‘బాహుబలి: ద ఎటర్నల్’ పోస్టర్
ప్రభాస్ హీరోగా ఎస్‌ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించిన ‘బాహుబలి: ది బిగినింగ్’ (2015), ‘బాహుబలి: ది కన్‌క్లూజన్’ (2017) చిత్రాలు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను అలరించిన సంగతి తెలిసిందే. ఈ రెండు భాగాలను కలిపి ‘బాహుబలి: ది ఎపిక్’ పేరుతో 2025 అక్టోబరు 31న విడుదల చేశారు. ఇప్పుడు ‘బాహుబలి’ ఫ్రాంచైజీ నుంచి రానున్న యానిమేషన్ చిత్రం ‘బాహుబలి: ద ఎటర్నల్ వార్’.
ఈ మూవీకి రాజమౌళి సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. యానిమేషన్ కంటెంట్ తయారీలో నిష్ణాతుడు అయిన దర్శకుడు ఇషాన్ శుక్లా ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. ఆర్కా మీడియా వర్క్స్ నిర్మిస్తున్న ఈ మూవీ 2027లో విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించిన టీజర్ కూడా ఇప్పటికే రిలీజ్ అయింది. ఇదిలా ఉంటే... ‘బాహుబలి: ద ఎటర్నల్ వార్’ ఈ నెలాఖరులో ఫ్రాన్స్‌లో జరగనున్న ప్రతిష్టాత్మక ‘ఎన్నేసి యానిమేషన్ ఫెస్టివల్ 2026’లో ‘వర్క్ ఇన్ ప్రోగ్రెస్’ విభాగంలో ప్రదర్శనకు ఎంపిక అయిన విషయం తెలిసిందే.
ఈ సినిమాకి సంబంధించిన టికెట్ బుకింగ్స్‌ను నిర్వాహకులు ప్రారంభించగా కేవలం రెండు నిమిషాల్లోనే టికెట్లన్నీ అమ్ముడుపోవడం విశేషం. దీన్ని బట్టి చూస్తే ‘బాహుబలి’ ఫ్రాంచైజీపై ప్రపంచ దేశాల్లో ఉన్న క్రేజ్ ఇప్పటికీ ఏమాత్రం తగ్గలేదని అర్థం అవుతోంది. ‘స్పైడర్‌మ్యాన్ ఇన్ టు ది స్పైడర్ వర్స్, ఫ్లో’ వంటి హాలీవుడ్ చిత్రాలు గతంలో ‘వర్క్ ఇన్ ప్రోగ్రెస్’ విభాగంలో ప్రదర్శితం కాగా ఈ ఘనతను ఇప్పుడు భారతీయ సినిమా ‘బాహుబలి: ది ఎటర్నల్ వార్’ సాధించడం విశేషం.


