ఈమె పేరు ఒడ్డె ఎల్లమ్మ. కొల్చారం మండల కేంద్రం గ్రామం. రాళ్లు కొట్టుకొని జీవనం సాగిస్తుంది. ఈమెకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. గ్రామ శివారులోని 707/1/8/1 సర్వే నంబర్‌లో ఎకరం పొలం ఉంది. ఇందులో తాతల కాలం నుంచి పంటలు పండిస్తూ కాస్తులో ఉన్నారు. పాత పట్టాదార్ పాస్ పుస్తకం కూడా ఉంది. కాని కొత్త పాస్‌బుక్ కోసం ఆరేళ్లుగా ప్రజావాణికి వస్తున్నారు. ఇప్పటివరకు అధికారులు సమస్యకు పరిష్కారం చూపలేదు.
ఈయన పేరు మస్కూరి రమేశ్. మనోహరాబాద్ మండలం రంగాయపల్లి గ్రామం. తనకున్న 4 ఎకరాల పొలంలో 2 ఎకరాలు విక్రయించాడు. బిడ్డ పెళ్లి కోసం అప్పులు కావడంతో బతుకుదెరువు నిమిత్తం పట్టణానికి వలసపోగా మరో రెండెకరాలు ఆక్రమణకు గురైంది. ఈ విషయంలో తనకు న్యాయం చేయాలంటూ గత ఐదేళ్లుగా తిరుగుతున్నాడు. ఇప్పటికీ న్యాయం జరగడం లేదంటూ బాధితుడు వాపోయారు.
ఈయన పేరు కాజిపేట లింగయ్య. నర్సా పూర్ మండల కేంద్రం. గ్రామ శివారులో 7 గుంటల పొలం ఉంది. అతడికి భార్యాపిల్లలు లేరు. బతుకుదెరువు కోసం వరంగల్ వెళ్లాడు. వచ్చేసరికి పక్క పొలం వ్యక్తి అతడి పొలాన్ని ఆక్రమించుకున్నాడు. ఆ 7 గుంటలను తన పొలంలో కలుపుకొని వెంచర్ చేస్తున్నాడు. బాధితుడు ఈ విషయమై పలుమార్లు ప్రజావాణిలో ఫిర్యాదు చేశాడు. అయినప్పటికీ ఎలాంటి ప్రయోజనం లేదు. ఎవరూలేని అనాథను తనకు న్యాయం చేయాలంటూ వేడుకుంటున్నాడు.
ఏళ్లుగా పరిష్కారానికి నోచుకోని సమస్యలు
మెదక్ కలెక్టరేట్: తమ సమస్యలు పరిష్కారం అవుతాయన్న ఆశతో జిల్లాలోని ఆయా మండలాల ప్రజలు ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి ప్రతి సోమవారం కలెక్టరేట్‌లో జరిగే ప్రజావాణికి వ స్తుంటారు. కాని ఏళ్ల తరబడి తమ సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ సమస్యలకు పరిష్కారం చూపనప్పుడు ప్రజావాణి ఎందుకంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా భూ ఆక్రమణలు, పట్టాదారు పాస్‌బుక్‌లు, పెన్షన్ల వంటి సమస్యలు ఏళ్ల తరబడి పరిష్కారానికి నోచుకోవడం లేదంటూ వాపోతున్నారు. గడిచిన 4 నెలల్లో ఇప్పటివరకు సుమారు 600లకు పైగా అర్జీలు రాగా, వాటిలో ఎన్ని పరిష్కరించారన్న వివరాలు లేకపోవడం గమనార్హం. ఫిర్యాదులు చేసిన వారే మళ్లీ మళ్లీ ప్రజావాణికి వస్తున్నారు. కాగా, సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో అదనపు కలెక్టర్ నగేశ్ పాల్గొని ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. మొత్తం 76 వినతులు వచ్చాయి. ఇలా ప్రతి వారం ప్రజలు తమ తమ సమస్యలపై సుమారు 100 వరకు వినతులు సమర్పిస్తున్నారు. కాని పరిష్కారం మాత్రం కొన్నింటికే లభిస్తుంది. మిగితా వారు ఏళ్ల తరబడి తిరుగుతున్నా పరిష్కారం లభించడం లేదు.


