వెల్దుర్తి(తూప్రాన్): అధికారులు, ప్రజాప్రతినిధులు కలసికట్టుగా పనిచేస్తేనే గ్రామాలు అభివృద్ధి సాధిస్తాయని ఎమ్మెల్యే సునీతారెడ్డి తెలిపారు. వెల్దుర్తి ఎంపీడీఓ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన మండలస్థాయి సమావేశానికి ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి మండలంలోని అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాల అమలు, ప్రజాసమస్యలపై సమీక్ష నిర్వహించారు. విద్యుత్ అధికారుల తీరుపై మండలంలోని అన్ని గ్రామాల సర్పంచ్‌లు ఆగ్రహం వ్యక్తం చేశారు. వీధి దీపాలకు ప్రత్యేక లైన్ ఏర్పాటు, భూమికి అతి తక్కువ ఎత్తులో ఉన్న ట్రాన్స్‌ఫార్మర్ల వద్ద రక్షణ చర్యలు, విద్యుత్ పోల్‌ల ఏర్పాటుతోపాటు ఇతర సమస్యలను పరిష్కరించడంలో లైన్‌మెన్లు, సిబ్బంది పట్టించుకోవడంలేదని వాపోయారు. మండల కేంద్రం వెల్దుర్తిలోనే తెలంగాణ పబ్లిక్ స్కూల్‌ను ఏర్పాటు చేయాలని, గ్రామ పంచాయతీలకు విద్యుత్ బిల్లులు నుంచి మినహాయింపు ఇవ్వాలని సమావేశంలో సర్పంచ్‌లు తీర్మానించి సంబంధిత కాపీని ఎమ్మెల్యేకు అందజేశారు.
వెల్దుర్తిలోనే తెలంగాణ పబ్లిక్ స్కూల్
మండల స్థాయి సమీక్షకు ఎమ్మెల్యే సునీతారెడ్డి హాజరయ్యారని తెలుసుకున్న వెల్దుర్తి గ్రామానికి చెందిన యువకులు ఎంపీడీఓ కార్యాలయం ఎదుట విద్యార్థులతో కలిసి బైఠాయించారు. మండల కేంద్రంలోనే పాఠశాల ఏర్పాటు చేయాలని ప్లకార్డులు ప్రదర్శించారు. నియోజకవర్గానికి తెలంగాణపబ్లిక్ స్కూల్ మంజూరుకాగా, మండల కేంద్రం వెల్దుర్తిలోని జూనియర్ కళాశాల వద్ద ఏర్పాటు చేయాలని తాను కలెక్టర్‌కు ప్రతిపాదనలు పంపినట్లు ఎమ్మెల్యే సునీతారెడ్డి తెలిపారు.
ఎమ్మెల్యే సునీతారెడ్డి


