రాజీపడుతున్నట్లు నమ్మించి.. మద్యం తాగించి.. యువకుడిని దారుణంగా..

- - Sakshi

మద్యం తాగించి ప్రాణం తీసిన నిందితుడు!

మృతుడు బోరబండ వాసి

కేసు నమోదుచేసిన పోలీసులు..

సాక్షి, మెదక్‌: నర్సాపూర్‌ అటవీ ప్రాంతంలో యువకుడు హత్యకు గురయ్యాడు. బుధవారం నర్సాపూర్‌ సీఐ షేక్‌ లాల్‌ మదర్‌ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మృతుడు సయ్యద్‌ నోమాన్‌ (26), మహమ్మద్‌ ఫారూఖ్‌ హైదరాబాద్‌ బోరబండలో నివాసం ఉంటున్నారు. మంగళవారం ఉదయం మద్యం మత్తులో వారిద్దరు గొడవపడ్డారు. దీంతో మహమ్మద్‌ ఫారూఖ్‌పై సయ్యద్‌ నోమాన్‌ దాడి చేయడంతో అతడు గాయపడ్డాడు.

వెంటనే బాధితుడు బోరబండ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు గాంధీ ఆసుపత్రికి వెళ్లి చికిత్స చేయించుకోవాలని సూచించారు. ఈ నేపథ్యంలో సయ్యద్‌ నోమన్‌ తనపై ఫిర్యాదు చేసిన విషయాన్ని తెలుసుకున్నాడు. గాంధీ ఆసుపత్రికి వెళ్లి తను తప్పుచేశానని ఫారుక్‌ను వేడుకోవడంతో వారిద్దరు రాజీ పడదామనుకున్నారు. ఆ విషయాన్ని బోరబండ పోలీసులకు ఫోన్‌చేసి తాము రాజీపడుతున్నట్లు తెలిపారు. అనంతరం ఇద్దరు ఓ మద్యం దుకాణానికి వెళ్లి మద్యం కొనుగోలుచేసి బోరబండకు వచ్చారు. ఈ క్రమంలో ఫారూఖ్‌ తను ఇంట్లోకి వెళ్లివస్తానని చెప్పి వెళ్లి వచ్చేటప్పుడు కత్తి తెచ్చాడు.

వారిద్దరు ఆటోలో నర్సాపూర్‌ – హైదరాబాద్‌ జాతీయ రహదారిలోని కొండాపూర్‌ అటవీ ప్రాంతం వైపు వచ్చారు. రాత్రి కావడంతో ఆటో డ్రైవర్‌ వెళ్తాననడంతో అతడికి కిరాయి ఇచ్చి పంపించారు. కొండాపూర్‌ సమీపంలో మద్యం తాగేందుకు కూర్చొన్నారు. పథకం ప్రకారం సయ్యద్‌ నోమన్‌కు మద్యం తాగించి తన వెంట తెచ్చుకున్న కత్తితో మహమ్మద్‌ ఫారూఖ్‌ తొమ్మిది చోట్ల పొడిచి హత్య చేశాడు. కాగా మృతుడు అవివాహితుడు. అతడి కుటుంబ వివరాలు తెలియాల్సి ఉందని, ఈ మెరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.
ఇవి చదవండి: ప్రియుడితో కలిసి.. భర్తను హత్య చేసి.. రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించి.. ఆపై

Read latest Medak News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top