
అల్లు వారి ఇంట్లో శుభకార్యం. బన్నీ సోదరుడు, హీరో అల్లు శిరీష్ నిశ్చితార్థం చేసుకోబోతున్నాడు. ఈ విషయాన్ని అధికారికంగా సోషల్ మీడియాలో ప్రకటించాడు. ఈ మధ్యనే మూడు నాలుగు రోజుల క్రితం శిరీష్ పెళ్లి గురించి రూమర్స్ వచ్చాయి. ఇప్పుడు వాటిని నిజం చేస్తూ ఇన్ స్టాలో ఫొటోలు పోస్ట్ చేశాడు. నయనిక అనే అమ్మాయితో తన ఎంగేజ్‌మెంట్ జరగనుందని చెప్పుకొచ్చాడు.
(ఇదీ చదవండి: ఓటీటీలోకి 'కురుక్షేత్ర'.. ట్రైలర్ రిలీజ్)
'మా తాతయ్య అల్లు రామలింగయ్య జయంతి సందర్భంగా నా మనసుకు సంబంధించిన ఓ విషయం చెప్పాలనుకుంటున్నాను. నయనికతో నాకు నిశ్చితార్థం అక్టోబరు 31న జరగనుంది. కొన్నాళ్ల క్రితమే చనిపోయిన మా నానమ్మ నేను పెళ్లి చేసుకోవాలని ఎప్పుడూ కోరుకునేది. ఇప్పుడు ఆమె మా మధ్య లేనప్పటికీ పైనుంచి ఆశీర్వదాలు కచ్చితంగా ఇస్తారని అనుకుంటున్నాను' అని శిరీష్ ఇన్ స్టాలో పోస్ట్ పెట్టాడు.
అల్లు అరవింద్ కొడుకుగా అందరికీ తెలిసిన శిరీష్.. 'గౌరవం' మూవీతో హీరోగా పరిచయమయ్యాడు. తర్వాత కొత్త జంట, శ్రీరస్తు శుభమస్తు, ఒక్క క్షణం, ఏబీసీడీ, ఊర్వశివో రాక్షసివో, బడ్డీ తదితర చిత్రాలు చేశాడు. గత ఏడాదిన్నర కాలంగా కొత్త ప్రాజెక్టులు చేయట్లేదు. దీంతో ఏం చేస్తున్నాడా అని అందరూ అనుకున్నారు. ఇప్పుడు అకస్మాత్తుగా నిశ్చితార్థం చేసుకోబోతున్నట్లు ప్రకటించి షాకిచ్చాడు.
(ఇదీ చదవండి: ధనుష్ 'ఇడ్లీ కొట్టు' సినిమా రివ్యూ)