ధనుష్ 'ఇడ్లీ కొట్టు' సినిమా రివ్యూ | Idli Kottu Movie Telugu Review | Sakshi
Sakshi News home page

Idli Kottu Review: ఇడ్లీ కొట్టు స్టోరీతో మూవీ.. ఎలా ఉందంటే?

Oct 1 2025 1:19 PM | Updated on Oct 1 2025 1:35 PM

Idli Kottu Movie Telugu Review

ధనుష్ పేరుకే తమిళ హీరో కానీ.. సార్, కుబేర లాంటి తెలుగు సినిమాల్లోనూ నటించి మన ప్రేక్షకులకూ దగ్గరయ్యాడు. గతంలో రెండు మూడు చిత్రాలకు దర్శకత్వం వహించిన ఇతడు.. ఇప్పుడు అలా లీడ్ రోల్ చేసి దర్శకత్వం వహించి నిర్మించిన మూవీ 'ఇడ్లీ కొట్టు'. పెద్దగా ప్రమోషన్ చేయకుండానే తెలుగులోనూ తాజాగా (అక్టోబర్ 01) థియేటర్లలో రిలీజైంది. ఇంతకీ ఈ సినిమా ఎలా ఉంది? అనేది రివ్యూలో చూద్దాం.

కథేంటి?
శంకరాపురం అనే ఊరిలో శివకేశవ(రాజ్ కిరణ్) ఓ ఇడ్లీ కొట్టు నడుపతుంటాడు. ఈ షాపులోని ఇడ్లీ.. చుట్టుపక్కలా చాలా ఫేమస్. ఇతడి కొడుకు  మురళి(ధనుష్) మాత్రం తండ్రిలా ఊరిలో ఉండటం తన వల్ల కాదని, హొటల్ మేనేజ్‌మెంట్ చదువుతాడు. జాబ్ కోసం కుటుంబాన్ని వదిలిపెట్టి బ్యాంకాక్ వెళ్లిపోతాడు. కొన్నాళ్ల తర్వాత తను పనిచేస్తున్న కంపెనీ ఓనర్ విష్ణువర్ధన్ (సత్యరాజ్) కూతురు మీరా (షాలినీ పాండే)తోనే పెళ్లికి సిద్ధమవుతాడు. సరిగ్గా పెళ్లికి రెండు మూడు రోజులు ఉందనగా శివకేశవ చనిపోతాడు. దీంతో మురళి.. సొంతూరికి వస్తాడు. తర్వాత ఏమైంది? విష్ణువర్ధన్ కొడుకు అశ్విన్(అరుణ్ విజయ్)తో మురళికి గొడవేంటి? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.

ఎలా ఉందంటే?
ఓ కొడుకు.. కుటుంబ భవిష్యత్ కోసం భార్య పిల్లల్ని వదిలిపెట్టి మరీ పరాయి దేశంలో ఆరేళ్లు పనిచేస్తాడు. కొన్ని కారణాల వల్ల సొంతూరికి వస్తాడు. కన్నతల్లిని ఆప్యాయంగా పలకరిస్తే.. ఎవరు బాబు నువ్వు? అని అడుగుతుంది. నేను అమ్మ నీ కొడుకుని అంటే.. నా కొడుకు పేరు నీ పేరు ఒకటే అని అమాయకంగా అంటుంది తప్పితే కొడుకుని గుర్తుపట్టదు. దీంతో కొడుకు నోట మాటరాదు. ఒక్కసారిగా గుండె పగిలినంత పనవుతుంది. ఇది చెబుతున్నప్పుడు మీకు ఎలా అనిపించిందో తెలీదు గానీ సినిమాలో ఈ సీన్ చూస్తున్నప్పుడు మాత్రం మనలో చాలామందికి గుండె కలుక్కుమంటుంది. ఎందుకంటే ఊరిని విడిచిపెట్టి ఎక్కడెక్కడి వెళ్లి ఉద్యోగాలు చేసే చాలామందికి ఈ సీన్ కన్నీళ్లు పెట్టిస్తుంది. ఇదే కాదు 'ఇడ్లీ కొట్టు' చూస్తున్నంత సేపు మీ సొంతూరు, అక్కడి మనుషులు, వాతావరణం ఇలా ప్రతిదీ గుర్తొస్తుంది.

