సినిమా పెద్దదా.. చిన్నదా అన్నది కాదు, ప్రేక్షకుల్లో దానిపై ఎలాంటి ఆసక్తి ఉందన్నదే ముఖ్యం. భారీ కాంబినేషన్, పేరున్న హీరోలు, పేరున్న దర్శకులు.. ఇవన్నీ సినిమాపై అంచనాలను పెంచుతాయి. కానీ ఆ అంచనాలను ప్రేక్షకుల్లో ఆసక్తిగా మార్చడమే అసలు సవాల్. ఇప్పుడు తెలుగులో విడుదలకు సిద్ధమవుతున్న రెండు సినిమాల విషయంలో ఇదే చర్చ నడుస్తోంది. మరో రెండు రోజుల్లో థియేటర్లలోకి రానున్న ఈ చిత్రాలపై ఇప్పటికీ ఆశించిన స్థాయిలో బజ్ కనిపించడం లేదు.
విక్టరీ వెంకటేశ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో సినిమా అంటే ప్రేక్షకుల్లో సహజంగానే అంచనాలు ఉంటాయి. వెంకీ కామెడీ టైమింగ్, త్రివిక్రమ్ మార్క్ సంభాషణలు, కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకునే కథ.. ఈ అంశాలను దృష్టిలో పెట్టుకుని ‘ఆదర్శ కుటుంబం’పై మొదట్లో ఆసక్తి ఏర్పడింది. అయితే సినిమా విడుదల సమయం దగ్గరపడుతున్న కొద్దీ ఆ అంచనాలకు తగ్గట్టుగా హైప్ పెరగడం లేదు.
ఇప్పటివరకు విడుదలైన ప్రచార చిత్రాలు ప్రేక్షకుల్లో పెద్దగా ఆసక్తిని రేకెత్తించలేకపోయాయి. ‘నారాయణమ్మ’, ‘మాలా’ పాటలు కూడా ఆశించిన స్థాయిలో రీచ్ సాధించలేదు. భారీ కాంబినేషన్ నుంచి సినిమా వస్తున్నప్పుడు పాటలు, పోస్టర్లు, గ్లింప్స్ ఇలా ప్రతి ప్రమోషనల్ కంటెంట్ చర్చకు దారితీయాలి. కానీ ‘ఆదర్శ కుటుంబం’ విషయంలో ఆ ప్రభావం అంతగా కనిపించడం లేదు.
(చదవండి: శ్రీనిధి శెట్టి పాదాలకు నమస్కరించిన త్రివిక్రమ్.. అసలేం జరిగింది?)
ట్రైలర్ విడుదలైన తర్వాత మాత్రం సినిమాపై కొంత ఆసక్తి పెరిగింది. బజ్ కూడా క్రియేట్ అయింది. అయితే త్రివిక్రమ్-వెంకీ కాంబినేషన్‌కి ఇప్పుడున్న బజ్ చాలా తక్కువనే చెప్పాలి. సినిమా విడుదల తర్వాత ప్రేక్షకుల స్పందన ఎలా ఉంటుందో చూడాలి.
మరోవైపు విశ్వక్ సేన్ నటిస్తున్న ‘కల్ట్’ విషయంలోనూ దాదాపు ఇదే పరిస్థితి కనిపిస్తోంది. గత కొంతకాలంగా సరైన విజయాన్ని అందుకోవాలని చూస్తున్న విశ్వక్ సేన్‌కు ఈ సినిమా కీలకంగా మారింది. ఇలాంటి సమయంలో వస్తున్న సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి పెంచేందుకు ప్రమోషన్లు కీలక పాత్ర పోషించాలి. కానీ ‘కల్ట్’ ప్రచార కార్యక్రమాలు మాత్రం ఇప్పటివరకు భారీ స్థాయిలో హైప్ తీసుకురాలేకపోయాయి.
ఈ సినిమా ట్రైలర్ ఒక వర్గం ప్రేక్షకులకు నచ్చింది. అయితే ట్రైలర్‌కు వచ్చిన స్పందన సినిమాపై భారీ అంచనాలు ఏర్పడే స్థాయిలోకి వెళ్లలేదు. సినిమా కాన్సెప్ట్, కథలోని ప్రత్యేకత, విశ్వక్ సేన్ పాత్ర వంటి అంశాలపై ప్రేక్షకుల్లో మరింత ఆసక్తి పెంచేలా ప్రచారం జరిగి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదనే అభిప్రాయం ఉంది.
అయితే బజ్ తక్కువగా ఉందని సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకోలేవని ముందుగానే నిర్ణయించలేం. కంటెంట్ బాగుంటే మౌత్ టాక్‌తో సినిమాలు పుంజుకునే అవకాశమూ ఉంటుంది. మరి ఈ రెండు సినిమాలు థియేటర్లలోకి వచ్చాక ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తాయా? లేక విడుదలకు ముందు కనిపించిన నిరాసక్తతే వసూళ్లపైనా ప్రభావం చూపిస్తుందా? తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.


