
సినిమా అనేది మాయా ప్రపంచం. స్టార్‌డమ్ ఉన్నంతకాలం వెండితెరపై ఓ వెలుగు వెలుగుతారు. కానీ ఫేడవుట్ అయ్యాక ఎవరూ పట్టించుకోరు. అప్పటిదాకా టిప్‌టాప్‌గా ఉన్న సెలబ్రిటీ బికారిగా మారినా ఆశ్చర్యపోనక్కర్లేదు. చేతినిండా సంపాదించిన తారలు చేతులు చాచి సాయం కోసం అర్థించే దీన పరిస్థితులూ ఎదురు కావొచ్చు. పైన కనిపిస్తున్న హీరో ఇప్పుడలాంటి స్థితిలోనే ఉన్నాడు. తనకు సాయం చేయమని రెండు చేతులు జోడించి వేడుకుంటున్నాడు.
సినిమా
ఇంతకీ ఆ హీరో మరెవరో కాదు అభినయ్ కింగర్ (Abhinay Kinger). మలయాళ ప్రముఖ నటి టి.పి. రాధామణి కుమారుడే అభినయ్. తళుల్లువదో ఇళమై సినిమాతో నటుడిగా పరిచయమయ్యాడు. జంక్షన్ అనే తమిళ మూవీలో హీరోగా నటించాడు. సక్సెస్, దాస్, పొన్ మేఘలై, సొల్ల సొల్ల ఇనిక్కుం, అరుముగం, ఆరోహణం వంటి పలు తమిళ చిత్రాల్లో కీలక పాత్రల్లో నటించాడు. మలయాళ సినిమాల్లోనూ యాక్ట్ చేశాడు. చివరగా 2014లో వచ్చిన వల్లవణుక్కు పుళ్లుం ఆయుధం సినిమా చేశాడు.
ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రమే
విద్యుత్ జమ్వాల్, మిలింద్ సోమన్, బాబు ఆంటోని వంటి నటులకు డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా తన గొంతు అరువిచ్చాడు. సినిమాలతో పాటు పలు వాణిజ్య ప్రకటనల్లోనూ కనిపించాడు. అయితే అభినయ్.. దాదాపు దశాబ్దకాలంగా వెండితెరకు దూరంగా ఉంటున్నాడు. ఇండస్ట్రీలో మంచి పేరుప్రఖ్యాతలు సంపాదించుకున్న ఇతడు కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. దానికి తోడు అతడి ఆర్థిక పరిస్థితి కూడా అస్సలు బాగోలేదు. ప్రభుత్వం నడిపే క్యాంటీన్‌లో తింటూ బతుకు నెట్టుకొస్తున్నాడు. పూట గడవడమే కష్టంగా ఉన్న ఇతడు కాలేయ వ్యాధితో బాధపడుతున్నాడు. ఇప్పుడా వ్యాధి ముదిరిందని, తాను కొంతకాలం మాత్రమే బతుకుతానని దీనంగా చెప్తున్నాడు.
కొన్నాళ్లే బతుకుతా..
తాజాగా ఈ నటుడి దుస్థితి గురించి తెలుసుకున్న తమిళ కమెడియన్ కేపీవై బాలా.. అభినయ్‌ను కలిసి రూ.1 లక్ష ఆర్థిక సాయం చేశాడు. ఈ సందర్భంగా అభినయ్.. నేను ఏడాదిన్నర మాత్రమే బతుకుతానని డాక్టర్స్ చెప్పారని తెలిపాడు. ఆ మాటతో భావోద్వేగానికి లోనైన బాలా.. నీకు తప్పకుండా నయమవుతుంది, మళ్లీ సినిమాలు చేస్తావు అని ధైర్యం చెప్పాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన ప్రేక్షకులు.. అభినయ్ బక్కచిక్కిపోయి గుర్తుపట్టలేనంతగా మారిపోయాడని అంటున్నారు. అభినయ్‌కు సాయం చేసినందుకు బాలాను మెచ్చుకుంటున్నారు.
చదవండి: జాతీయ సినీ అవార్డులు.. ప్రైజ్‌మనీ ఎంత? ఎవరికి ఏమేం ఇస్తారంటే?