
టాలీవుడ్ నటి మంచు లక్ష్మీ ఈడీ విచారణ ముగిసింది. బెట్టింగ్ యాప్ కేసులో భాగంగా.. ఈ రోజు ఉదయం 11 గంటలకు బషీర్‌బాగ్‌లోని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కార్యాలయానికి వెళ్లిన మంచు లక్ష్మీని ఈడీ బృందం దాదాపు మూడున్నర గంటల పాటు విచారించింది. ఈ సందర్భంగా తన బ్యాంకు ఖాతాలకు సంబంధించిన ఐదేళ్ల లావాదేవీలను ఈడీ అధికారులకు లక్ష్మీ అందించారు. విచారణ అనంతరం మీడియాతో మాట్లాడకుండానే మంచు లక్ష్మీ వెళ్లిపోయారు.
బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన సెలబ్రిటీలకు జులై 21న ఈడీ సమన్లు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో జులై 30న ప్రకాశ్ రాజ్, ఈ నెల 6న విజయదేవరకొండ, 11న హీరో రానా ఈడీ ముందు హాజరయ్యారు. షెడ్యూల్ ప్రకారం ఈ రోజు మంచు లక్ష్మీ విచారణకు హాజరైంది. బెట్టింగ్ యాప్స్ కేసులో నమోదైన వేర్వేరు ఎఫ్‌ఐఆర్‌ల ఆధారంగా ఈడీ ఎన్‌ఫోర్స్‌మెంట్ కేస్ ఇన్‌ఫర్మేషన్ రిపోర్ట్(ఈసీఐఆర్) రిజిస్టర్ చేసిన సంగతి తెలిసిందే. లోన్ యాప్స్ ప్రచారకర్తలుగా వ్యవహరించిన మొత్తం 29 మందిని ఈసీఐఆర్‌లో చేర్చింది.