
టైటిల్ : కాళిధర్ లపతా
నటీనటులు: అభిషేక్ బచ్చన్, దైవిక్ భగేలా, జీషన్ అయూబ్, నిమ్రత్ కౌర్
ఓటీటీ: జీ5
దర్శకత్వం: మధుమిత
ఇటీవల కొన్ని సినిమాలు ఎక్కువగా నేరుగా ఓటీటీలోనే విడుదలవుతున్నాయి. చిన్న చిత్రాలు అయినా కంటెంట్ బాగుంటే ఓటీటీలో అదరగొట్టేస్తున్నాయి. ఇటీవల తెలుగులో 'ఉప్పు కప్పురంబు' డైరెక్ట్‌గా ఓటీటీకి వచ్చేసింది. అదే రోజు బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్ కీలక పాత్రలో నటించిన మూవీ 'కాళిధర్ లపతా' సైతం ఓటీటీలోనే విడుదలైంది. మతిస్థిమితం లేని ఓ వ్యక్తి కథ ఆధారంగా వచ్చిన చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. తమిళ చిత్రం 'కె.డి. ఎ. కరుప్పు దురై' సినిమాకు ఇది రీమేక్.
కాళిధర్(అభిషేక్ బచ్చన్)ను మతిస్థిమితం లేని వ్యక్తి. ఇద్దరు తమ్ముళ్లు, ఒక సోదరితో కలిసి నివసిస్తూ ఉంటాడు. జ్ఞాపకశక్తి లోపంతో బాధపడుతున్న అతని వైద్య ఖర్ఛులు భరించలేక కుటుంబం వదిలించుకోవాలనుకుంటుంది. కంభమేళాలో వదిలించుకోవాలని తోబుట్టువులు ప్లాన్ చేస్తున్నారన్న విషయం అతనికి తెలుస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందన్నదే అసలు కథ. కాళిధర్ (అభిషేక్ బచ్చన్)తోనే ఈ కథ ప్రారంభమవుతుంది. తన కుటుంబ సభ్యుల గురించి తెలుసుకున్న కాళిధర్ తానే దూరంగా వెళ్లిపోవాలని నిర్ణయించుకుంటాడు. ఓ బస్సు ఎక్కి కుటుంబాన్ని వదిలి దూరంగా వెళ్లిపోతాడు. ఆ తర్వాతే అసలు కథ మొదలవుతుంది.

ఓ గ్రామానికి చేరుకున్న కాళిధర్ అక్కడే ఉన్న ఆలయంలో రాత్రి నిద్రపోతాడు. అక్కడే అతనికి ఎనిమిదేళ్ల బాలుడు బల్లుతో(దైవిక్ భగేలా)తో పరిచయం ఏర్పడుతుంది. ఆ తర్వాత అతని జీవితం మలుపు తిరుగుతుంది. వీరిద్దరు వయస్సుతో సంబంధం లేకుండా స్నేహితులుగా ఉంటారు. అయితే కాళిధర్‌కు మతిస్థిమితం లేదని తెలుసుకున్న బల్లు.. అతన్ని ఇబ్బంది పెడుతుంటాడు. కాళిధర్‌ను కేడీ అని పిలుస్తూ ఆటపట్టిస్తుంటాడు. అలా వీరిద్దరు అనాథలే కావడంతో ఒకరికి ఒకరు తోడుగా ఉంటారు. ఈ కథ మొత్తం మధ్యప్రదేశ్‌లో గ్రామాల్లోనే జరుగుతుంది. ఫస్ట్ హాఫ్‌లో ఇద్దరి పరిచయం, గ్రామాల్లో తిరగడం చుట్టే ఉంటుంది. కథ నెమ్మదిగా సాగుతున్నట్లు అనిపిస్తుంది.
ఓ సారీ కేడీ(కాళిధర్) అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరినప్పుడు బల్లు వ్యవహరించిన తీరు ఆడియన్స్‌ను ఆలోచింపజేస్తుంది. ఎనిమిదేళ్ల పిల్లాడు మాట్లాడిన తీరు ఆడియన్స్‌ను ఆశ్చర్యానికి గురి చేస్తుంది. మన కోణంలో చూస్తే వాస్తవానికి దూరంగానే ఉన్నట్లు అనిపిస్తుంది. కాళిధర్, బల్లు మధ్య వచ్చే సీన్స్ ఆడియన్స్‌కు ఎమోషనల్‌గా కనెక్ట్ అవుతాయి. వీరి మధ్య భావోద్వేగ క్షణాలతో పాటు కామెడీ సన్నివేశాలు కూడా ప్రేక్షకులను కట్టిపడేస్తాయి. కుటుంబమే వద్దనుకున్న ఓ వ్యక్తి జీవితం ఎలా మలుపు తిరిగిందనే విషయాన్ని డైరెక్టర్ ఎమోషనల్‌గా ఆడియన్స్‌కు చూపించారు. వదిలించుకోవాలని చూసిన వాళ్లు సైతం అతని కోసం గ్రామాల వెంట తిరగడం చూస్తే మానవీయ కోణంలోనూ సందేశమిచ్చారు మధుమిత. అయితే కొన్ని సీన్స్ చాలా లాజిక్‌లెస్‌గా అనిపిస్తాయి. అయితే కొన్ని సన్నివేశాల్లో భావోద్వేగాలు వర్కవుట్ కాలేదు. ఓవరాల్‌గా చూస్తే ఓ ఇద్దరు అనాథల ఎమోషనల్ స్టోరీనే కాళిధర్ లపతా. స్నేహానికి వయస్సు అడ్డంకి కాదని మరో సందేశం కూడా ఇచ్చాడు.
ఈ సినిమాలో మతిస్థిమితం లేని వ్యక్తిగా తనపాత్రలో అభిషేక్ బచ్చన్ అలరించాడు. అమాయకంగా కనిపిస్తూ తన పాత్రకు న్యాయం చేశాడు.ఎనిమిదేళ్ల బాలుడి పాత్రలో దైవిక్ భగేలా మెప్పించాడు. అభిషేక్ బచ్చన్‌తో పోటీపడి మరి నటించాడు. కాళిధర్‌ను ప్రేమించే అమ్మాయిగా.. నిమ్రత్ కౌర్ తన పాత్ర పరిధిలో అలరించింది. కాళిధర్‌ను కనుగొనే పాత్రలో మొహమ్మద్ జీషన్ అయూబ్ పెద్దగా ప్రాధాన్యత లేని పాత్రలో కనిపించాడు. సాంకేతికత విషయానికొస్తేఅమిత్ ద్వివేది నేపథ్యం సంగీతం ఫర్వాలేదు. అమితోష్ నాగ్‌పాల్ స్క్రీన్ ప్లే బాగుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగానే ఉన్నాయి.