స్పందించిన ఎమ్మెల్యే సునీతారెడ్డి
శివ్వంపేట(నర్సాపూర్): మండల కేంద్రంలో పబ్లిక్ టాయిలెట్స్ లేని విషయం గురించి శుక్రవారం ‘ఉగ్గబట్టుకుంటున్నారు’శీర్షికతో శుక్రవారం‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి ఎమ్మెల్యే సునీతారెడ్డి స్పందించారు. కలెక్టర్, జిల్లా వైద్యాధికారికితో ఫోన్‌లో మాట్లాడారు. శివ్వంపేటలో పబ్లిక్ టాయిలెట్స్ లేక ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని స్థల ఎంపిక చేయాలని సూచించారు. టాయిలెట్స్ నిర్మాణానికి సంబంధించి నిధులు సమకూర్చనున్నట్లు ఎమ్మెల్యే సునీతారెడ్డి తెలిపారు.
ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్‌రెడ్డి
పాపన్నపేట(మెదక్): రాష్ట్ర ప్రభుత్వం పీఆర్‌సీ నివేదికను వెంటనే ప్రకటించాలని, ఉద్యోగులకు ఇవ్వాల్సిన డీఏ బకాయిలను చెల్లించాలని ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఏడుపాయల దుర్గాభవానీమాతను శుక్రవారం దర్శించుకుని ఆయన ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం సెప్టెంబర్ 1న ఇందిరాపార్క్ వద్ద తలపెట్టిన ధర్నాను విజయవంతం చేయాలన్నారు. 2003 డీఎస్సీ టీచర్లకు పాత పింఛన్ విధానాన్ని ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు. ఎంప్లాయ్ హెల్త్ స్కీంను రాష్ట్రంలోని అన్ని కార్పొరేట్ ఆస్పత్రుల్లో అమల్లోకి తేవాలని కోరారు.
ఫ్లెక్సీల చించివేత, కేసులు నమోదు
తూప్రాన్: మహంకాళి జాతర సందర్భంగా మరోసారి కాంగ్రెస్‌లో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. ఒక వర్గం ఫ్లెక్సీలు ఏర్పాటు చేయగా మరో వర్గం వాటిని చించివేసింది. ఈ వ్యవహారం చివరకు ఫిర్యాదులు, పోలీసు కేసుల వరకు వెళ్లింది. తూప్రాన్‌లో మహంకాళమ్మ ఆలయంలో ఆదివారం నుంచి జాతర వేడుకలు ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీ పార్టీలు పట్టణంలో విస్తృతంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశాయి. ఇక్కడే కాంగ్రెస్ వర్గాల మధ్య విభేదాలు బహిర్గతమయ్యాయి. కాంగ్రెస్ సీనియర్ నాయకులు మైనంపల్లి హన్మంతరావుకు చెందిన ఒక వర్గం, గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి వర్గం రెండు వర్గాలుగా అధిపాత్య పోరాటం కొనసాగిస్తున్నాయి. ఇందులో భాగంగా తమ ఫ్లెక్సీలను చించి వేశారంటూ మైనంపల్లి వర్గానికి చెందిన పట్టణ శాఖ అధ్యక్షుడు గరిగే నర్సింగ్‌రావు శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు ఏర్పుల సాయికుమార్, తదితరులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ గంగరాజు తెలిపారు.
సదాశివపేట రూరల్ (సంగారెడ్డి): జైల్ భరో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు ప్రవీణ్ కుమార్ పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఈ నెల 10న జైలుభరో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతూ మండలంలోని కంబాలపల్లి,రేజింతల్ తదితర గ్రామాల్లో శుక్రవారం ఆటో ప్రచార జాత నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ...కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మికులకు నష్టం చేసే నాలుగు లేబర్ కోడ్స్‌ను రద్దు చేయాలన్నారు. జైలుభరో కార్యక్రమంలో కార్మికులు, రైతులు, వ్యవసాయ కూలీలు, పేద ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు.


