి తీరుతుంది. అగ్నిపరీక్షకు వెళ్లే ఒకరోజు ముందు తను సెలక్ట్ అయినట్లు చెప్పింది. తనకు మేమెప్పుడూ అడ్డు చెప్పలేదు. బిగ్‌బాస్‌కు వెళ్తానంటే సరేనన్నాం. ఎంతోమందిని దాటుకుని షో దాకా వెళ్లడమే గొప్ప విషయం. వైజాగ్ అమ్మాయి శ్రీజ.. బిగ్‌బాస్‌కు వెళ్లిందంటూ నన్ను పిలిచి మా ఊర్లో సన్మానం చేశారు.
కించపరిచేలా ట్రోలింగ్
నేను పారిశుద్ధ్య కార్మికుడిని. నా వృత్తిని కించపరిచేలా ట్రోలింగ్ వీడియోలు చేస్తున్నారు. చెత్త తీసుకెళ్లడం అంటే మామూలు విషయం కాదు. అందులోనూ చేతులతో చెత్త పట్టుకోవడం అంత ఈజీ కాదు. నా కూతురు చెత్త బ్యాగ్ పట్టుకున్న వీడియోను.. చెత్తబండివచ్చిందమ్మా చెత్తబండి అన్న వాయిస్ పెట్టి ట్రోల్ చేస్తున్నారు. నేను ఇంటింటికి వెళ్లి చెత్త తీస్తా.. నా పనిని కించపరుస్తూ నా కూతురిపై కామెంట్లు చేస్తున్నారు. ఈ విషయంలో చాలా బాధేసింది అని చెప్పుకొచ్చారు. కాగా శ్రీజ.. రూ.2 లక్షల జీతం వచ్చే సాఫ్ట్‌వేర్ జాబ్‌ను పక్కన పెట్టి మరీ బిగ్‌బాస్‌కు వెళ్లడం విశేషం.