తెలుగులో తక్కువ గానీ తమిళ, మలయాళంలో అచ్చం మనకథలానే ఉందే అనిపించే సినిమాలు అడపాదడపా వస్తుంటాయి. ఇది కూడా అలాంటి ఓ చిత్రమే. స్టోరీ పరంగా చూస్తే ఇందులో కొత్తేం లేదు. చాలాసార్లు చూసిన కథే. కానీ ఎమోషన్ ఎంత వర్కౌట్ అయిందా? చూస్తున్నంతసేపు ఫీలయ్యామా లేదా ముఖ్యం. ఈ విషయంలో ధనుష్ అటు నటుడిగా ఇటు దర్శకుడిగా మంచి మార్కులు తెచ్చుకున్నాడు.

స్టోరీ సింపుల్‌గానే ఉండటం వల్ల రెండున్నర గంటల సినిమా కాస్త సాగదీతగానే అనిపిస్తుంది. ఒక్కసారి మూవీలోని ఎమోషన్‪‌కి కనెక్ట్ అయితే మాత్రం కన్నీళ్లు వస్తాయి. కచ్చితంగా ఎమోషనల్ అయిపోతాం. అలాంటి సీన్లు ఐదారు వరకు ఉన్నాయి. ట్రైలర్‌లో ఏదైతే చూపించారో దాదాపు స్టోరీ అదే. కాకపోతే తమిళ చిత్రాల్లో ఉన్నట్లు మనకు కావాల్సిన వాళ్లు చనిపోవడం, తద్వారా హీరో పడే బాధ, దాన్నుంచి వచ్చే ఎమోషన్స్ ఇలా ఈ తరహా సినిమాలు మీకు సెట్ అవుతాయి అనుకుంటే కళ్లు మూసుకుని వెళ్లిపోవచ్చు.

చనిపోయిన తండ్రిని.. మన హీరో ఆయన ఎంతో ప్రేమగా చూసుకున్న ఇడ్లీ కొట్టులోనూ, ఇంట్లో పెంచుకుంటున్న దూడలోనూ చూడటం.. దీని బ్యాక్ డ్రాప్‌లో వచ్చే సన్నివేశాలు అబ్బా భలే ఉన్నాయే అనిపిస్తాయి. ప్రారంభంలో కనిపించిన కొన్ని పాత్రలు ఊహించనట్లుగానే విలనీ షేడ్స్‌తో కనిపించి చివరకొచ్చేసరికి హీరోగా అండగా నిలబడటం లాంటివి ముందే అర్థమయిపోతాయి. కానీ వాటిని చూపించిన విధానం బాగుంది. ఈ మూవీ చూసిన తర్వాత కచ్చితంగా సొంతూరు, మన మనుషులు, మన మట్టిని ఎంతగా మిస్ అవుతున్నామో కదా అని కచ్చితంగా అనిపిస్తుంది.

ఎవరెలా చేశారు?
ధనుష్‌కి ఇలా అండర్ ప్లే చేసే పాత్రల్లో నటించడం కొట్టిన పిండి. అలా మురళిగా సాలిడ్ ఫెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. కల్యాణిగా నిత్యామేనన్, అశ్విన్‌గా అరుణ్ విజయ్ అదరగొట్టేశారు. ఇదే సినిమాలో సత్యరాజ్, సముద్రఖని, పార్తిబన్ లాంటి సీనియర్స్ కూడా ఉన్నారు. వీళ్లకు తక్కువ స్కోప్ దొరికిందా కానీ ఎక్కడా అతి చేయకుండా సహజంగా నటించారు. ధనుష్ తండ్రి శివకేశవగా ఒకప్పటి నటుడు రాజ్ కిరణ్ బాగా చేశారు. మీరా పాత్రలో షాలినీ పాండే బాగుంది. మిగిలిన నటీనటులు ఓకే.

టెక్నికల్ అంశాలకొస్తే జీవీ ప్రకాశ్ కుమార్ బీజీఎం బాగుంది కానీ పాటలే పెద్దగా ఎక్కవు. సినిమాటోగ్రఫీ రిచ్‌గా ఉంది. నటుడిగా ధనుష్‌ని వంక పెట్టడానికి ఏం లేదు కానీ దర్శకుడిగా మాత్రం ఎందుకో పూర్తిగా సంతృప్తి పరచలేకపోయాడు. తమిళ ఆడియెన్స్ ఈ సినిమాకు ఫిదా అయిపోవచ్చు గానీ తెలుగు ప్రేక్షకుల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి? ఫ్లాట్ స్టోరీ, ఊహించినట్లు ఉండే స్క్రీన్ ప్లే దీనికి కారణం కావొచ్చు. ఓవరాల్‌గా చూసుకుంటే మాత్రం ఓ సెట్ ఆఫ్ ఆడియెన్స్‌కి నచ్చే సినిమా ఇది. తెలుగు డబ్బింగ్ బాగుంది. కుటుంబంతో కలిసి చూడొచ్చు.

- చందు డొంకాన

Rating:
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement